గత నెల రోజుల నుంచి మన దేశాన్ని పట్టి పీడిస్తున్న భూతం కరోనా వైరస్. దీంతో అప్పటివరకు ఎంతో ఆనందంగా, అందరి మధ్య సాగిన మన జీవితం సామాజిక దూరం, సెల్ఫ్ క్వారంటైన్, సెల్ఫ్ ఐసోలేషన్, వ్యక్తిగత పరిశుభ్రత.. అంటూ అనుక్షణం వీటి చుట్టూనే తిరుగుతుంది. ఇక కరోనా దెబ్బకు స్కూల్స్ దగ్గర్నుంచి ఐటీ కంపెనీల దాకా అన్నీ ఇప్పటికే మూతపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వగా.. కొన్ని కంపెనీలు మాత్రం ఈ లాక్డౌన్ కాలంలో తమ ఉద్యోగులు పని చేయాల్సిన అవసరం లేదంటూ తమ కార్యాలయాలకు సెలవులు ప్రకటించాయి.
అయితే ఇలా అనుకోకుండా వచ్చిన సెలవులను కొందరు వివిధ రకాలుగా సద్వినియోగం చేసుకుంటుంటే.. మరికొందరు మాత్రం ఎలాగో సెలవులు దొరికాయి కదా అని బద్ధకిస్తున్నారు. బాగా విశ్రాంతి తీసుకోవాలనే ఉద్దేశంతో బయటి నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకొని మరీ లాగించేస్తున్నారు. కానీ కరోనా విజృంభిస్తోన్న ఈ ప్రతికూల పరిస్థితుల్లో స్వీయ నిర్బంధంలో ఉన్న వారు బయట దొరికే ఆహారం కంటే ఇంటి ఆహారానికే ప్రాధాన్యమివ్వాలని, అది కూడా కచ్చితమైన ఆహార, ఫిట్నెస్ నియమాలు పాటించాలని చెబుతున్నారు ప్రముఖ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్. ఇంట్లో ఉన్నా యాక్టివ్‌గా, ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ కచ్చితమైన సమయాల్లో పోషకాలతో నిండిన ఆహారం తీసుకోవడం తప్పనిసరి అంటున్నారు రుజుత. ఈ క్రమంలోనే వారంలో పాటించాల్సిన ఆహార, వ్యాయామ నియమాలతో కూడిన ఓ డైట్ ప్లాన్ తయారు చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. మరి, రుజుత పోస్ట్ చేసిన ఆ వీక్లీ క్వారంటైన్ డైట్ ప్లాన్ ఏంటో మనమూ తెలుసుకొని ఫాలో అయిపోదామా..??
కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోన్న ఈ సమయంలో ఆరోగ్యంతో పాటు ఎలాంటి భయం లేకుండా పాజిటివ్ మైండ్‌సెట్‌తో ఉండడం చాలా మంచిదని సూచిస్తున్నారు రుజుత. ముంబయికి చెందిన ఈ ప్రముఖ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్‌గా ఉంటూ డైట్, ఫిట్నెస్ టిప్స్ అందిస్తుంటారు. అంతేనా.. కాలానికి తగినట్లుగా పాటించే ఆహార నియమాలు, సౌందర్య చిట్కాలు.. ఇలా ప్రతిదీ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఎందరికో వెల్నెస్ ఎక్స్‌పర్ట్‌గా మారిపోయారామె. ఇక ప్రస్తుతం నెలకొన్న కరోనా ప్రభావంతో స్వీయ నిర్బంధంలో ఉన్నప్పటికీ చక్కటి పోషకాహారంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేయాలంటున్నారు. ఈ క్రమంలోనే వీక్లీ క్వారంటైన్ డైట్, ఫిట్నెస్ ప్లాన్‌ని ఛార్ట్ రూపంలో పొందుపరిచి ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు రుజుత.
ఇంతకీ క్వారంటైన్ ప్లాన్‌లో ఏముందంటే..?
ఉదయం నిద్ర లేచిన తర్వాత తీసుకునే ఫస్ట్ మీల్ దగ్గర్నుంచి రాత్రి పడుకునే ముందు తీసుకునే డిన్నర్ వరకు ఏయే సమయాల్లో ఏయే ఆహారం తీసుకోవాలో తన ప్లాన్‌లో భాగంగా వివరించారు రుజుత. ఈ నేపథ్యంలో ఒక్కో రోజుకు సంబంధించిన డైట్ ఛార్ట్‌ని విడివిడిగా పరిశీలిస్తే..
