కరోనా కారణంగా అందరిలో ఆరోగ్య స్పృహ పెరిగింది. దీనికి తోడు యాంత్రిక జీవనంలో ఉండే ఒత్తిడి, ఇతర సమస్యలతో వ్యాయామానికి బాగా ప్రాధాన్యం పెరిగింది. మానసిక ఆరోగ్యం కోసం కొందరు జిమ్‌ల బాట పడుతుండగా మరికొందరు ఇంటి వద్దనే ఉంటూ వర్కవుట్లు, యోగాలు చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో చాలామంది తమకు టైం లేదని, జిమ్ ఎక్విప్మెంట్ లేదని వ్యాయామాలు చేయలేకపోతున్నారు. ఇలాంటివారికి ఏరోబిక్ వ్యాయామాలు మంచి ప్రయోజనాల్ని చేకూర్చుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

పిల్లల నుంచి వృద్ధుల వరకూ!
సాధారణంగా ఏరోబిక్ అంటే ‘ఆక్సిజన్‌తో (With Oxygen)’ అని అర్థం. వాకింగ్, జాగింగ్, రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, డ్యాన్సింగ్ వంటివన్నీ ఏరోబిక్ వ్యాయామాల కిందకు వస్తాయి. ఇక వీటిని జీవితంలో భాగం చేసుకోవడం వల్ల శరీర బరువు తగ్గడమే కాకుండా జీర్ణ వ్యవస్థ, గుండె సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ వ్యాయామాలు కండరాలు, రక్త ప్రసరణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. అంతేకాదు ఏరోబిక్స్‌తో మెదడులో చురుకుదనం పెరుగుతుందని, తద్వారా ఆలోచనా శక్తి, ఏకాగ్రత పెరుగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎలాంటి పరికరాలు, ఎక్విప్మెంట్ అవసరం లేని ఈ ఎక్సర్సైజులను ఏ వయసువారైనా చేయచ్చు. అయితే ఈ ఎక్సర్సైజుల ద్వారా పూర్తి ప్రయోజనాలు పొందాలంటే కొన్ని విషయాలపై దృష్టి సారించాలంటున్నారు ఫిట్నెస్ నిపుణులు. మరి అవేంటో తెలుసుకుందాం రండి.
వారు వైద్యుడిని సంప్రదించాల్సిందే!
ఏరోబిక్ వ్యాయామాలు అన్ని వయసుల వారికి సురక్షితమే. అయినప్పటికీ వీటిని మొదటిసారి చేసేటప్పుడు ఒకసారి ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదించడం మేలని అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ (AAOS) సూచిస్తోంది. ప్రత్యేకించి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నవారు కచ్చితంగా వైద్యుల సలహాలు తీసుకోవాలి. అధిక బరువు, ధూమపానం అలవాటు ఉన్నవారు, వయో వృద్ధులు, ఇంతకుముందెన్నడూ వ్యాయామాలు చేయనివారు డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే ఈ ఎక్సర్సైజులు ప్రారంభించడం ఉత్తమం.

‘FIT’ను దృష్టిలో ఉంచుకోవాలి!
ఏరోబిక్ వ్యాయామాలు చేసేటప్పుడు ప్రధానంగా మూడు ప్రాథమిక సూత్రాలను దృష్టిలో ఉంచుకోవాలి. అవే FIT (ఫ్రీక్వెన్సీ- ఇంటెన్సిటీ- టైమ్). ఇందులో భాగంగా ఏరోబిక్ ఎక్సర్సైజులను వారానికి 3 నుంచి 4 సార్లకు మించి చేయకూడదని AAOS సూచిస్తోంది. అదేవిధంగా ఈ వ్యాయామాన్ని ప్రతిసారీ కనీసం 30 నిమిషాల పాటు చేయాలి. ఆ తర్వాత వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా వ్యాయామ సమయాన్ని పెంచుకోవచ్చు.
హార్ట్ రేట్‌ను చెక్ చేసుకోండి!
సాధారణంగా ఎలాంటి వ్యాయామాలు చేసినా హార్ట్ రేట్ క్రమంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఏరోబిక్ వ్యాయామాలు చేసేటప్పుడు హృదయ స్పందన రేటును పర్యవేక్షించుకోవడం ఎంతో ముఖ్యం. ఇది వ్యక్తికి వ్యక్తికి భిన్నంగా ఉంటుంది. అందువల్ల ఏరోబిక్ ఎక్సర్సైజ్ సమయంలో ఎప్పటికప్పుడు హార్ట్ రేట్‌ను చెక్ చేసుకోవడం చాలా ముఖ్యమని గుర్తుంచుకోవాలి. ఈ క్రమంలో హృదయ స్పందన రేటు బాగా పెరిగి శరీరం ఎక్కువగా అలసటకు లోనైనట్లు అనిపిస్తే వ్యాయామం ఆపి విశ్రాంతి తీసుకోవాలి.

సాధన సమయం
ఈ రకమైన వ్యాయామాలు చేసేటప్పుడు ఎంత సమయం చేస్తున్నామనే దానిపై కూడా ప్రధానంగా దృష్టి సారించాలి. పూర్తి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు 20 నిమిషాల పాటు ఈ వ్యాయామాన్ని చేస్తే మంచి ఫలితముంటుందని AAOS చెబుతోంది. సరైన ఫిట్నెస్ లేనప్పుడు కానీ, మొదటిసారి ఈ ఎక్సర్సైజులు చేస్తున్నప్పుడు కానీ, తక్కువ వ్యవధితో ఈ ఎక్సర్సైజులను ప్రారంభించాలి. ఆ తర్వాత క్రమంగా సాధన సమయాన్ని పెంచుకోవాలి. ఇక FIT సూత్రాలపై అవగాహన పెరిగాక క్రమంగా వ్యాయామ సమయాన్ని పెంచుకోవచ్చు. సాధారణంగా వ్యాయామానికి ఉదయమే మంచి వేళ. కాబట్టి ఆ సమయంలో చేస్తే మంచి ఫలితముంటుంది. ఇక ఏరోబిక్స్ ద్వారా పూర్తి ప్రయోజనాలను పొందాలంటే కనీసం 12 వారాల పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

వార్మప్‌ను మరవద్దు!
ఏరోబిక్స్ చేసేటప్పుడు తప్పనిసరిగా వార్మప్ చేయాలి. తద్వారా గాయాల నుంచి ఉపశమనం పొందుతారు. అంతేకాదు ఫిట్నెస్ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయి. ఏరోబిక్స్ పూర్తి ప్రయోజనాలు పొందాలంటే కనీసం 10 నిమిషాల పాటు వార్మప్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
గుండెకు చాలా మంచిది!
దీర్ఘకాలం పాటు ఏరోబిక్స్ చేయడం వల్ల శరీరంలోని అనవసర కొవ్వు బాగా కరుగుతుంది. అదేవిధంగా మంచి కొలెస్ట్రాల్ స్థాయి బాగా పెరుగుతుంది. తద్వారా గుండె, ఊపిరితిత్తుల పని తీరు బాగా మెరుగవుతుంది. గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటిస్, ఆర్థరైటిస్, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం గణనీయంగా తగ్గుతుంది. ఒత్తిడిని అధిగమించగల సామర్థ్యం, శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతాయి.