Photo: Instagram
శరీరాన్ని, మనసును ఫిట్‌గా మార్చడంలో వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుందన్న విషయం మనకు తెలిసిందే! అయితే ఇలా కసరత్తులు చేసే క్రమంలో మన శరీరంలోని నీరు చెమట రూపంలో బయటికి వెళ్లిపోతుంది.. తద్వారా డీహైడ్రేట్ అవుతాం.. అలాగే శక్తినీ కోల్పోతాం. మరి, దీన్ని తిరిగి కూడగట్టుకోవాలంటే అందుకు కొన్ని రకాల ఆహార పదార్థాలు చక్కగా ఉపయోగపడతాయి. అలా తన పోస్ట్ వర్కవుట్ బ్లూస్ని దూరం చేసుకోవడానికి ఓ సహజసిద్ధమైన డ్రింక్ ఔషధంగా పనిచేస్తుందంటోంది బాలీవుడ్ అందాల తార తాప్సీ. ప్రస్తుతం ‘రష్మీ రాకెట్’ సినిమా కోసం చక్కటి శరీర సౌష్టవాన్ని పొందడానికి తీవ్ర కసరత్తులు చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ.. చక్కటి ఆహార నియమాలూ పాటిస్తోంది. వాటికి సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన ఫ్యాన్స్‌కి ఫిట్నెస్ పాఠాలు నేర్పుతోందీ పింక్ బ్యూటీ.
సినిమాల్లో పాత్రలకు అనుగుణంగా తమ శరీరాన్ని మార్చుకోవడం మన ముద్దుగుమ్మలకు అలవాటే! ప్రస్తుతం తాప్సీ కూడా అదే పనిలో ఉంది. గుజరాత్‌కు చెందిన స్ప్రింటర్ రష్మి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతోన్న ‘రష్మీ రాకెట్’ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తోందీ సొట్టబుగ్గల బ్యూటీ. ఈ క్రమంలో పరుగు సాధన చేయడం, వివిధ రకాల కఠినమైన వ్యాయామాలు చేయడం, ప్రముఖ న్యూట్రిషనిస్ట్ మున్మున్ గనేరీవాల్ సలహాలతో చక్కటి ఆహారపుటలవాట్లు పాటించడం.. వంటివి చేస్తోంది తాప్సీ.
ఇదే నా పోస్ట్ వర్కవుట్ సీక్రెట్!
ఈ క్రమంలో తాను తీసుకునే హెల్దీ బ్రేక్‌ఫాస్ట్; వ్యాయామం తర్వాత శారీరక నొప్పుల్ని తగ్గించుకోవడానికి, అదే సమయంలో కొవ్వును కరిగించుకోవడానికి యాపిల్ సిడార్ వెనిగర్‌తో చేసిన ఓ న్యాచురల్ డ్రింక్ చక్కగా పనిచేస్తుందంటూ ఇటీవలే వరుస పోస్టులు పెట్టిన ఈ చక్కనమ్మ.. తాజాగా తన పోస్ట్ వర్కవుట్ సీక్రెట్‌ని బయటపెట్టింది.

పార్క్‌లో బల్లపై కూర్చొని డ్రింక్ తాగుతోన్న ఫొటోని ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసిన తాప్సీ.. ‘సత్తు పిండి (వేయించిన శెనగపిండి), అవిసె గింజలు, మెంతి పిండి.. ఇవన్నీ మజ్జిగలో కలిపి తయారుచేసిన ఈ అద్భుతమైన డ్రింక్‌లో ప్రొటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. నా న్యూట్రిషనిస్ట్ మున్మున్ నాకు దీన్ని సూచించారు. ఈ పానీయం వల్ల మంచి బ్యాక్టీరియా, ప్రిబయోటిక్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి అందుతాయి. వ్యాయామం చేయడం వల్ల శరీరం కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి దీన్ని మించిన డ్రింక్ మరొకటి లేదు..’ అంటూ ఫొటోపైనే క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇలా ఇటు తన పోస్ట్ వర్కవుట్ సీక్రెట్‌ని బయటపెడుతూనే.. అటు అందరికీ ఫిట్నెస్ పాఠాలు నేర్పుతోందీ కర్లీ బేబ్.

ఇవి కూడా మంచివే!
*వ్యాయామం వల్ల శరీరం తేమను కోల్పోవడం సహజం. తద్వారా నీరసం, కండరాల నొప్పులు, మానసిక సమస్యలు ఎదురవుతాయి. అయితే వీటిని దూరం చేయడంలో చాక్లెట్ మిల్క్ చక్కగా ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. మరీ ముఖ్యంగా సైక్లింగ్, రన్నింగ్, ఇతర క్రీడల్లో శిక్షణ పొందిన వారు వ్యాయామం తర్వాత తక్షణ శక్తి కోసం దీన్ని తీసుకోవచ్చని కొన్ని అధ్యయనాలు కూడా స్పష్టం చేస్తున్నాయి.
*యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలతో నిండిన కొబ్బరి నీళ్లను సైతం పోస్ట్ వర్కవుట్ డ్రింక్‌గా తీసుకోవచ్చు. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం.. వంటి ఎలక్ట్రోలైట్స్ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అలాగే ఇతర స్పోర్ట్స్ డ్రింక్స్‌తో పోల్చితే ఇందులో ఉప్పు శాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది.
*వ్యాయామం తర్వాత తలెత్తే కండరాల నొప్పుల్ని, వాపుని తగ్గించడంలో చెర్రీ పండ్ల రసం చక్కగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు నిపుణులు. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే ఈ రసాన్ని వ్యాయామం తర్వాతే కాదు.. వ్యాయామానికి ముందూ తీసుకోవచ్చని, తద్వారా శరీరం సరికొత్త శక్తిని కూడగట్టుకుంటుందని ఓ అధ్యయనంలో రుజువైంది.

*నీరసంగా అనిపించినప్పుడు ఉత్సాహాన్ని తిరిగి పొందాలంటే చాలామంది ఆశ్రయించేది టీనే! అయితే వ్యాయామం తర్వాత మనం రోజూ తాగే టీ కాకుండా బ్లాక్ టీ, గ్రీన్ టీ.. వంటి వాటికి ప్రాధాన్యమివ్వమంటున్నారు ఫిట్నెస్ నిపుణులు. తద్వారా శరీరంలోని కొవ్వుల్ని ఇవి విచ్ఛిన్నం చేసి తక్షణమే శక్తిగా మార్చి శరీరానికి అందిస్తాయట! అలాగే కండరాల బలానికీ ఈ డ్రింక్ చక్కగా దోహదం చేస్తుంది.
*కొన్ని రకాల పండ్లతో తయారుచేసిన స్మూతీస్ కూడా వ్యాయామం తర్వాత శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో సహకరిస్తాయి. ఈ క్రమంలో అరటి, కమలాఫలం, పైనాపిల్, పచ్చి మామిడి.. వంటి వాటితో స్మూతీస్ తయారుచేసుకొని తాగేయచ్చు.