మొదటి రోజు:
వ్యాయామం - 5 రౌండ్ల సూర్య నమస్కారాలు
పరగడుపున - నానబెట్టిన బాదం పప్పులు, ఎండుద్రాక్ష
బ్రేక్‌ఫాస్ట్ - పోహా, పల్లీలు
మిడ్మీల్ (బ్రంచ్) - నిమ్మకాయ షర్బత్
లంచ్ - పప్పన్నం, ఏదైనా పచ్చడి
మిడ్మీల్ (స్నాక్స్) - గుప్పెడు పల్లీలు
డిన్నర్‌కి ముందు - శెనగపిండి దోసె
పడుకునే ముందు - బెల్లం, పసుపు కలిపి తయారుచేసిన ఉండలు
రెండో రోజు:
వ్యాయామం - సుప్తపదంఘుష్టాసనాలు * 3 రౌండ్లు
పరగడుపున - ఖర్జూరం, వాల్నట్
బ్రేక్‌ఫాస్ట్ - సాంబార్ ఇడ్లీ
మిడ్మీల్ (బ్రంచ్) - మిరియాల రసం
లంచ్ - వాముతో తయారుచేసిన పరాఠాను పెరుగు లేదా ఏదైనా పచ్చడితో కలిపి తీసుకోవాలి.
మిడ్మీల్ (స్నాక్స్) - జీడిపప్పు బెల్లంతో కలిపి తీసుకోవాలి.
డిన్నర్‌కి ముందు - కిచిడీ, ఇంట్లో తయారుచేసిన అప్పడాలు
పడుకునే ముందు - పసుపు, అల్లం పొడి వేసి కాచిన పాలు
మూడో రోజు:
వ్యాయామం - స్క్వాట్స్, లాంజెస్ ఇంట్లోనే చేయాలి.
పరగడుపున - పిస్తాపప్పు (ఉప్పు లేకుండా), ఎండు ఖర్జూరం, నెయ్యి
బ్రేక్‌ఫాస్ట్ - రాగి దోసె లేదా ప్లెయిన్ దోసె
మిడ్మీల్ (బ్రంచ్) - ఎండు కొబ్బరి, బెల్లం, ధనియాలు కలిపి తయారుచేసిన మిశ్రమం
లంచ్ - అన్నం, రాజ్మా
మిడ్మీల్ (స్నాక్స్) - చిరుధాన్యాలతో తయారుచేసిన బిస్కట్లు (వీటి తయారీలో
పిల్లల్ని కూడా భాగం చేయండి..)
డిన్నర్‌కి ముందు - మసాలా పూరీ ఏదైనా చట్నీతో కలిపి తీసుకోవాలి.
పడుకునే ముందు - సబ్జా గింజలు, గుల్కండ్, పాలు
నాలుగో రోజు:
వ్యాయామం - 7 రౌండ్ల సూర్య నమస్కారాలు
పరగడుపున - జీడిపప్పులు, నానబెట్టిన కిస్మిస్లు
బ్రేక్‌ఫాస్ట్ - ఉప్మా
మిడ్మీల్ (బ్రంచ్) - నిమ్మ లేదా ఉసిరి రసం
లంచ్ - సాబుదానా వడ, చట్నీ లేదా సాబుదానా కిచిడీ, పెరుగు
మిడ్మీల్ (స్నాక్స్) - కొద్దిగా నెయ్యి, కాస్త ఉప్పు వేసి తయారుచేసిన మరమరాలు
డిన్నర్‌కి ముందు - జీరా రైస్, స్ప్రౌట్స్
పడుకునే ముందు - రాగి మాల్ట్ లేదా తులసి టీ
ఐదో రోజు:
వ్యాయామం - రోగనిరోధక శక్తిని పెంచే అయ్యంగార్ యోగా
పరగడుపున - నానబెట్టిన బాదం పప్పులు
బ్రేక్‌ఫాస్ట్ - మల్టీ గ్రెయిన్ ప్యాన్‌కేక్స్
మిడ్మీల్ (బ్రంచ్) - కోకుమ్ షర్బత్ లేదా కప్పు వేడి వేడి టీ
లంచ్ - పప్పన్నం
మిడ్మీల్ (స్నాక్స్) - రవ్వ లడ్డూ, బేసన్ లడ్డూ, డ్రైఫ్రూట్ లడ్డూ
డిన్నర్‌కి ముందు - జొన్న రొట్టెను ఉలవల కర్రీ లేదా బేసిన్ కర్రీతో కలిపి తీసుకోవాలి.
