మొత్తం మీద రుతుపవనాల రాకతో కాస్త చినుకులు పడుతున్నాయి. ఎండ వేడి నుంచి విముక్తి లభిస్తోంది. మండే ఎండలతో పాటు నోరూరించే మామిడి పళ్లు కూడా మరికొద్ది రోజుల్లో కనిపించడం తగ్గిపోతుంది. అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నారు అనుకుంటున్నారా.. అమెరికాలోని పరిశోధకులు మామిడి పండ్లపై ఓ అధ్యయనం నిర్వహించారు. మామిడి పండ్లు జీర్ణశక్తిని పెంచుతాయని ఈ పరిశోధనలో తేలింది.

దీనికోసం పరిశోధకులు జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న 36 మంది స్త్రీ, పురుషులను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక బృందంలో ఉన్నవారికి రోజుకి రెండు కప్పుల మామిడి రసాన్ని ఇచ్చారు. మరొక బృందంలో ఉన్నవారికి అంతేమొత్తంలో ఫైబర్ని మాత్రల రూపంలో ఇచ్చారు. ఇలా నాలుగు వారాల పాటు ఈ పరిశోధనను నిర్వహించారు. చివరికీ రెండు గ్రూపుల వారికి జీర్ణ క్రియలు మెరుగైనప్పటికీ, ఫైబర్ తీసుకునే వారికంటే మామిడి పళ్లను తీసుకునే వారిలో జీర్ణ సంబంధిత సమస్యలు చాలా మెరుగ్గా పరిష్కారమైనట్లు వెల్లడైంది. అంతేకాకుండా వీరిలో శరీరానికి అవసరమైన బ్యాక్టీరియా మెరుగుపడిందనీ, కడుపులో మంట తగ్గిందని తేలింది.
ఈ క్రమంలో మామిడి పండ్ల వలన శరీరానికి కలిగే మరికొన్ని లాభాల గురించి తెలుసుకుందాం...

మెరుగయ్యే కంటి చూపు...
ఒక్కో విటమిన్ వల్ల ఒక్కో ప్రయోజనం కలుగుతుంది. విటమిన్ ఎ కంటి చూపుని ప్రభావితం చేస్తూ ఉంటుంది. శరీరంలోని ఈ విటమిన్ మోతాదుని బట్టే మన కంటి చూపు అధారపడి ఉంటుంది. అందుకే డాక్టర్లు మెరుగైన కంటి చూపు కోసం విటమిన్ ఎ ఎక్కువగా ఉండే పదార్థాలను తినమంటారు. వీటిలో మామిడి పండ్లు కూడా ఒకటి. ఒక కప్పు తరిగిన మామిడి పండ్లలో దాదాపు 25 శాతం రోజుకు సరిపడ విటమిన్ ఎ శరీరానికి లభిస్తుంది. దీనివల్ల కంటి చూపు మెరుగుపడడంతో పాటు రేచీకటి, కళ్లు పొడిబారటం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి.

బరువు పెరగచ్చు...
మన దేశంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య అధికంగా బరువు పెరగడం... అయితే బరువు తక్కువగా ఉండి, వెయిట్ పెరగాలని అనుకునే వారు కూడా లేకపోలేదు. ఇలాంటి వారు మామిడి పండ్లను తీసుకోవడం వల్ల బరువు పెరగవచ్చంటున్నారు నిపుణులు. 150 గ్రాముల మామిడి ముక్కల్లో 86 క్యాలరీల శక్తి ఉండడమే ఇందుకు కారణం. అంతేకాకుండా.. శరీరం మామిడి పండ్లలోని శక్తిని త్వరగా గ్రహిస్తుంది. దీనివల్ల కూడా శరీర బరువు పెరుగుతుంది. దీనితో పాటు... మామిడి పండ్లు స్టార్చ్ని కలిగి ఉంటాయి. స్టార్చ్ చక్కెరగా మారుతుంది. ఇది కూడా శరీర బరువు పెరగడానికి దోహదం చేస్తుంది.

ఐరన్ కోసం...
మహిళలు గర్భధారణ సమయంలో ఎనీమియా(రక్తహీనత)తో ఎక్కువగా బాధపడుతుంటారు. గర్భంలోని పిండం ఎదిగే క్రమంలో శరీరంలో రక్తాన్ని కూడా తీసుకుంటుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ సమయంలో ఐరన్ ఉన్న పదార్థాలను సాధారణంగా కంటే ఎక్కువగా తీసుకోమంటారు వైద్యులు. దీనికోసం డాక్టర్లు ఎనీమియా ఉన్నవారికి ఐరన్ మాత్రలను సూచిస్తుంటారు. శరీరానికి అవసరమయ్యే ఐరన్ మామిడి పండ్లలో పుష్కలంగా లభిస్తుంది. అలాగే మామిడి పండ్లను తీసుకోవడం వల్ల రక్తంలోని ఎర్ర రక్త కణాల సంఖ్య కూడా పెరుగుతుంది.

డీహైడ్రేషన్ నుంచి...
సాధారణంగా తీసుకునే శీతల పానీయాల కంటే మామిడి రసంలో శరీరంలో వేడిని తగ్గించే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా... మామిడిలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని సోడియం లెవెల్ని క్రమబద్ధీకరిస్తుంది. ఫలితంగా శరీరం డీహైడ్రేట్ కాకుండా వేడి నుంచి రక్షణ కల్పిస్తుంది.
సో.. చూశారు కదా.. మామిడి పండ్ల వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అందుకే ఇవి లభించే కొన్ని రోజులైనా మిస్సవ్వకుండా వీటిని తీసుకోవడానికి ప్రయత్నించండి. చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి.