ఎటు చూసినా, ఎవరిని మాట్లాడించినా కరోనా తప్ప మరో ధ్యాస లేదు.
ఇంటి నుంచి పనిచేస్తున్నామన్న మాటే కానీ ఎంత చేసినా ఊటలా ఊరే పని.. అది తెచ్చే ఒత్తిడి..!
ఉపాధి కోల్పోయి కొందరు.. తిండి కరువై మరికొందరి ఇక్కట్లు..
నెలల తరబడి కుటుంబ సభ్యులను కలిసే వీల్లేక అనుభవించిన ఒంటరితనం..
ఇవన్నీ ఈ కరోనా నామ సంవత్సరం మిగిల్చిన చేదు జ్ఞాపకాలు. ఇలాంటి ప్రతికూలతలన్నీ అంతిమంగా ప్రభావం చూపింది మన మానసిక ఆరోగ్యం పైనే అనడంలో సందేహం లేదు. మనలాంటి సామాన్యులే కాదు.. సెలబ్రిటీలూ ఇలాంటి మానసిక సమస్యల్ని ఎదుర్కొన్నారు. అయితే వారు వాటితోనే కుంగిపోకుండా వాటిని అధిగమించే మార్గాల్ని అన్వేషించారు.
ఈ క్రమంలో కొందరు గార్డెనింగ్ చేస్తే, మరికొందరు ఆన్లైన్లో కొత్త కోర్సుల్ని నేర్చుకోవడంలో బిజీగా మారిపోయారు. ఇంకొందరేమో యోగాసనాలే తమను ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడేశాయని చెబుతున్నారు. అంతటితో ఆగకుండా తాము చేసిన యోగాసనాల్ని తమ ఫ్యాన్స్‌కి పరిచయం చేసే ఉద్దేశంతో సోషల్ మీడియాలోనూ పోస్టులు పెట్టారు. ఇలా ఒంటికే కాదు.. మనసుకూ యోగాను మించిన ఔషధం లేదని మరోసారి నిరూపించారు. మరి, ఈ ఏడాది యోగాతో తమ మానసిక ఒత్తిళ్లను తగ్గించుకున్న ఆ ముద్దుగుమ్మలెవరు? వారి యోగా ముచ్చట్లేంటి? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!
యోగా ఆ నొప్పిని దూరం చేసింది!
బాలీవుడ్ ఫిట్నెస్ ఫ్రీక్ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు శిల్పాశెట్టిది కాక ఇంకెవరిది! వ్యాయామం, యోగా, మెడిటేషన్.. ఇలా ఏ వర్కవుట్ చేయడంలోనైనా శిల్ప తర్వాతే ఎవరైనా అనడంలో సందేహం లేదు. అంతేకాదు.. తనతో పాటు తన భర్త, కొడుక్కి కూడా ఫిట్‌గా ఉండడం అలవాటు చేసిందీ అందాల అమ్మ. ఇక ఈ క్రమంలో తాను చేసిన వర్కవుట్ వీడియోలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ తన ఫ్యాన్స్‌లోనూ ఫిట్నెస్ పట్ల మక్కువ పెంచుతుంటుందీ లవ్లీ బ్యూటీ. ఈ క్రమంలోనే ఈ కరోనా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడానికి, తాను మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారుకావడానికి యోగాసనాలు ఎంతగానో సహకరించాయంటూ ఓ పోస్ట్ పెట్టిందీ బాలీవుడ్ మామ్. తాను విభిన్న యోగాసనాలు చేస్తోన్న వీడియోను పంచుకున్న శిల్ప..
‘ఈ కరోనా ప్రతికూల పరిస్థితుల్లో తగిన వ్యాయామం అందక ఒక రకంగా మన శరీరం తుప్పు పట్టిపోయింది. దీనికి తోడు వృత్తిపరంగానూ చాలామంది ఇంటికే పరిమితమవడంతో రోజువారీ ప్రయాణాలు చేయాల్సిన అవసరం క్రమంగా తగ్గిపోయింది. ఫలితంగా శరీరానికి సరిపడా వ్యాయామం అందట్లేదన్నది వాస్తవం. నా విషయానికొస్తే.. నా పాపాయిని ఎత్తుకొని ఆడించడం వల్ల దాని ప్రభావం నా లోయర్ బ్యాక్‌పై పడింది. ఇక దీన్నుంచి బయటపడడానికి నేను వ్యాఘ్రాసనం, మార్జారియాసనం (క్యాట్ పోజ్), ఉత్తాన వ్యాఘ్రాసనం.. వంటివి ప్రాక్టీస్ చేశాను. ఈ ఆసనాలు నా శరీరానికి చక్కటి వ్యాయామాన్ని అందించాయి. ముఖ్యంగా నా వెన్నెముక, పొట్ట కండరాలను మరింత దృఢంగా మార్చాయి. ఈ ఆసనాల వల్ల పట్టేసిన నా నడుము (లోయర్ బ్యాక్) తిరిగి మామూలు స్థితికి చేరుకుంది.. శారీరక సమతుల్యత పెరిగింది..’ అంటూ చెప్పుకొచ్చిందీ ఫిట్టెస్ట్ మామ్. ఇలా ఈ కరోనా నామ సంవత్సరంలో ఎన్నో యోగాసనాలు, మరెన్నో ఆరోగ్యకరమైన వంటకాలతో అందరిలో ఆరోగ్య స్పృహ పెంచిందీ లవ్లీ మామ్.
అదే మళ్లీ నన్ను మామూలు మనిషిని చేసింది!
మన మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే అద్భుత ఔషధాల్లో యోగా ఒకటి అంటూ సందర్భం వచ్చినప్పుడల్లా నొక్కి వక్కాణిస్తుంటుంది శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఈ క్రమంలో తాను విభిన్న యోగాసనాలు చేస్తూ వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుందీ చక్కనమ్మ. ఈ క్రమంలో ప్రస్తుత కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ యోగా తన మానసిక ఆందోళనల్ని దూరం చేసిందంటూ ఇన్‌స్టా వేదికగా పంచుకుంది జాక్. కరోనా కారణంగా తాను గత కొన్ని వారాలుగా యాంగ్జైటీతో బాధపడుతున్నానని, యోగానే తనను ఆ సమస్య నుంచి బయటపడేసిందంటూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది.
యోగాసనాలు చేస్తోన్న వీడియోను ఇన్‌స్టాలో పంచుకున్న ఈ భామ.. ‘నేను గత కొన్ని వారాలుగా తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనలతో బాధపడుతున్నా. అయితే నిరంతరం యోగా సాధన చేయడం వల్ల ఈ ప్రతికూల పరిస్థితి నుంచి క్రమంగా బయటపడగలుగుతున్నా. ఈ క్రమంలో నేను ఎన్నో పాఠాలు నేర్చుకున్నా. వర్తమానంలో జీవించాలన్న మంచి విషయాన్ని యోగా నాకు నేర్పించింది. జీవితంలో ఏది ముఖ్యమో, దేని పట్ల కృతజ్ఞతా భావంతో మెలగాలో కూడా తెలుసుకున్నా..’ అంటూ యోగా ప్రాముఖ్యాన్ని మరోసారి చాటిందీ సిలోన్ సుందరి.
అది వ్యాయామం కాదు.. మన లైఫ్‌స్టైల్!
కరోనా ఏంటి.. మన జీవితంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కోగల శక్తి యోగా మనకు అందిస్తుందని చెబుతోంది బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా. వయసు పెరుగుతోన్నా వన్నె తరగని అందానికి కారణం కూడా తాను క్రమం తప్పకుండా యోగాసనాలు చేయడమేనంటూ పలు సందర్భాల్లో పంచుకున్న ఈ ముద్దుగుమ్మ.. తాను చేసిన యోగాసనాలకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే యోగా ప్రాముఖ్యతను ఓ పోస్ట్‌లో రాసుకొచ్చిందీ ఫిట్నెస్ ఫ్రీక్.
‘ఒక్క రోజు కాదు.. రోజూ యోగా నా జీవితంలో ఓ ముఖ్య భాగం. నా జీవితంలో అటు వృత్తిపరంగా, ఇటు వ్యక్తిగతంగా.. ఎన్నో గడ్డు పరిస్థితులు సమర్థంగా ఎదుర్కొన్నానంటే అందుకు కారణం యోగానే! అంతేకాదు.. ఈ వ్యాయామం నన్ను సానుకూల దృక్పథం వైపు నడిపించింది కూడా! ఎంతో గొప్ప జీవితాన్ని నాకు అందించిందిది. అందుకే నా జీవితంలో భాగమైన ప్రతి ఒక్కరికీ నేను చెప్పేది ఒక్కటే.. యోగాను ఒక వ్యాయామంగా కాదు.. లైఫ్‌స్టైల్‌గా మార్చుకోండి. ఇది ఎన్నో ప్రతికూలతల నుంచి మనల్ని బయటపడేస్తుంది. అందుకే ఈ ప్రతికూల పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయండి.. కుటుంబమంతా కలిసి సమయం గడపండి.. పాజిటివిటీ వైపు అడుగులేయండి..’ అంటోంది మలైకా.
యోగాతో పాజిటివిటీ!
ఈ కరోనా నామ సంవత్సరంలో ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై తాము శ్రద్ధ వహించడమే కాదు.. ఈ విషయాల్లో తమ ఫ్యాన్స్‌ని కూడా అలర్ట్ చేశారు కొంతమంది ముద్దుగుమ్మలు. మిల్కీ బ్యూటీ తమన్నా కూడా అదే చేసింది. కరోనా వల్ల కలిగిన మానసిక ఒత్తిడి, ఆందోళనల్ని ఎదుర్కోవడానికి లాక్డౌన్లో 21 రోజుల పాటు ‘స్టే ఫిట్ ఛాలెంజ్’ పేరుతో కొన్ని ప్రత్యేక ఆరోగ్య నియమాలను పాటించానంటోంది తమ్మూ. ఫలితంగా మరింత కూల్‌గా, పాజిటివ్‌గా మారిపోయానంటూ తాను చేసిన వర్కవుట్ వీడియోలను ఎప్పటికప్పుడు పంచుకుందీ అందాల తార.