పడుకునే ముందు - పసుపు, శొంఠి పొడి వేసి కాచిన పాలు
ఆరో రోజు:
వ్యాయామం - స్క్వాట్స్, లాంజెస్ లేదా స్కిప్పింగ్
పరగడుపున – ఖర్జూరం, వాల్నట్స్
బ్రేక్‌ఫాస్ట్ - ఆనియన్ పరాఠా
మిడ్మీల్ (బ్రంచ్) - పల్లి లడ్డూ
లంచ్ - అన్నం, శెనగల కర్రీ
మిడ్మీల్ (స్నాక్స్) - ఠండాయి
డిన్నర్‌కి ముందు - అప్పడాలు
పడుకునే ముందు - పాలు, గుల్కండ్ లేదా జీడిపప్పులు
ఏడో రోజు:
వ్యాయామం - సుప్తపదంఘుష్టాసనాలు * 3 రౌండ్లు
పరగడుపున – కిస్మిస్, జీడిపప్పులు
బ్రేక్‌ఫాస్ట్ - చపాతీ, టీ
మిడ్మీల్ (బ్రంచ్) - ఆప్రికాట్స్, ఎండుద్రాక్ష, ఏదైనా లడ్డూ
లంచ్ - దోసె ఏదైనా చట్నీతో కలిపి తీసుకోవాలి.
మిడ్మీల్ (స్నాక్స్) - ఇంట్లో తయారుచేసిన స్వీట్ బిస్కట్లు
డిన్నర్‌కి ముందు - బియ్యపు రొట్టె
పడుకునే ముందు - పాలు లేదా కషాయం
ఆరోగ్యం.. మానసికోల్లాసం..!
ఇలా వారానికి సంబంధించిన క్వారంటైన్ డైట్, ఫిట్నెస్ ఛార్ట్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన రుజుత.. ఈ మెనూ వల్ల అటు ఆరోగ్యంతో పాటు ఇటు మానసికోల్లాసం కూడా మన సొంతమవుతుందంటూ సుదీర్ఘ క్యాప్షన్ రాసుకొచ్చారు. ‘క్వారంటైన్ మీల్ ప్లాన్ - వారానికి సంబంధించిన ఆహార, వ్యాయామ నియమాలతో కూడిన ప్రణాళిక ఇది. మన పాకశాస్త్రంలో విభిన్న రకాల వంటకాలున్నాయి. అవన్నీ ఎన్నో పోషకాల మిళితం. ఈ క్వారంటైన్ సమయంలో ఇవి మనకు ఎంతో ఉపయోగకరం. పప్పులు, ధాన్యాలు, చిరుధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు.. వంటి ఎక్కువ కాలం నిల్వ ఉండే పదార్థాలను మిళితం చేస్తూ ఈ వీక్లీ మీల్ ప్లాన్ తయారుచేశాను. ఇవన్నీ మనకు పోషణనందించి సంపూర్ణ ఆరోగ్యం చేకూర్చడంతో పాటు మానసికోల్లాసాన్ని అందిస్తాయి. తద్వారా మనసులోకి ఎలాంటి చెడు ఆలోచనలు రాకుండా సానుకూల దృక్పథంతో ముందుకు సాగచ్చు. కాబట్టి ప్రస్తుతం ఉన్న ఈ ప్రతికూల పరిస్థితుల్లో శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే మీరూ ఈ డైట్ ఛార్ట్‌ని ఫాలో అవడంతో పాటు దీన్ని మరింత మందికి షేర్ చేయండి..’ అంటూ రాసుకొచ్చింది రుజుత.
సో.. రుజుత సూచించిన ఈ క్వారంటైన్ డైట్ ప్లాన్‌ని మనమూ రోజూ ఫాలో అవుతూ అటు ఆరోగ్యంగా, ఇటు ఫిట్‌గా ఉందాం.. తద్వారా కరోనా మహమ్మారిని తరిమి కొడదాం.. మరి, ఇందుకు మేం రడీ.. మీరు రడీనా..??