లోకులు కాకులు... మాట్లాడే స్వేచ్ఛ ఉంది కదా అని ఎవరికి నచ్చినట్లు వాళ్లు మాట్లాడుతుంటారు. తాము ఎలా ఉన్నా సరే..ఇతరులను మాత్రం నోటికొచ్చినట్లు ఆడిపోసుకుంటుంటారు. కాస్త బొద్దుగా ఉన్న వాళ్లు కళ్లల్లో పడితే చాలు..‘అబ్బ ఎంత లావుగా ఉన్నావు...బరువు తగ్గి స్లిమ్‌గా మారొచ్చుగా’ అని ఉచిత సలహాలు కూడా ఇస్తుంటారు. ఇక సోషల్ మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు...లావుగా ఉన్న వాళ్లు సరదాకి ఏదైనా ఫొటోను షేర్ చేస్తే చాలు..కామెంట్ల రూపంలో అసభ్యకర మాటలు, దూషణలు కనిపిస్తుంటాయి. ఈ క్రమంలో బాడీ షేమింగ్ విషయంలో ఇలాంటి అనుభవాలు తనకూ బోలెడున్నాయని చెబుతోంది బాలీవుడ్ బుల్లితెర నటి సలోని దైని. ‘కామెడీ సర్కస్’ టీవీ షోలోని ‘గంగూబాయి’ పాత్రతో బాలీవుడ్ అభిమానులకు సుపరిచితమైన ఈ హాస్యనటి లాక్డౌన్ సమయంలో బరువు తగ్గడమే లక్ష్యంగా పెట్టుకున్నానంటోంది. ఈ సందర్భంగా తన ఫ్యాట్ టు ఫిట్ స్టోరీని అందరితో షేర్ చేసుకుందీ బబ్లీ గర్ల్.
అది బుల్లితెరైనా, వెండితెరైనా కొందరు నటీమణులు పోషించే పాత్రలు వారికి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టడమే కాదు...ఇటు అభిమానుల మనసుల్లోనూ ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోతాయి. అలా ‘కామెడీ సర్కస్’ షోలో నటించి ‘గంగుబాయి’గా బాలీవుడ్ అభిమానుల్లో చెరగని ముద్రవేసింది సలోని. ఏడేళ్ల వయసులోనే కెమెరా ముందుకొచ్చిన ఆమె ఛైల్డ్ ఆర్టిస్టుగా పలు మరాఠీ, హిందీ సీరియల్స్, సినిమాల్లో నటించింది. ఆ తర్వాత పలు టీవీ రియాలిటీ షోల్లో స్టాండప్ కమెడియన్‌గా ప్రేక్షకులను గిలిగింతలు పెట్టింది. ఇక ‘కామెడీ సర్కస్’ షో చూసే ప్రేక్షకులకు తాను చలాకీగా మాట్లాడే డైలాగ్స్, నిండుగా కనిపించే తన రూపమే కళ్లముందు మెదులుతాయి. అయితే లావుగా ఉన్నప్పటికీ నిండైన ఆత్మవిశ్వాసం తనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఈ విషయం గురించే చాలామంది తనను పదే పదే అడుగుతుంటారని అంటోంది సలోని. ఇక సోషల్ మీడియాలో అయితే తన శరీరాకృతిని చూసి చాలామంది నెటిజన్లు చాలా రకాలుగా కామెంట్లు చేశారంటోంది. అయితే వాళ్ల కోసం కాకుండా తన కోసం తాను ఫిట్‌గా మారాలనుకున్నానంటూ తన ఫ్యాట్ టు ఫిట్ జర్నీ వెనకున్న సీక్రెట్‌ను అందరితో షేర్ చేసుకుందీ బబ్లీ బ్యూటీ.
వారు ముఖం చూపించలేరు!
‘గతంలో నా బరువును విమర్శిస్తూ చాలా మంది నెటిజన్లు చాలా రకాలుగా కామెంట్లు చేశారు. ‘చాలా లావుగా ఉన్నావు’, ‘గేదెలా కనిపిస్తున్నావు’, ‘ ఏదో ఒక రోజు నీ కడుపు పగిలిపోయేలా ఉంది’ అని నన్ను విమర్శించారు. అయితే నేను వాటిని సీరియస్‌గా తీసుకోలేదు. పైగా మా స్నేహితులందరికీ ఆ కామెంట్లను చూపించేదాన్ని. సాధారణంగా ఇలాంటి కామెంట్లు చేసే వారు తమ ముఖాన్ని ఇతరుల ముందు చూపించడానికి సాహసించరు. ఎంతసేపు కీ బోర్డు వెనకాలే దాక్కొని ఇతరులను బాధపెడుతుంటారు. అయితే కొంతమంది నెటిజన్లు హద్దులు దాటి మరీ ప్రవర్తించారు. వారి కామెంట్లు నన్ను తీవ్రంగా బాధించాయి. అయితే ఇలాంటి విషయాల గురించి అతిగా ఆలోచించడం వల్ల ఎలాంటి ప్రయోజనముండదు. అందుకే ఆ క్షణంలో కొంచెం బాధపడినా వెంటనే తేరుకున్నాను. నా పని గురించి మాత్రమే ఆలోచిస్తూ ముందుకు సాగాను’
ల్యాప్‌టాప్ స్ర్కీన్‌లో నా ముఖం చూసుకున్నా!
