బాదం గింజలు పరిమాణంలో చిన్నవే కావొచ్చు.. ఇన్ఫెక్షన్లపై పోరాటంలో మాత్రం హీరోలనే చెప్పాలి.. అయితే పొట్టుతో తిన్నప్పుడే ఎక్కువ ఫలితం అంటున్నారు నిపుణులు..
* బాదం పైపొరలో ఉండే కొన్ని ప్రత్యేక పోషకాలు ఏదైనా ఇన్ఫెక్షన్లు దాడి చేసినప్పుడు దాన్ని ఎదుర్కొనేలా రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాదు పీచు, యాంటీఆక్సిడెంట్లు, ప్రీబయాటిక్ సమ్మేళనాలు, పాలీఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ బాదం పొట్టులో పుష్కలంగా ఉంటాయి. ఈ గింజలని నానబెట్టి తీసుకోవడం వల్ల దానిపై చర్మం సున్నితంగా మారుతుంది. దాంతో త్వరగా జీర్ణమవుతుంది. అదే పొట్టు తీసేయడం వల్ల ఆ గింజల్లో ఉండే వ్యాధినిరోధక, యాంటీవైరల్ గుణాలు మన శరీరానికి అందకుండా పోతాయి. ఇవన్నీ కావాలనుకుంటే పొట్టుతోనే తినాలి. లేదా కేవలం కొవ్వులు, మాంసకృత్తులు చాలనుకుంటే పొట్టు లేకుండా తీసుకోవచ్చు.

* వీటిలో మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ మెండుగా ఉంటాయి. వీటిని శరీరం త్వరగా జీర్ణం చేసుకుంటుంది. ఇవి మంచి కొవ్వులు. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. శరీర కణాల ఉత్పత్తి, అభివృద్ధికి సహకరిస్తాయి.
* బాదం బరువును నియంత్రిస్తుంది. అలాగే పెంచుతుంది కూడా. అదెలా అంటే... పీచు, మాంసకృత్తులున్న ఈ గింజలని తక్కువ పరిమాణంలో తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలిగి త్వరగా ఆకలి వేయదు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు దీన్ని ఆహారంలో చేర్చుకోవచ్చు. ఐతే ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే మాత్రం బరువు పెరుగుతారు.
* ఈ గింజల్లో పొటాషియం ఎక్కువగా, సోడియం తక్కువగా ఉంటుంది. కాబట్టి అధిక రక్తపోటుతో బాధపడేవారు వీటిని తీసుకుంటే మంచిది.
* వంద గ్రాముల బాదంలో దాదాపు 130 మైక్రోగ్రాముల ఫైటో ఈస్ట్రోజన్ ఉంటుంది. ఇది రొమ్ము క్యాన్సర్, ఆస్టియోపొరోసిస్ రాకుండా నియంత్రించడంలో సాయపడుతుంది. అలాగే మెనోపాజ్ లక్షణాలనూ నియంత్రిస్తుంది. రోజుకు సాధారణంగా అయిదారు బాదం గింజలను తినొచ్చు.

- డాక్టర్ లతా శశి, పోషకాహార నిపుణులు