బరువు తగ్గడానికి రోజూ చేసే వ్యాయామాలతో పాటు ఇంట్లో చేసే కొన్ని చిన్న చిన్న పనులు కూడా తోడ్పడతాయన్న సంగతి మనకు తెలిసిందే. అయితే వీటికి సాయంత్రం చేసే కొన్ని సులభమైన పనులు కూడా తోడైతే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుందంటున్నారు నిపుణులు. అలాగని నామమాత్రంగా వీటిని ఫాలో అవుతూ తక్షణమే బరువు తగ్గాలనుకోవడం కూడా సరికాదు. కాబట్టి సాయంత్రం పూట చేసే ఆ పనుల్ని రోజువారీ అలవాట్లుగా మార్చుకోవాలి. తద్వారా నిర్దేశించుకున్న లక్ష్యాల్ని అనతి కాలంలోనే చేరుకోవచ్చు. మరి బరువు తగ్గడానికి రోజూ సాయంత్రం పూట చేయాల్సిన ఆ పనులేంటో మనం కూడా తెలుసుకుందామా...

షవర్ చేస్తున్నారా?
ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోవడానికి నిద్రలేమి కూడా ఓ కారణమే. అందుకే ఈ సమస్యను వీలైనంత త్వరగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఒత్తిడి, అలసట.. వంటివి తరిమికొట్టడానికి మాత్రమే కాదు.. నిద్రలేమి నుంచి విముక్తి కలిగించడానికి కూడా షవర్ బాత్ చాలానే ఉపయోగపడుతుంది. కాబట్టి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత గోరువెచ్చని నీటితో లేదంటే పడుకునే ముందు షవర్ బాత్ చేయడం వల్ల శారీరక అలసట తగ్గి ప్రశాంతత సొంతమవుతుంది. ఫలితంగా రాత్రుళ్లు నిద్ర కూడా చక్కగా పడుతుంది. కాబట్టి దీన్ని కూడా రోజువారీ అలవాటుగా మార్చుకుంటే కొన్ని రోజులకే అధిక బరువు నుంచి విముక్తి పొందచ్చు.

పడుకునే ముందు..
బరువు తగ్గి నాజూగ్గా తయారు కావాలంటే రాత్రి నిద్రపోవడానికి ముందు చేసే కొన్ని పనులు కూడా దోహదం చేస్తాయి. అసలే నిద్రొస్తుందంటే మీరింకా అప్పుడు కూడా పనులంటారేంటి.. అనుకోవద్దు. ఇవి చాలా సింపుల్.. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహార పదార్థాల్ని పడుకునే ముందు తీసుకోవడం రోజూ అలవాటుగా మార్చుకోవాలి. ఇందుకోసం ఒక కప్పు గ్రీన్ టీ, గ్లాస్ చొప్పున బెర్రీ పండ్ల రసం, ఆకుకూరలతో తయారు చేసిన జ్యూస్, నట్స్.. వంటివి తీసుకోవడం చాలా మంచిది. ఫలితంగా వీటిలో అధిక మొత్తంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని విషతుల్యాలను తొలగించి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఫలితంగా క్రమంగా అధిక బరువు నుంచి విముక్తి పొందచ్చు. వీటిని తాగడం అంతగా ఇష్టం లేని వారు నీటిని గోరు వెచ్చగా చేసుకుని పడుకోవడానికి కనీసం ఇరవై నిమిషాల ముందు తాగినా మంచి ఫలితం ఉంటుంది. అలాగే రాత్రి భోజనం పూర్తయిన కాసేపటి తర్వాత కనీసం పది నుంచి పదిహేను నిమిషాల పాటు నడవడం చాలా మంచిది. ఈ క్రమంలో ముందుగా కాస్త నెమ్మదిగా నడుస్తూ క్రమంగా దాని వేగం పెంచుతూ ఉంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
మిత భోజనం!
రాత్రి పడుకునే ముందు ఓ చికెన్ బిర్యానీనో లేదంటే మటన్ బిర్యానీనో లాగించేసి తృప్తిగా పడుకుందామని చూస్తుంటారు కొంతమంది. అయితే ఇలా చేస్తే బరువు తగ్గడానికి బదులు పెరుగుతారని గుర్తుంచుకోండి. కాబట్టి రాత్రి పడుకునే ముందు తీసుకునే భోజనం ఎంత మితంగా ఉంటే అంత మంచిది. ఈ క్రమంలో సలాడ్స్, పండ్లు.. వంటివి తీసుకోవడం మంచిది. అలాగే రాత్రి తీసుకునే ఆహారంలో ఉప్పు తక్కువగా ఉండేలా చూసుకోవడం.. వంటి చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ఉత్తమం. భోజనం తక్కువగా తినడం వల్ల అర్ధరాత్రి ఆకలేస్తే.. చిప్స్, బిస్కట్లు, ఇతర జంక్ ఫుడ్‌ని ఆశ్రయించారంటే ఇక అంతే! కాబట్టి భోజన సమయంలో తీసుకునే పండ్లు, సలాడ్స్.. వంటి ఆహార పదార్థాలే కాస్త ఎక్కువ మొత్తంలో తీసుకోవడం మంచిది. అలాగే పడుకునే ముందు బ్రష్ చేసుకోవడం చాలా మంచి అలవాటు. దీనివల్ల రోజంతా తిన్న రకరకాల ఆహార పదార్థాల వల్ల కలిగే నోటి దుర్వాసన దూరమవడంతో పాటు రాత్రుళ్లు పదే పదే ఆకలేయకుండా కూడా ఉంటుందట. ఫలితంగా క్రమంగా బరువు తగ్గచ్చు.

సాయంత్రం చేస్తే..
వ్యాయామం ఉదయమే కాదు.. సాయంత్రం పూట చేసేవారు కూడా కొంతమంది ఉంటారు. సాధారణంగా వ్యాయామం చేసిన తర్వాత శరీరం కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి కొన్ని రకాల పానీయాలు తీసుకుంటుంటారు. అందులో ప్రొటీన్ షేక్స్ కూడా ఉంటాయి. కానీ సాయంత్రం ఎక్సర్సైజ్ చేసిన వారు మాత్రం వీటిని తీసుకోవద్దని సూచిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే ప్రొటీన్లు జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి నిద్ర పోవడానికి కొన్ని గంటల ముందు ఇలాంటి ఆహార పదార్థాల్ని తీసుకోవడం వల్ల అవి జీర్ణమవక అజీర్తి, గ్యాస్.. వంటి ఇతర సమస్యలకు దారితీస్తాయి. అందుకే వీటిని ఉదయం వ్యాయామం అనంతరం లేదా మధ్యాహ్నం.. ఇలా పగటిపూట తీసుకోవడం మంచిదని నిపుణుల సలహా. శరీరానికి శక్తిని అందించడానికి వీటికి బదులుగా పండ్లు, పండ్ల రసాలు, స్మూతీస్, మిల్క్‌షేక్స్, నట్స్.. వంటివేవైనా తీసుకోవచ్చు.