కొంతమంది వారి కెరీర్‌తో సంబంధం ఉన్నా, లేకపోయినా కొత్త కొత్త విద్యలు నేర్చుకోవడానికి ఉత్సుకత చూపుతారు. అదే మరికొందరు తమ కెరీర్లో దూసుకుపోవడానికి ఎంత కష్టమైన నైపుణ్యమైనా ఇష్టంగా నేర్చేసుకుంటారు. అలాగే ఓ నటిగా తాను కూడా కొత్త కొత్త విద్యలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతానంటోంది బాలీవుడ్ ముద్దుగుమ్మ దియా మీర్జా. పర్యావరణమంటే ప్రాణం పెట్టే ఈ చక్కనమ్మ.. తన ఆరోగ్యకరమైన లైఫ్స్టైల్కీ అంతే ప్రాధాన్యమిస్తుంటుంది. ఈ క్రమంలో తాను పాటించే ఆరోగ్య రహస్యాలు, ఫిట్నెస్ చిట్కాలను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ కోసం పంచుకుంటుంటుంది దియా. ఈ క్రమంలోనే తాను కలరిపయట్టు అనే యుద్ధ విద్య నేర్చుకుంటోన్న ఫొటోను ఇటీవలే ఇన్‌స్టాలో పోస్ట్ చేసిందీ బాలీవుడ్ బ్యూటీ. మరి, ఇంతకీ ఉన్నట్లుండి ఇంత కష్టతరమైన యుద్ధ కళను ఈ ముద్దుగుమ్మ ఎందుకు నేర్చుకుంటోందో తెలుసుకుందాం రండి..!
నచ్చింది నేర్చుకోవడానికి నేనెప్పుడూ సిద్ధమే!
ఆయా సినిమాల్లో తమ పాత్రలకు తగ్గట్లుగా నటీమణులు తమను తాము మలచుకోవడం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కొత్త కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటుంటారు చక్కనమ్మలు. ప్రస్తుతం దియా కూడా అదే చేస్తోంది. ఓ సినిమా ప్రాజెక్ట్ కోసం కలరిపయట్టు అనే మార్షల్ ఆర్ట్‌లో శిక్షణ పొందుతోందట ఈ సొగసరి. దీనికి సంబంధించిన ఫొటోను ఇటీవలే ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన దియా.. ఓ నటిగా కొత్త కొత్త విద్యలు నేర్చుకోవడం తనకు మహా ఇష్టమంటోంది.

‘ఒక నటిగా కొత్త మార్గాల్ని అన్వేషించడానికి, వాటికి తగినట్లుగా కొత్త నైపుణ్యాల్ని నేర్చుకోవడానికి నేనెప్పుడూ ఆసక్తి చూపుతుంటా. అందుకోసం ఎంత కష్టపడడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఈ క్రమంలో అలుపన్నదే రాదు!’ అంటోంది దియా.
గతంలో వీళ్లు కూడా!
మరి, దియా నేర్చుకుంటోన్న ఈ యుద్ధకళ అంత సులభమైంది కాదు. కేరళలో పుట్టిన ఈ ప్రాచీన యుద్ధ విద్యలో ఎంతో కష్టపడితే గానీ నిష్ణాతులం కాలేమంటున్నారు నిపుణులు. అయితే సాధన చేస్తున్న కొద్దీ వేగం, శారీరక సత్తువను పెంపొందించుకోవచ్చంటున్నారు. కేవలం దియానే కాదు.. గతంలో అసిన్, దీపికా పదుకొణే, శిల్పా శెట్టి, కంగనా రనౌత్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, అదితీ రావ్ హైదరీ, శ్రద్ధా కపూర్.. వంటి పలువురు తారలు తమ అభిరుచులకు అనుగుణంగా, వివిధ సినిమా ప్రాజెక్టుల కోసం ఇలాంటి యుద్ధ విద్యల్ని నేర్చుకొని తమ సత్తా చాటారు. ఏదేమైనా ఈ యుద్ధ విద్యను ట్రైనర్ సహాయంతో దశల వారీగా నేర్చుకోవచ్చు. ముందు శరీరం ఫ్లెక్సిబుల్‌గా మారేందుకు దోహదం చేసే వ్యాయామాలతో మొదలై.. ఆపై కర్రలు, కత్తులు.. వంటి వాటితో ఈ యుద్ధ కళను నేర్చుకుంటుంటారు.

