సినిమాల్లో పాత్రలకు అనుగుణంగా తమను తాము మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు అందాల తారలు. ఈ క్రమంలోనే బరువు పెరగడానికి, తగ్గడానికి, వ్యాయామాలు చేయడానికి, ఆహారపుటలవాట్లు మార్చుకోవడానికి.. ఇలా దేనికైనా రడీ అయిపోతారు. అంతేనా.. తాము పాటించే లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలోనూ పంచుకుంటుంటారు కూడా! ప్రస్తుతం ‘రష్మీ రాకెట్’ సినిమా కోసం సన్నద్ధమవుతోన్న బాలీవుడ్ అందాల తార తాప్సీ కూడా ఆ సినిమా కోసం ఎంతగానో కష్టపడుతోంది. గుజరాత్‌కు చెందిన స్ప్రింటర్ రష్మి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో లీడ్‌రోల్ పోషిస్తోన్న ఈ సొట్టబుగ్గల బ్యూటీ.. తన శరీరాన్ని అథ్లెట్‌గా మార్చుకునేందుకు తీవ్ర కసరత్తులు చేస్తోంది. మరోవైపు చక్కటి ఆహార నియమాలనూ పాటిస్తోంది. ఈ నేపథ్యంలో ఫిట్‌గా మారేందుకు తాను తీసుకుంటోన్న ఓ హెల్దీ డ్రింక్ రెసిపీని ఇన్‌స్టా వేదికగా పంచుకుందీ బాలీవుడ్ అందం.
మహిళా ప్రాధాన్యమున్న సినిమాలు, విభిన్న పాత్రల్ని ఎంచుకుంటూ కెరీర్లో దూసుకుపోతోంది తాప్సీ. ఇదే జోరును ‘రష్మీ రాకెట్’లోనూ కొనసాగించాలని కోరుకుంటోందీ ముద్దుగుమ్మ. అందుకే గుజరాత్‌కు చెందిన స్ప్రింటర్ రష్మిగా తెరపై ఒదిగిపోవడానికి అటు తన శరీరాన్ని, ఇటు సత్తువనూ పెంచుకునే పనిలో పడింది. ఈ క్రమంలో ఓవైపు తీవ్రమైన కసరత్తులు చేస్తూనే.. మరోవైపు ఫిట్‌గా మారేందుకు చక్కటి ఆహార నియమాలనూ పాటిస్తోంది. అంతేనా.. ఆ సీక్రెట్స్ గురించి ఇన్‌స్టా వేదికగా తన ఫ్యాన్స్‌తో ఎప్పటికప్పుడు పంచుకుంటోంది కూడా!
ఆ నొప్పి నుంచి నన్ను బయటపడేస్తుందిది!
సాధారణంగా మనకు వ్యాయామం అలవాటున్నా కొన్ని కఠినమైన వర్కవుట్ల వల్ల మన శరీరం, కండరాలు.. గాయపడడం, నొప్పి పుట్టడం.. వంటివి సహజమే! అలా తీవ్రమైన కసరత్తులు చేసే క్రమంలో తనకెదురయ్యే శారీరక నొప్పుల్ని మటుమాయం చేయడానికి ఈ న్యాచురల్ డ్రింక్ తాగుతున్నానంటూ తాజాగా ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది తాప్సీ. సముద్ర తీరంలో, సూర్యాస్తమయ సమయంలో హెల్దీ డ్రింక్ తాగుతోన్న ఫొటోను పోస్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. దాన్నెలా తయారుచేసుకోవాలో కూడా క్యాప్షన్‌గా రాసుకొచ్చింది.
‘ప్రముఖ న్యూట్రిషనిస్ట్ మున్మున్ గనేరీవాల్ నా రోజువారీ ఆహార నియమాలను అద్భుతంగా ప్లాన్ చేస్తుంటుంది. ఈ డ్రింక్ కూడా తాను సూచించిందే! యాపిల్ సిడార్ వెనిగర్‌లో మెంతులు, పసుపు, అల్లం వేసి తయారుచేసిన ఈ ఆరోగ్యకరమైన పానీయాన్ని ప్రతి రోజూ సాయంత్రం పూట తీసుకుంటున్నా. ఇది కొవ్వును కరిగించడంలో సమర్థంగా పనిచేస్తుంది. ఇక ఇందులో వాడిన పసుపు, అల్లం శరీరంపై ఏర్పడిన వాపుని తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి మాత్రల కంటే ఈ పానీయం చక్కగా పని చేస్తుందని నా స్వీయానుభవంతో చెబుతున్నా. అంతేకాదు.. అథ్లెటిక్ ట్రైనింగ్‌లో భాగంగా నేనెదుర్కొంటోన్న కండరాల నొప్పి, వాపు.. వంటివన్నీ దూరం చేసుకోవడానికి నేను ఈ న్యాచురల్ డ్రింక్‌నే ఆశ్రయిస్తున్నా..’ అంటూ తన ఫిట్నెస్ సీక్రెట్‌ని బయటపెట్టిందీ సొట్టబుగ్గల బ్యూటీ.
ఇదే నా బ్రేక్‌ఫాస్ట్!
కేవలం ఇప్పుడే కాదు.. ‘రష్మీ రాకెట్’ సినిమా కోసం సన్నద్ధమయ్యే క్రమంలో తన రోజువారీ ఆహారపుటలవాట్లను మార్చుకున్నానని మొన్నామధ్య మరో పోస్ట్‌లో భాగంగా పంచుకుందీ ‘పింక్’ బ్యూటీ. ‘రష్మీ రాకెట్ సినిమా కోసం ఇలా సన్నద్ధమవుతున్నా. ఈ క్రమంలో న్యూట్రిషనిస్ట్ మున్మున్ గనేరీవాల్ సలహా మేరకు కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే చిలగడదుంప టిక్కీలను అల్పాహారంగా తీసుకుంటున్నా. ‘అథ్లెట్ మాదిరిగా నా శరీరాన్ని మలచుకోవాలంటే కేవలం ప్రొటీన్లు తీసుకుంటే సరిపోదు.. అన్ని పోషకాలకు సమప్రాధాన్యం ఇవ్వాల’ని ఆమె చెప్పారు. అందుకే ఈ రుచికరమైన వంటకాన్ని నా డైట్లో భాగం చేసుకున్నా. ఫైబర్ అధికంగా లభించే ఈ అల్పాహారం రుచిలోనూ అద్భుతః’ అంటూ తాను టిక్కీల రుచిని ఆస్వాదిస్తోన్న ఫొటోను ఈ క్యాప్షన్‌కి జత చేసిందీ చక్కనమ్మ.
ఇలా ఈ ముద్దుగుమ్మ పాటిస్తోన్న ఆహార నియమాలు, చేస్తోన్న కఠినమైన కసరత్తులు.. పనిపట్ల తనకున్న అంకితభావాన్ని మరోసారి బయటపెట్టాయనడంలో సందేహం లేదు.