నీలిమ, మధురిమ.. ఇద్దరూ చిన్నప్పటి నుంచీ మంచి స్నేహితులు. ప్రస్తుతం వీరిద్దరూ ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అయితే వీరిలో నీలిమ కంటే మధురిమ కాస్త లావుగా ఉంటుంది. దీంతో తను కూడా నీలిమలా నాజూగ్గా తయారవ్వాలని రోజూ వ్యాయామాలు చేయడం, మంచి ఆహారం తీసుకోవడం.. వంటి చిట్కాలన్నీ పాటిస్తోంది.
ఇలా చాలామంది బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఇవన్నీ సరే గానీ.. వీటితో పాటు మీరు చేయాల్సిన పని మరొకటుంది. అదేంటీ అంటారా? రాత్రి పడుకునే ముందు కొన్ని చిన్న చిన్న చిట్కాల్ని పాటించడం! దీనివల్ల కొద్ది రోజులకే బరువు తగ్గి నాజూగ్గా తయారుకావచ్చంటున్నారు ఫిట్నెస్ నిపుణులు. మరి అవేంటో తెలుసుకొని మనమూ పాటిద్దాం రండి..
ఉప్పు తక్కువగా..
అబ్బ.. రోజంతా ఆఫీసు ఒత్తిడితో లంచ్ కూడా సరిగా చేయట్లేదు. కనీసం రాత్రుళ్త్లెనా కడుపునిండా ఆహారం తినేసి హాయిగా నిద్రపోదాం.. అనుకుంటుంటారు చాలామంది. అయితే ఇలా రాత్రుళ్లు ఫుల్గా లాగించి నిద్రపోవడం వల్ల నాజూగ్గా తయారవడమేమో గానీ మరింత లావెక్కే ప్రమాదం ఉంది. కాబట్టి పడుకోవడానికి కనీసం రెండు గంటల ముందు అది కూడా ఉప్పు తక్కువగా ఉండే ఆహార పదార్థాలనే తక్కువ మోతాదులో తీసుకునేలా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు ఎక్కువగా ఉండే పదార్థాల్ని తినడం వల్ల ఉదయం నిద్ర లేచేటప్పటికి శరీరమంతా ఉబ్బినట్లుగా అనిపిస్తుందంటున్నారు నిపుణులు. కాబట్టి ఉడికించిన కూరగాయలు, రోటీ.. వంటి తేలికపాటి ఆహారాన్ని రాత్రుళ్లు తీసుకోవడం వల్ల జీవక్రియల పనితీరు మెరుగుపడి.. క్రమంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

చక్కటి నిద్రకు..
బరువు పెరగడానికి నిద్రలేమి కూడా ఓ కారణం. కాబట్టి రాత్రుళ్లు సుఖంగా నిద్ర పట్టాలంటే శరీరానికి కాస్త పనిచెప్పడం అవసరం. ఇందులో భాగంగా సాయంత్రం పూట పుషప్స్, పులప్స్, బరువులెత్తడం.. వంటి వ్యాయామాలు చేయడం అలవాటుగా మార్చుకోవాలి. అలాగే గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేయడం, పడుకునేటప్పుడు గదిలోని లైట్లన్నీ ఆఫ్ చేసుకోవడం, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను పడకగదికి దూరంగా ఉంచడం.. ఇలాంటి పనుల వల్ల ఒత్తిడి మాయమై.. రాత్రుళ్లు చక్కగా నిద్రపడుతుంది. తద్వారా క్రమంగా బరువూ తగ్గచ్చు.
మరికొన్ని..
* బరువు తగ్గడంలో లైంగిక చర్య కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇది దంపతుల్లోని మానసిక, శారీరక ఒత్తిళ్లను తగ్గించి, ఉత్తేజాన్ని అందిస్తుంది. ఈ క్రమంలో శరీరంలోని అదనపు క్యాలరీలు కూడా కరిగిపోతాయి. తద్వారా నెమ్మదిగా బరువు కూడా తగ్గచ్చు.
* జున్నులోని కేసిన్, ట్రిఫ్టోఫాన్.. వంటి ప్రొటీన్లు బరువు తగ్గడంలో సహాయపడతాయి. కాబట్టి రోజూ రాత్రి పడుకునే ముందు ఓ కప్పు జున్ను తినడం అటు ఆరోగ్యానికి, ఇటు ఫిట్నెస్కీ మంచిది.
* గ్రీన్ టీ, బ్లాక్ టీ, అల్లం టీ.. వంటి పానీయాలకు మానసిక, శారీరక ఒత్తిళ్లను దూరం చేయడంతో పాటు శరీరంలోని అదనపు కొవ్వుల్ని కరిగించే శక్తి కూడా ఉందంటున్నాయి కొన్ని అధ్యయనాలు.
* రాత్రి భోజనానికి వండే ఆహార పదార్థాల్లో మిరియాలు లేదంటే మిరియాల పొడిని కొద్దిగా వేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే వీటిలో శరీరంలోని అదనపు కొవ్వుల్ని కరిగించే పదార్థాలు ఎక్కువగా ఉన్నట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
బరువు తగ్గడానికి రాత్రి పడుకొనే ముందు పాటించాల్సిన చిన్న చిన్న చిట్కాలేంటో తెలుసుకున్నారు కదా! మరింకెందుకాలస్యం.. వెంటనే వీటిని పాటించడం మొదలుపెట్టేయండి.