హలో డాక్టర్. నాకు పెళ్లై రెండేళ్లవుతోంది. అయినా పిల్లలు లేరు. HSG టెస్ట్ చేస్తే రెండుసార్లు ఫాలోపియన్ ట్యూబ్స్‌లో బ్లాక్స్ ఉన్నట్లు వచ్చింది. HSGకి ప్రత్యామ్నాయంగా ఏదైనా పరీక్ష ఉందా? అలాగే నా భర్తకి Hyperthyroidism ఉంది. దాని వల్లే పిల్లలు కలగట్లేదా? సలహా ఇవ్వండి.
- ఓ సోదరి
జ: మీకు HSG టెస్ట్ రెండుసార్లు చేశారని రాశారు. నిజానికి ఈ పరీక్ష ఒక్కసారి చేస్తే సరిపోతుంది. రెండు ఫెలోపియన్ ట్యూబ్స్లోనూ బ్లాక్స్ ఉన్నట్లయితే గర్భం నిలిచే అవకాశం లేదు. అందుకని తదుపరి చేయాల్సిన పరీక్షలు లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ. ఇందులో ఒక టెలిస్కోప్ని పొట్టలోకి (లాప్రోస్కోపీ), గర్భాశయంలోకి (హిస్టరోస్కోపీ) ప్రవేశపెట్టి చూస్తారు. నిజంగానే బ్లాక్ ఉందా..? ఉంటే దానికి కారణమేంటి? ఆ బ్లాక్‌ని తొలగించి ఫెలోపియన్ ట్యూబ్స్‌ని మనం శుభ్రం చేయగలమా? అన్న వివరాలు ఆ పరీక్షలో తెలుస్తాయి. ఒకవేళ బ్లాక్‌ని క్లియర్ చేయగలిగినట్లయితే మీకు సహజంగా గర్భం ధరించే అవకాశాలుంటాయి. అది సరిచేయలేని బ్లాక్ అయితే మీరు ఐవీఎఫ్‌కి వెళ్లాల్సి ఉంటుంది.
అలాగే మీ వారికి హైపర్ థైరాయిడిజం ఉందని రాశారు. థైరాయిడ్ హార్మోన్ అన్నది గర్భం నిలవడానికి చాలా అవసరం కాబట్టి మీ వారు కూడా ఎండోక్రైనాలజిస్ట్ని సంప్రదించి దానికి చికిత్స తీసుకోవడం మంచిది.
- వై.సవితాదేవి, గైనకాలజిస్ట్