గీత: 'హాయ్ కీర్తి.. ఏంటే అలా కూర్చున్నావ్!'
కీర్తి: 'హాయ్ గీత.. ఏం లేదు.. చిన్న ప్రాబ్లం గురించి ఆలోచిస్తున్నా..'
గీత: 'ఏంటది?
కీర్తి: ఎంత ప్రయత్నించినా పొట్టభాగంలో పేరుకుపోయిన కొవ్వు తగ్గట్లేదు. దీనికి కారణమేంటో అర్థం కావట్లేదు. అదే ఆలోచిస్తున్నాను..'
పొట్టభాగంలో పేరుకుపోయిన కొవ్వు తగ్గకపోవడానికి మనం రోజూ చేసే పనులే కారణం కావచ్చు. ఏంటి.. ఆశ్చర్యపోతున్నారా?? కానీ ఇది నిజమండీ.. మరి అవేంటో తెలుసుకోవాలనుందా?? అయితే ఇది చదివేయండి..

ఫాస్టింగా/ డైటింగా??
మనలో చాలామంది ఉపవాసం, డైటింగ్ అని ఎక్కువ సేపు ఆహారం తీసుకోకుండా ఉంటారు. అలాగే కొంతమంది రోజులో ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో పొట్ట భాగంలో కొవ్వు తగ్గకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి రోజూ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, రెండుసార్లు కొద్ది మొత్తంలో స్నాక్స్ తినేలా ఒక ప్రణాళిక తయారు చేసుకోవడం మంచిది.
వయసు పెరుగుతోందా..
మహిళల్లో వయసు పెరిగేకొద్దీ ఇలాంటి సమస్య ఎదురవుతూ ఉంటుంది. శరీరం బరువు తగ్గడమో లేదా పెరగడమో జరుగుతంది. అందుకే మహిళలు మెనోపాజ్ తర్వాత ఎక్కువగా బరువు పెరుగుతారు. పొట్టభాగంలో కూడా ఎక్కువగా కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. కాబట్టి పొట్ట దగ్గర కొవ్వు తగ్గకపోవడానికి వయసు పెరుగుతుండటం కూడా ఒక కారణమే.

ఉప్పు తక్కువగా..
కొంతమంది తినే ఆహారంలో ఉప్పు ఎక్కువగా వాడతారు. దీని వల్ల రక్తంలో ఉండే నీటిశాతం చర్మానికి ఎక్కువగా చేరుతుంటుంది. అందుకే కొందరికి మొహం, పొట్ట.. తదితర భాగాల్లో ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. ఈ సమస్య నుంచి విముక్తి పొందాలంటే ముందు ఆహారంలో వాడే ఉప్పు శాతం తగ్గించుకోవడం మంచిది.
ఒత్తిడి కూడా..
వ్యక్తిగతంగా, వృత్తిపరంగా.. ప్రతి మనిషికీ ఏదో ఒక టెన్షన్ ఉంటూనే ఉంటుంది. మరి ఇలాంటి సమయంలో పొట్టభాగంలో కొవ్వును తగ్గించుకోవడమూ కష్టమే. ఎందుకంటే ఒత్తిడిలో ఉన్నప్పుడే మన శరీరంలో ఎక్కువగా కొవ్వు, క్యాలరీలు వచ్చి చేరుతాయి. ఇదంతా కార్టిసాల్ అనే హార్మోన్ వల్ల జరుగుతుంది. ఒత్తిడి బాగా పెరిగినప్పుడు ఈ హార్మోన్ శరీరంలో కొవ్వు స్థాయుల్ని పెంచి సంబంధిత కొవ్వు కణాల పరిమాణం పెంచుతాయి. అందువల్లే పొట్టభాగంలో కొవ్వు తగ్గకుండా ఉంటుంది.

సమయానుగుణంగా వ్యాయామం..
కొంతమంది కొన్ని రోజులు వరుసగా వ్యాయామం చేసి తర్వాత రోజూ ఏం చేస్తాంలే.. అని లైట్ తీసుకుంటారు. దీనివల్ల కూడా పొట్టభాగంలో కొవ్వు తగ్గకపోవచ్చు. అలాగే మరికొందరు వ్యాయామం చేయడానికి ఓ సమయంమంటూ ఫిక్స్ చేసుకోరు. ఎప్పుడు పడితే అప్పుడే చేస్తుంటారు. ఓ ప్రణాళిక సిద్ధం చేసుకుని వ్యాయామం చేస్తే ఈ సమస్యను అధిగమించే అవకాశం ఉంటుంది.
నిద్రలేమి..
పొట్ట భాగంలో పేరుకుపోయిన కొవ్వు తగ్గకపోవడానికి నిద్రలేమి కూడా కారణం కావచ్చు. తక్కువ సమయం నిద్ర పోవడం వల్ల ఆకలి పెరుగుతుంది. ఫలితంగా అవసరమున్న దానికంటే ఎక్కువగా తింటారు. కాబట్టి రోజూ రాత్రి కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర పోవడం తప్పనిసరి. అది ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే కొవ్వు సమస్య నుంచి కూడా విముక్తి లభిస్తుంది.

ప్యాకేజ్డ్ ఫుడ్ వద్దు..
చాలామంది బస్సు లేదా రైల్లో ప్రయాణించేటప్పుడు ఏదైనా మర్చిపోతారేమో గానీ మధ్యమధ్యలో తినడానికో లేదా టైంపాస్‌కో చిప్స్.. వంటి ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్ కొనుక్కోవడం మాత్రం మరిచిపోరు. కానీ ఇలాంటి ప్యాకేజ్డ్ ఫుడ్స్ పదే పదే తినడం వల్ల శరీరంలో కొవ్వు తగ్గడం కాదు బాగా పెరుగుతుంది. కాబట్టి పొట్టభాగంలో కొవ్వు తగ్గకపోవడానికి ఇది కూడా ఒక కారణమే. అందుకే ఈ సమస్య నుంచి బయటపడాలనుకునే వారు ఇలాంటి జంక్ ఫుడ్‌కి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండడం మంచిది.
సమస్య నుంచి విముక్తికి..
పొట్టభాగంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోవాలంటే తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్, తక్కువ కార్బోహైడ్రేట్లు, చక్కెర స్థాయులు కూడా తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల కేవలం కొవ్వు తగ్గడమే కాదు.. గుండె సంబంధిత సమస్యలు కూడా దరిచేరకుండా జాగ్రత్తపడచ్చు.