రోజులు గడుస్తున్నా, కాలాలు మారుతున్నా ఇప్పుడు అందరి దృష్టి కరోనా పైనే ఉంది. ఎందుకంటే ఎటు నుంచి ఈ మహమ్మారి ముంచుకొస్తుందో తెలియని భయంతోనే అందరూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇక మరోవైపు వృత్తిఉద్యోగాల రీత్యా బయటికి వెళ్లాల్సి వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే తమ తమ పనులను కొనసాగిస్తున్నారు చాలామంది. అయితే ఈ వర్షాకాలంలో వాతావరణంలో ఉండే తేమ కారణంగా బ్యాక్టీరియా, వైరస్, ఇతర ఇన్ఫెక్షన్లు త్వరగా విస్తరించే ప్రమాదం ఉంది. ఫలితంగా జలుబు, దగ్గు, జ్వరం.. వంటివి మరింత వేగంగా ఒకరి నుంచి మరొకరికి అంటుకుంటాయి. అసలే కరోనాతో సతమతమవుతున్న ఈ రోజుల్లో మనం అప్పుడో ఇప్పుడో తుమ్మినా, దగ్గినా అది కరోనానేమో అని భయపడిపోతున్నాం. మరి, ఇలాంటి గడ్డు కాలంలో ఎలాంటి ఫ్లూ లక్షణాలు మన దరిచేరకుండా ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి, అవేంటో తెలుసుకొని మనమూ పాటించేద్దామా?
కరోనా వచ్చిన దగ్గర్నుంచి, దాని ప్రతాపమేంటో తెలిసిన దగ్గర్నుంచి ప్రతి ఒక్కరూ సాధారణ జలుబు, దగ్గు.. వంటి వాటికి కూడా భయపడిపోతున్నారు. అప్పుడప్పుడూ దగ్గినా, తుమ్మినా కరోనా వల్లేనేమో అని అనుమానపడుతున్నారు. అయితే సీజనల్ మార్పుల వల్ల కూడా ఇలాంటి ఫ్లూ లక్షణాలు మనల్ని చుట్టుముట్టడం కామన్. మరి, ఈ వర్షాకాలంలో ఫ్లూ మన దరిచేరకుండా ఉండాలంటే నిపుణులు చెప్పే ఈ సలహాలు, సూచనలు పాటించాల్సిందే!

గొడుగు తప్పనిసరి!
‘జల్లంత కవ్వింత కావాలిలే..’ వర్షపు చినుకులు తమ శరీరాన్ని తాకగానే గొడుగు, రెయిన్‌కోట్ అన్నీ పక్కన పడేసి మరీ వానలో సందడి చేస్తుంటారు అమ్మాయిలు. అయితే ఈ కరోనా సమయంలో అలాంటి చిలిపి పనులు తగదంటున్నారు నిపుణులు. ఎందుకంటే వర్షంలో తడవడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం.. వంటి అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. తద్వారా మన శరీరంలో రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. ఈ సమయంలో కరోనాతో పాటు ఇతర వైరస్లు, ఇన్ఫెక్షన్లు మనల్ని త్వరగా అటాక్ చేసే ప్రమాదం ఉంది. కాబట్టి బయటికి వెళ్లిన వారు.. ‘హా.. ఏముంది మధ్యలో వర్షం పడితే ఎంచక్కా తడుచుకుంటూ వచ్చేస్తాం..’ అనుకోకుండా తప్పనిసరిగా గొడుగు వెంటబెట్టుకొని వెళ్లాలి. ఇక రోజూ ఆఫీసులకు, ఇతర పనుల రీత్యా బయటికి వెళ్లిన వారు ఆ రోజు వర్షం పడినా, పడకపోయినా తమ హ్యాండ్‌బ్యాగ్‌లో ఓ చిన్ని గొడుగును తప్పనిసరిగా ఉంచుకోవాల్సిందే! తద్వారా వర్షంలో తడవకుండా, ఫ్లూ బారిన పడకుండా మన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు.

