దీపావళి అనగానే రుచికరమైన వంటకాలే గుర్తొస్తాయి.. ఇంట్లో చేసిన చక్కటి రుచికరమైన వంటకాలు, పిండివంటలు, మిఠాయిలు.. ఇవన్నీ లాగించేస్తూ బంధువులు, కుటుంబ సభ్యులతో కూర్చొని నవ్వుతూ మాట్లాడుకుంటూ గడపాలని ఎవరికి ఉండదు చెప్పండి? కానీ ప్రస్తుతం చాలామంది డైటింగ్ మోజులో పడిపోయి పండగ పూట కూడా సంప్రదాయ వంటకాలకు దూరంగా ఉంటున్నారు. ఒకవేళ తిన్నా మరుసటిరోజు డీటాక్స్ పేరుతో శరీరాన్ని మరింత ఇబ్బంది పెట్టేస్తున్నారు. అయితే ఏదైనా సరే మితంగా ఉంటే- సందేహం అక్కర్లేదంటున్నారు పోషకాహార నిపుణులు.

స్వీట్లు పూర్తిగా మానక్కర్లేదు!
మిఠాయిలంటే ఓ రకంగా మన అమ్మమ్మలు, బామ్మల కాలం నుంచి తరతరాలుగా వస్తున్న వారసత్వ సంపద. వాటిని తినడం పూర్తిగా మానేయడం వల్ల ఒక విధంగా వచ్చే తరాలకు ఆరోగ్యకరమైన, రుచికరమైన పదార్థాలను దూరం చేస్తున్నట్లేనేమో!
ఎందుకంటే- మన వారసత్వ సంపద ఎంతో గొప్పది. మన పూర్వీకులు ఏది చేసినా ఆలోచించే చేసేవారు. కాలాలను అనుసరించి ఆయా సమయాల్లో శరీరానికి శక్తినందించేలా ఆహారాన్ని తయారుచేసేవారు. దీపావళి సమయంలో తయారుచేసే కొన్ని స్వీట్లు కూడా అలాంటివే. ఇంతకాలం కాస్త వేడిగా ఉన్న వాతావరణం నుంచి చలి వాతావరణంలోకి మారుతున్నప్పుడు శరీరానికి శక్తి ఎక్కువగా అవసరం ఉంటుంది. అందుకోసమే కొన్ని రకాల స్వీట్లను తీసుకునేవారు. అయితే ఇప్పుడు మనం కప్ కేక్స్, చాక్లెట్ల మోజులో మన సంప్రదాయ మిఠాయిలను దూరం పెడుతున్నాం.
సాధారణంగా మనం ఇంట్లో చేసుకునే వివిధ సంప్రదాయ వంటకాలు, మిఠాయిల వల్ల గ్త్లెసిమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువవ్వదు. ఎందుకంటే మన స్వీట్లలో ఉపయోగించే పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, డ్రైఫ్రూట్స్ మనకు శక్తిని, ఎన్నో పోషకాలను అందిస్తే అవి రక్తంలో ఒకేసారి కలవకుండా నెయ్యి ఉపయోగపడుతుంది. అయితే స్వీట్లను కేవలం బెల్లం లేదా చక్కెరతోనే తయారుచేయాలి తప్ప ఆర్టిఫిషియల్ స్వీటనర్లను వాడడం సరికాదు.

వీటి వల్ల కూడా..
ఫ్రై చేసిన పదార్థాలకు చాలామంది దూరంగా ఉంటారు. కానీ కొద్దిగా నూనెలో వేయించినా సరే.. కొన్ని సంప్రదాయ వంటకాలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. వివిధ రకాల పప్పుధాన్యాలు, ముడిధాన్యాలు, చిరుధాన్యాలను పిండి చేసి తయారు చేసే వంటకాల వల్ల వివిధ పోషకాలు శరీరానికి అందుతాయి. పైగా ఈ నెయ్యి లేదా నూనె రక్తంలోకి గ్లూకోజ్ త్వరగా విడుదలవకుండా కాపాడుతుంది. అయితే ఒకసారి ఉపయోగించిన నూనెను తిరిగి వాడకూడదు. కావాలంటే నెయ్యి ఉపయోగించవచ్చు.
డీటాక్స్ ఇలా చేయండి..
పండగ విందు కదా అని మరీ ఆలస్యంగా ఆహారపదార్థాలు తీసుకుంటే అది కడుపులో ఇబ్బంది కలిగించకమానదు. అందుకే వీలైనంత వరకూ రాత్రి తొమ్మిదింటిలోపు డిన్నర్ పూర్తి చేయడానికి ప్రయత్నించాలి.
అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఆ తర్వాత డీటాక్స్ పేరుతో శరీరాన్ని ఇబ్బంది పెట్టడం చాలామందికి అలవాటు. నిన్న ఎక్కువగా తినేశాం కాబట్టి ఈరోజు డీటాక్స్ చేద్దాం.. లేదా పూర్తిగా ఆహారం తీసుకోవడం మానేద్దాం అనే ఆలోచన మంచిది కాదు.. ఆహారం తీసుకునేటప్పుడే ఆరోగ్యకరమైనవి ఎంచుకుంటే డీటాక్స్ అవసరం ఉండదు. సాధారణంగా సంప్రదాయ వంటకాలు తీసుకుంటే డీటాక్స్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మీరు వేరే తరహా ఆహారం తీసుకొని మీ కడుపు పాడైతే ఉదయాన్నే లేచి గుల్కంద్ (గులాబీ రేకులతో చేసే స్వీట్) ఒక స్పూన్ తీసుకొని కాసేపాగి ఓ అరటిపండు తినాలి. అలాగే మధ్యాహ్నం, రాత్రి భోజనంలో చిలగడదుంప, కంద వంటి కూరగాయలను తీసుకోవాలి. నెయ్యి వాడకాన్ని ఎక్కువ చేయాలి. వీలుంటే భోజనం తర్వాత బెల్లం, నెయ్యి కలుపుకొని తింటే చాలా మంచిది. ప్రపంచమంతా డీటాక్స్ కోసం మన సంప్రదాయ ఫార్ములా అయిన చెరుకురసాన్ని వాడుతోంది. మనం వెస్ట్రన్ మోజులో పడి దాన్ని పట్టించుకోవట్లేదు. చెరుకు రసం చక్కటి డీటాక్సిఫికేషన్ ఏజెంట్ గా పనిచేస్తుంది. అందుకే దాన్ని తాగడం మంచిది.
వెస్ట్రన్ ఆహారాన్ని దూరం చేసి సంప్రదాయ వంటకాలతో ఈ పండగను ఆనందంగా జరుపుకోండి. శరీరాన్ని ఇబ్బందిపెట్టకుండా మితంగా తీసుకుంటే మన ఆహారం ఆరోగ్యానికి చాలా మంచిది. ఏమంటారు?