మనసు నిర్మలంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉంటాడు. మంచైనా, చెడైనా అది మనసుపైనే ఆధారపడి ఉంటుంది. మనసులోని ఆలోచనలు సక్రమంగా లేకుంటే మనిషి మనుగడే కష్టమవుతుంది. అందుకే మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక ఆరోగ్యం తప్పనిసరి అని చెబుతారు సైకాలజిస్టులు. కానీ నేటి యాంత్రిక జీవనంతో స్కూలుకెళ్లే పిల్లల నుంచి పండు ముదుసలి దాకా అందరూ డిప్రెషన్ బారిన పడుతున్నారు. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న సెలబ్రిటీలు సైతం ఈ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో 'మానసిక ఆరోగ్య అవగాహన వారోత్సవం’ సందర్భంగా ఒత్తిడి, మానసిక ఆందోళన నుంచి బయటపడిన కొందరు ప్రముఖుల గురించి తెలుసుకుందాం. !
బయటకు చెప్పుకోవాలి !
ఒక సర్వే ప్రకారం డిప్రెషన్.. మానసిక అస్వస్థతతో బాధపడుతున్న దేశాల్లో ఇండియా, చైనా అగ్రస్థానంలో ఉండడం గమనార్హం. WHO నివేదిక ప్రకారం ప్రతి 20 మంది భారతీయుల్లో ఒకరు డిప్రెషన్ బారిన పడుతున్నారని అంచనా. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కానీ దీని గురించి మాట్లాడడానికి చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. గుండె జబ్బుంటే కార్డియాలజిస్టుని కలిశామని ధైర్యంగా చెప్పుకునేవారు..డిప్రెషన్‌తో సైకాలజిస్టు వద్దకు వెళ్లామని చెప్పేందుకు మొహమాటపడుతున్నారు. అయితే కొందరు సెలబ్రిటీలు మాత్రం ధైర్యంగా బయటకు వచ్చి తాము ఎదుర్కొన్న మానసిక సమస్యలను బయటపెట్టడం విశేషం. కరోనా కల్లోలం నేపథ్యంలో ఎంతోమంది మానసిక ఆందోళనకు లోనవుతున్నారు. ఇలాంటి సందర్భంలో మానసిక సమస్యలు, ఆందోళన గురించి బయటకు చెప్పుకోవడం, నిపుణులతో పంచుకోవడం ఎంత అవసరమో - ఈ ప్రముఖుల అనుభవాల ద్వారా తెలుసుకోవచ్చు.

ఇదేమీ దాచాల్సిన విషయం కాదు!
బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన అనుష్కాశర్మ కూడా ఈ మెంటల్ డిజార్డర్‌కు గురైంది. ట్విట్టర్ వేదికగా ఓ సందర్భంలో ఈ విషయాన్ని బయటపెట్టిందీ బెంగళూరు బ్యూటీ. 'మనకు కడుపు నొప్పి వస్తే ఎలాంటి దాపరికం లేకుండా డాక్టర్ దగ్గరకు వెళతాం. డిప్రెషన్ కూడా అలాంటిదే. నేను కూడా గతంలో మానసిక ఆందోళనతో సతమతమయ్యాను. చికిత్స కూడా తీసుకున్నాను. ఇది సాధారణంగా అందరికీ ఎదురయ్యే సమస్యే. నా కుటుంబీకుల్లో చాలామంది ఈ సమస్యతో బాధపడ్డారు. అందుకే దీని గురించి నిర్మొహమాటంగా బయటపెడుతున్నా. ఇందులో సిగ్గుపడాల్సిన విషయమేమీ లేదు. మనకున్న బాధను నలుగురితో పంచుకుంటే కాస్త ఉపశమనం దొరుకుతుంది' అని తన డిప్రెషన్ అనుభవాలను బయటపెట్టింది అనుష్క.