‘లాక్డౌన్ ప్రారంభంలో ఎలాంటి సీరియల్స్, సినిమా షూటింగ్‌లు లేకపోవడంతో పూర్తిగా ఇంటికే పరిమితమయ్యాను. ఆ సమయంలో అమ్మ చేసి పెట్టిన మోమోలు, బటర్ చికెన్ రెసిపీలు, కేకులు తదితర జంక్ఫుడ్స్ తినడం బాగా అలవాటు చేసుకున్నాను. ఖాళీ టైంలో ఏం చేయాలో తెలియక నా ల్యాప్‌టాప్‌లో సినిమాలు, టీవీ షోలు చూస్తూ గడిపాను. ఒకరోజు ఏదో టీవీ షో చూస్తుండగా హఠాత్తుగా ల్యాప్‌టాప్ స్ర్కీన్ ఆఫ్ అయిపోయింది. యాదృచ్ఛికంగా నా ముఖాన్ని అందులో చూసుకున్నాను. ఫేస్ చాలా ఉబ్బినట్లు అనిపించింది. ముఖంలో ఎలాంటి కళ కనిపించలేదు. ఎందుకో నాకే అసహ్యమనిపించింది. అప్పుడు నేను 80 కేజీలకు పైగానే ఉండేదాన్ని. ఇలాగే ఉంటే చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయనిపించింది. ‘ఇప్పటిదాకా జరిగిందేదో జరిగిపోయింది. ఇకనైనా నేను మారాలి’ అని గట్టిగా నిర్ణయించుకున్నా.
ఫిట్‌గా, ఆరోగ్యంగా మారేందుకు హెల్దీ డైట్‌ను ఫాలో అయ్యాను. క్రమం తప్పకుండా కసరత్తులు, వర్కవుట్లు చేశాను. ఈ క్రమంలో నాకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. అయినా వెనకడుగు వేయలేదు. నా లక్ష్యమే గొప్పదనిపించింది. అలా లాక్డౌన్లో 22 కేజీల బరువు తగ్గాను. ప్రస్తుతం నా బరువు 58 కిలోలు. నా బరువు తగ్గడంలో లాక్డౌన్ కీలక పాత్ర పోషించింది. ఎందుకంటే నాకిష్టమైన జంక్‌ఫుడ్ తినడానికి బయటకు వెళ్లకుండా అదే నన్ను నియంత్రించింది’ అని తన బరువు గురించి చెప్పుకొచ్చిందీ టీనేజ్ సెన్సేషన్.
‘గంగుబాయి’తోనే నాకు గుర్తింపు! ఈ సందర్భంగా తన ఫ్యాట్ టు ఫిట్ జర్నీతో పాటు తన వృత్తిగత, వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది సలోని. ‘నేను ఏడేళ్ల వయసులోనే ఈ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. ప్రస్తుతం నా వయసు 19 ఏళ్లు. ఈ 12 ఏళ్ల కాలంలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాను. అమితాబ్ బచ్చన్, షారుఖ్‌ఖాన్, రణ్‌బీర్ కపూర్ లాంటి సెలబ్రిటీలను కలుసుకుంటానని నేను ఏనాడు అనుకోలేదు. నేను చిన్నప్పటి నుంచి కోరుకున్న జీవితం నాకు చేరువవుతోంది. ఈ ప్రయాణాన్ని నేను బాగా ఆస్వాదిస్తున్నాను. నా తల్లిదండ్రులు కూడా నాకు బాగా సహకరిస్తున్నారు. నటనను కొనసాగిస్తూనే నా ఉన్నత చదువులపై దృష్టి సారిస్తున్నాను. ఇందులో భాగంగా ప్రస్తుతం BMM (బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా) కోర్సు చేస్తున్నాను. ఇక నాకు ఇంతటి గుర్తింపు రావడానికి కారణం ‘గంగుబాయి’ క్యారక్టర్ అని కచ్చితంగా చెబుతాను. ‘కామెడీ సర్కస్’ షో కోసం పోషించిన ఆ పాత్ర నా జీవితాన్ని మలుపు తిప్పింది. అంతేకాదు నేను ఇప్పటివరకు పోషించిన పాత్రల్లో కెల్లా ఇదే నాకిష్టమైన క్యారక్టర్. ‘గంగుబాయి’ పేరుతో నా చేతిపై ఓ టాటూ కూడా ఉంటుంది. సాధారణంగా నిజజీవితంలో సలోని అంటే చాలా శాంతంగా ఉంటుంది. కానీ ఒక్కసారి గంగుబాయి పాత్రలోకి ప్రవేశించగానే ఎక్కడి లేని ఉత్సాహం నాకొస్తుంది. ‘ఏదైనా మాట్లాడగలను...ఏదైనా చేయగలను’ అన్న ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది. అందుకే చాలామంది ఆ పేరుతోనే నన్ను పిలుస్తుంటారు. అప్పుడు నాకెంతో సంతోషంగా అనిపిస్తుంది’ అని అంటోందీ బుల్లితెర బ్యూటీ.