ఆరోగ్యానికి.. ఫిట్నెస్కీ!
ఇలాంటి యుద్ధ విద్య మన శక్తిసామర్థ్యాలను పెంచడమే కాదు.. అటు ఆరోగ్య పరంగా, ఇటు ఫిట్నెస్ పరంగానూ బోలెడన్ని ప్రయోజనాలను మనకు అందిస్తుందంటున్నారు నిపుణులు.
* కలరిపయట్టు యుద్ధ విద్యలో భాగంగా చేతులు, కాళ్లను కదిలించడం.. శరీరాన్ని విల్లులా వంచడం, ఎగిరి దూకడం.. వంటి పలు భంగిమల వల్ల శరీరంలోని ప్రతి అవయవానికీ చక్కటి వ్యాయామం లభిస్తుంది. తద్వారా శరీరం ఫ్లెక్సిబుల్‌గా మారుతుంది.
* అలాగే ఈ యుద్ధ కళ సాధన చేస్తున్న క్రమంలో కండరాలకు, ఎముకలకు మంచి వ్యాయామం అందుతుంది. తద్వారా కండరాల్లో, ఎముకల్లో ఏవైనా గాయాలు, వాపు.. వంటివి ఉంటే త్వరగా మానిపోతాయంటున్నారు నిపుణులు.
* ఇందులో భాగంగా శత్రువు కదలికలను పసిగట్టి వారి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి వేగంగా స్పందించాల్సి వస్తుంది. ఈ క్రమంలో మన ఏకాగ్రత, వేగం పెరుగుతాయి. ముఖ్యంగా అమ్మాయిలకు ఈ కళ బాగా ఉపయోగపడుతుందని చెప్పచ్చు. ఇది వారికి ఆత్మరక్షణ విద్యగా ఉపకరిస్తుంది.
* కొంతమంది ఏ పని చేయాలన్నా బద్ధకిస్తుంటారు. అలాంటివారు బద్ధకాన్ని వదిలించుకోవాలంటే ఈ మార్షల్ ఆర్ట్ సరైందని సూచిస్తున్నారు నిపుణులు.
* శారీరక సత్తువను, దేహ దారుఢ్యాన్ని, ఓపికను పెంచడంలో ఈ యుద్ధకళను మించింది లేదు.
* కలరిపయట్టులో శిక్షణ పొందే క్రమంలో కొన్ని యోగాసనాలు కూడా నేర్పిస్తారు. అవి శారీరక, మానసిక ఒత్తిళ్లను మటుమాయం చేయడంలో బాగా సహకరిస్తాయి. తద్వారా సానుకూల దృక్పథం అలవడడంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపవుతుంది.
* బరువు తగ్గడానికి, చక్కటి శరీరాకృతిని సొంతం చేసుకోవడానికి, జీవక్రియల పనితీరును మెరుగుపరచుకోవడానికి ఈ యుద్ధ విద్యకు సాటి మరొకటి లేదు.
* ఈ రోజుల్లో మహిళలు ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. అలాంటప్పుడు మీరు ముందే ఈ యుద్ధ విద్యలో నైపుణ్యం సాధించి ఉంటే మీరే ఓ కోచింగ్ ఇనిస్టిట్యూట్ పెట్టుకొని ఇతర మహిళలకు ఇందులో శిక్షణ ఇవ్వచ్చు. ఇది మీకు మంచి ఉపాధి మార్గంగానూ ఉపయోగపడుతుంది.