ఎందుకిలా జరుగుతోందో అర్థం కాలేదు!
'సాహో' సినిమాతో తెలుగు ప్రేక్షకుల అభిమానం కూడా సంపాదించుకుంది శ్రద్ధాకపూర్. అంతకుముందు ' ఆషిఖీ 2', 'ఏక్ విలన్' 'హైదర్', ' ఏబీసీడీ 2', 'బాఘీ', 'రాక్ఆన్ 2', 'ఛిఛోరే' తదితర చిత్రాలతో బాలీవుడ్లో సత్తా చాటిందీ ముద్దుగుమ్మ. తాను కూడా ఓ సమయంలో యాంగ్త్జెటీ సమస్యతో బాధపడ్డానని 'ఛిఛోరే' సినిమా ప్రమోషన్లో బయటపెట్టింది శ్రద్ధాకపూర్. ' నాకు యాంగ్త్జెటీ సమస్య చిన్నప్పటి నుంచి లేదు. కానీ 2013 'ఆషిఖీ 2' విడుదల అనంతరం నాలో ఆత్రుత, ఆందోళనలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో నేను చాలా ఒత్తిడికి లోనయ్యాను. వైద్యులు నాకు ఎన్నో రకాల పరీక్షలు నిర్వహించారు. అన్ని రిపోర్ట్లలో ఎలాంటి సమస్య లేదనే వచ్చేది. కానీ..దేని వల్ల ఈ బాధ కలుగుతుందో అర్థమయ్యేది కాదు. అప్పుడు ఎందుకిలా జరుగుతుందో తెలిసేది కాదు. ఇప్పటికీ నేను ఈ సమస్యను ఎదుర్కొంటున్నాను. కాకపోతే గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా బెటర్. జీవితంలో ప్రతి ఒక్కరూ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోక తప్పదు. ఆ సమయంలో వాటిని కూడా మనలో భాగంగా అంగీకరించి.. ప్రేమతో వాటిని జయించాలి' అని తన అనుభవాలను గుదిగుచ్చింది శ్రద్ధ.

ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా!
'దేవదాస్'తో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన ఇలియానా కూడా ఓ దశలో మానసిక వేదనతో తల్లడిల్లిపోయింది. ఆ సినిమాలో చక్కనైన శరీరాకృతితో ఆకట్టుకున్న ఆమె అదే శరీరాకృతి కారణంగానే డిప్రెషన్‌కు గురయ్యారట. ' కొందరు నా శరీరాకృతిపై పదే పదే కామెంట్లు చేసేవారు. దీంతో నాకు చాలా బాధ వేసేది. దాన్ని నేను బాధగానే భావించాను కానీ డిప్రెషన్ అని తెలుసుకోలేకపోయా. ఇది కూడా ఒక రకమైన మానసిక సమస్య అని ఎవరో చెబితే కానీ నాకు తెలియలేదు. దీని కారణంగా అప్పుడప్పుడూ నాకు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు కూడా వచ్చేవి. అయితే ఆ సమయంలోనే నన్ను నేను ప్రేమించుకోవడం మొదలుపెట్టా.. నాకు నేనే ధైర్యం చెప్పుకున్నా.. ఇలా నెమ్మదిగా నన్ను నేను మార్చుకున్నా.. ఎవరైనా సరే డిప్రెషన్‌తో పోరాడడానికి వేసే తొలి అడుగు ఇదేనేమో' అని ఓ సందర్భంలో వివరించింది ఇలియానా.