నీళ్లు గోరువెచ్చగా..!
వర్షాకాలంలో నీటి కాలుష్యం ఎక్కువగా జరిగే ప్రమాదం ఉంది. దీనివల్ల కలరా, విరేచనాలు, ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి మనం తాగే నీరు ఫిల్టర్ అయినప్పటికీ వాటిని బాగా మరిగించుకొని గోరువెచ్చగా అయ్యాక తాగడం మంచిదంటున్నారు నిపుణులు. అది కూడా రోజుకు రెండుమూడు లీటర్లు తాగడం తప్పనిసరి.. ఇంకా అందులో నిమ్మరసం పిండుకుంటే రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఇలా గోరువెచ్చటి నీళ్లు తాగడం వల్ల శరీరంలో రక్తప్రసరణ కూడా సక్రమంగా జరుగుతుంది. అంతేకాదు.. గోరువెచ్చగా ఉండే నీళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల కరోనాకు దూరంగా ఉండచ్చని ఇప్పటికే నిపుణులు పలు సూచనల్లో భాగంగా చెప్పిన సంగతి తెలిసిందే. కాబట్టి మీరు వృత్తి ఉద్యోగాల రీత్యా బయటికి వెళ్లినా కష్టమనుకోకుండా వీలైనంత వరకు ఇంటి నుంచే నీళ్లు తీసుకెళ్లడం మంచిది. అది కుదరదు అనుకుంటే.. మీ వెంటే ఒక ఎలక్ట్రిక్ కెటిల్ ఉంచుకోండి.. దాని ద్వారా ఎప్పటికప్పుడు నీటిని వేడి చేసుకునే వీలుంటుంది.

అదే మన రక్షణ కవచం!
కాలం మారుతున్న కొద్దీ మనం అప్రమత్తంగా ఉండకపోతే సీజనల్ వ్యాధులు అటాక్ చేయడానికి రడీగా ఉంటాయి. మనం వాటికి ఆ అవకాశం ఇవ్వకూడదనుకుంటే మన ముందున్న ఏకైక మార్గం రోగనిరోధక వ్యవస్థను దృఢంగా ఉంచుకోవడం. అది మనం రోజూ తీసుకునే ఆహారం వల్లనే సాధ్యమవుతుంది. ఇందుకోసం విటమిన్ ‘సి’ అధికంగా ఉండే కమలాఫలం, బత్తాయి, అరటి, కివీ.. వంటి పండ్లతో పాటు టొమాటో, ఆకుకూరలు, క్యాబేజీ.. వంటి కాయగూరల్ని సైతం రోజువారీ మెనూలో భాగంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆయా కాలాల్లో లభించే పండ్లు కూడా ఆ సీజన్లో మనకెదురయ్యే ఇన్ఫెక్షన్లను తట్టుకునే శక్తిని అందిస్తాయి. కాబట్టి ముఖ్యంగా ఈ వర్షాకాలంలో లభించే జామ, అలనేరేడు, దానిమ్మ.. వంటి పండ్లను తీసుకోవాలి. ఇలా మన శరీరంలో రోగనిరోధక శక్తి బలంగా ఉంటే సీజనల్ వ్యాధులే కాదు.. ప్రస్తుతం మన చుట్టూ ఉన్న కరోనా బారిన పడకుండా జాగ్రత్తపడచ్చు కూడా!

మీ బ్యాగ్‌లో ఇవి ఉండాల్సిందే!
మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, గొడుగు ఉపయోగించినా, రెయిన్ కోట్ వేసుకున్నా అప్పుడప్పుడూ అనుకోకుండా వర్షంలో తడుస్తాం. ఇలా తడిచిన బట్టలు, మాస్కులతో ఈ సమయంలో మరింత ప్రమాదం పొంచి ఉంటుంది. మన దుస్తులు, మనం ధరించిన మాస్క్‌పై ఉండే తడిదనం వైరస్, బ్యాక్టీరియాలను మరింతగా ఆకర్షిస్తుంది. కాబట్టి ఈ వర్షాకాలంలో మన శరీరాన్ని ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. మరి, బయటికెళ్తే ఇదెలా వీలవుతుంది అనుకోకండి.. వృత్తి ఉద్యోగాల రీత్యా మీరు రోజూ బయటికి వెళ్లాల్సి వచ్చినప్పటికీ మీ బ్యాగ్‌లో మీతో పాటు అదనంగా ఓ డ్రస్ లేదా చీర.. ఇలా మీరు వేసుకునే దుస్తుల్ని, అదనంగా ఓ మాస్క్‌ని ఉంచుకోండి.. సో.. మీరు ఆఫీస్‌కి చేరుకోగానే దుస్తులు మార్చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ తల తడిస్తే పొడిగా తుడుచుకోవడానికి ఓ టవల్ని కూడా వెంట ఉంచుకోండి. ఇక కరోనాకు దూరంగా ఉండే క్రమంలో పదే పదే చేతులు కడుక్కుంటున్నాం.. ఆపై పొడిగా తుడుచుకోవడం కూడా ముఖ్యమే. ఎందుకంటే చేతి వేళ్ల మధ్యలో తడిదనం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.
ఇవి కూడా గుర్తుంచుకోండి!