‘కరోనాకు ముందు వరకు నేను అంతగా ఆరోగ్య నియమాలు పాటించలేదు. సరైన నిద్ర కూడా ఉండేది కాదు. అయితే కరోనా కారణంగా ఖాళీ సమయం దొరికినప్పట్నుంచి శారీరకంగా, మానసికంగా మరింత దృఢంగా తయారయ్యేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేశాను. ఇందుకోసం వర్చువల్‌గా ఓ ట్రైనర్‌ను కూడా నియమించుకున్నాను. ఖాళీ టిష్యూ బాక్స్‌పై ఫోన్ ఉంచి, అందులో ట్రైనర్ చూపించినట్లు కసరత్తులు చేయడం కాస్త కష్టమనిపించినా ఫిట్‌గా మారాలన్న ఇష్టం ఆ కష్టాన్ని దూరం చేసింది. అయితే ఈ ఆరోగ్య నియమాల కారణంగా నా లైఫ్స్టైల్లో చాలా మార్పులొచ్చాయి. అలాగే నా నిద్ర సమయాలు కూడా మారిపోయాయి. ఇక ఈ 21 రోజుల ‘స్టే ఫిట్’ ఛాలెంజ్‌లో నేను నేర్చుకున్న మరో ముఖ్యమైన అంశం సానుకూలంగా ఆలోచించడం. ఇందుకు నాకు యోగా బాగా సహకరించింది. దీంతో నా మనసు మరింత ప్రశాంతంగా, కూల్‌గా మారిపోయేది..’ అంటూ యోగా వల్ల తనకు చేకూరిన ప్రయోజనాల గురించి పంచుకుందీ మిల్కీ డాల్. ఇలా లాక్‌డౌన్‌లోనే కాదు.. కరోనా వైరస్ బారిన పడి దాన్నుంచి బయటపడ్డాక కూడా యోగాసనాలు, ఇతర వ్యాయామాలు తనని తిరిగి దృఢంగా మార్చాయంటోందీ టాలీవుడ్ బ్యూటీ.
మనసుని రిపేర్ చేస్తుంది!
అత్యంత కష్టమైన యోగాసనాల్ని కూడా అలవోకగా చేసేస్తుంటుంది బాలీవుడ్ లవ్లీ బ్యూటీ ఈషా గుప్తా. అది కేవలం మన శరీరానికి వ్యాయామం అందించడమే కాదు.. మనసునూ రిపేర్ చేస్తుందని చెబుతోందీ ఫిట్టెస్ట్ గర్ల్. ఈ కరోనా కాలంలో తానెంతో మానసిక వేదనకు గురయ్యానని, అయితే ఆ దశ నుంచి తనను బయటపడేసింది మాత్రం యోగానే అంటూ ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘ పోస్ట్ రాసుకొచ్చింది ఈషా.
‘యోగా కేవలం వర్కవుట్ మాత్రమే కాదు.. అది మన మనసుని రిపేర్ చేసే సాధనం. ఎవరికైనా ఎప్పుడైనా మానసిక సమతుల్యత కోల్పోయామనిపిస్తే యోగాతో మనసును బ్యాలన్స్ చేసుకోవచ్చు. ఇది శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా మనల్ని శాంతపరుస్తుంది. ఈ ఏడాదంతా కరోనా ప్రతికూలత మధ్యే గడిచిపోయింది. నా విషయంలోనూ ఎన్నో ఒడిదొడుకులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో నేను యోగాను నా జీవనశైలిలో భాగం చేసుకున్నా. ఆ ప్రతికూలతల్ని సమర్థంగా ఎదుర్కొన్నా. మీరూ రోజూ యోగా చేయండి.. మిమ్మల్ని మీరు శారీరకంగా, మానసికంగా దృఢంగా మలచుకోండి. ప్రతి ఒక్కరికీ వారికంటూ ప్రత్యేకమైన లక్ష్యాలుంటాయి. వాటిపై దృష్టి పెట్టండి.. మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి..’ అని చెబుతోందీ బాలీవుడ్ బేబ్.
వీళ్లతో పాటు టాలీవుడ్ బ్యూటీ సమంత, బాలీవుడ్ బేబ్ సుస్మితా సేన్.. తదితర నటీమణులు కూడా ఈ లాక్డౌన్లో యోగాసనాలు వేస్తూ తమ ఒత్తిళ్లను దూరం చేసుకున్నామంటున్నారు.. అంతేకాదు.. శారీరక దృఢత్వాన్నీ పొందారట! మరి, ఈ కరోనా ఏడాదిలో ఒత్తిడి, ఆందోళనల్ని దూరం చేసుకోవడానికి మీరూ యోగాను మీ లైఫ్స్టైల్లో భాగం చేసుకున్నారా? అయితే యోగా మీ జీవితంలో తీసుకొచ్చిన మార్పులేంటి? కింది కామెంట్ బాక్స్‌లో మీ అనుభవాలను రాసి మాతో పంచుకోండి.. నలుగురిలో యోగా స్ఫూర్తిని నింపండి!