అర్ధరాత్రి ఆస్పత్రికి పరుగులు తీసేదాన్ని!
'దంగల్', ' సీక్రెట్ సూపర్‌స్టార్', 'ద స్కై ఈజ్ పింక్' సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది 18 ఏళ్ల జైరా వసీం. చిన్న వయస్సులోనే సినిమాలకు స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఈ కశ్మీర్ అమ్మాయి. అయితే తాను కూడా డిప్రెషన్ బారిన పడినట్లు ఓ సందర్భంలో సోషల్‌మీడియా వేదికగా అందరితో పంచుకుంది జైరా. ' నేను తొలిసారి 12 ఏళ్ల వయసులో డిప్రెషన్‌తో బాధపడ్డాను. మళ్లీ 14 ఏళ్ల వయసులో ఈ భావన మరోసారి ఎదురైంది. ఈ కారణంగా రోజుకి 5 యాంటీ డిప్రెసెంట్ ట్యాబ్లెట్లు కూడా వేసుకునేదాన్ని. అయినా ఒక్కోసారి మనసు తీవ్రంగా ఆందోళన చెందుతుండేది. అర్ధరాత్రి సమయాల్లో ఉన్నట్లుండి ఆస్పత్రికి పరుగులు పెట్టేదాన్ని. ఒక్కోసారి విపరీతంగా ఆకలేస్తే..మరోసారి ఏమీ తినాలనిపించదు. నిద్రకూడా అంతే.. వీటికి తోడు ప్రతికూల ఆలోచనలు.. కాళ్ల నొప్పులు.. ఒంటి నొప్పులు.. ఇలా ఎన్నో సమస్యలు నన్ను వేధించాయి. ఒక్కోసారి ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనిపించింది. వీటి కారణంగా నాలో ఏదో ఒక సమస్య ఉందని అర్థమైంది. అది డిప్రెషన్ అని భావించా. ఈ సమస్య గురించి ఎవరి దగ్గరైనా మాట్లాడినప్పుడు 'ఇంత చిన్న వయస్సులో నీకు డిప్రెషన్ ఏంటి?.. అది 25 ఏళ్లు దాటిన వారికి మాత్రమే ఎదురయ్యే సమస్య' అని తేలిగ్గా తీసిపడేసేవారు. ఇక ఈ సమయంలో నా కుటుంబ సభ్యులు నా పట్ల చూపించిన సహనానికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా అది తక్కువే' అంటూ చెప్పుకొచ్చింది.

అమ్మ వల్లే కోలుకున్నా!
సందర్భం వచ్చినప్పుడల్లా తాను ఎదుర్కొన్న డిప్రెషన్ గురించి వివరిస్తూనే.. దాని బారిన పడిన వారు ఎలా బయటపడాలో వివరిస్తుంటుంది దీపికా పదుకొణె. అలా డిప్రెషన్ గురించి మొదటిసారి బయటపెట్టిన నటి దీపికే కావడం గమనార్హం. మానసిక ఆందోళన నుంచి బయటపడాలంటే వ్యక్తుల మధ్య ఆత్మీయత ఉండాలని చెబుతోందీ ముద్దుగుమ్మ. ' నేను నా జీవితంలో ఒకానొక సమయంలో డిప్రెషన్‌కు గురయ్యా. ఆ సమయంలో ఇంటి నుంచి బయటికి రావాలని, ఇతరులను చూడాలని, వారితో మాట్లాడాలని అనిపించలేదు. నాలో నేనే మధనపడుతుండేదాన్ని. ఆ సమయంలో అమ్మ నా పరిస్థితిని గమనించింది. నాతో మాట్లాడి సమస్యకు సరైన చికిత్స అందేలా చేసింది. వైద్యుల సూచనలు పాటిస్తూ నా లైఫ్స్త్టెల్ని మార్చుకున్నా.. అలా నెమ్మదిగా బయటపడ్డా. నాకున్న బాధల్నిఅమ్మతో పంచుకోగలిగా. తద్వారా ఆందోళనను దూరం చేసుకుని ప్రస్తుతం ఆనందంగా ముందుకు సాగుతున్నా' అని వివరిస్తుంది దీప్స్. తనలా బాధపడే వారిలో ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించేందుకు నాలుగేళ్ల క్రితం 'ద లివ్, లవ్, లాఫ్ ఫౌండేషన్' పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను కూడా స్థాపించిందీ ముద్దుగుమ్మ.
వీరే కాదు... మరెంతోమంది సెలబ్రిటీలు కూడా తాము డిప్రెషన్‌తో బాధపడ్డామని వివిధ సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇలా పలువురు ప్రముఖులు బయటకు వచ్చి తమ సమస్యను చెప్పుకోవడం వల్ల సామాన్యుల్లోనూ మార్పు వస్తుందని చెబుతున్నారు మానసిక నిపుణులు. దీంతో వారు కూడా తమ సమస్యలను బయటపెట్టే అవకాశం ఉంది. ఆత్మహత్యలకు పాల్పడకుండా తమ సమస్యను నలుగురితో చెప్పుకునే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి కరోనా సృష్టిచింన ఈ సంక్షొ్భ సమయంలో ఇది ఎంతో అవసరం !