* ఈ వర్షాకాలంలో మనం ఫ్లూ బారిన పడకుండా ఉండాలంటే తగినంత నిద్ర కూడా అవసరమేనట! ఈ క్రమంలో రోజుకు ఏడు గంటల కంటే తక్కువ నిద్ర పోయే వారు ఫ్లూ బారిన పడే అవకాశం మూడు రెట్లు అధికంగా ఉన్నట్లు ఓ అధ్యయనం తేలింది. కాబట్టి ఎలాంటి ఆలోచనలు, కరోనా భయాలు పెట్టుకోకుండా సుఖ నిద్రకు ఉపక్రమించండి. * ఇంట్లో ఎవరికైనా సాధారణ జలుబు, దగ్గు వంటి ఫ్లూ లక్షణాలున్నట్లయితే వారికి దూరంగా ఉండడం మంచిది. ఒకవేళ వారితో మాట్లాడాల్సి వచ్చినా, వారికి సేవలు చేయాల్సి వచ్చినా మాస్క్-గ్లౌజులు ధరించడం మాత్రం మర్చిపోవద్దు. * ఇంటిని, వస్తువుల్ని, బెడ్‌షీట్స్, దిండ్ల కవర్లను, కర్టెన్లను ఎప్పటికప్పుడు శుభ్రపరచాల్సిందే! అలాగే ఇంట్లో కూడా తడిగా ఉండకుండా పొడిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. * మనకు నచ్చిన పనులు చేసుకుంటూ హ్యాపీగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని ఓ అధ్యయనంలో తేలింది. ఇలా ఇమ్యూనిటీ మెరుగ్గా ఉంటే కరోనానే కాదు.. ఈ కాలంలో ఎదురయ్యే ఎలాంటి ఇన్ఫెక్షన్లనైనా ఇట్టే ఎదుర్కోవచ్చు. * రోజుకు మూడుసార్లు ఉప్పు నీటితో పుక్కిలించడం (గార్గ్లింగ్ చేయడం) వల్ల ఫ్లూ బారిన పడే అవకాశాలు చాలా తక్కువని ఓ అధ్యయనంలో తేలింది. * ఇక ఈ వర్షాకాలంలో వేడివేడిగా పకోడీలు, ఛాట్ మసాలా వంటివి తినాలనిపించడం కామన్. ఇందుకోసం బయట దొరికే వాటిని ఆశ్రయించే ముందు కరోనాను ఒక్కసారి గుర్తుచేసుకోండి. అలాగే ఇలాంటి బయటి ఆహారం, నూనె పదార్థాల వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు, ఇతర ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం కూడా ఉంది.
|
ఇక వీటన్నింటితో పాటు మాస్కులు ధరించడం, ముఖాన్ని చేతులతో తాకకుండా ఉండడం, సామాజిక దూరం పాటించడం, ఏ చిన్న అనారోగ్యంగా అనిపించినా వైద్యులను సంప్రదించడం చాలా ఉత్తమం. తద్వారా మీరు, మీ చుట్టూ ఉన్న వారు ఈ సమయంలో కరోనాతో పాటు ఇతర అనారోగ్యాల బారిన పడకుండా కనీస బాధ్యత వహించండి.