నాజూగ్గా మారాలన్న ఉద్దేశంతోనో లేదంటే అసలే ఈ కరోనా సమయంలో లావెక్కి లేనిపోని అనారోగ్యాలు కొని తెచ్చుకోవడం ఇష్టం లేకో.. ఇలా కారణమేదైనా బరువు తగ్గడమే లక్ష్యంగా పెట్టుకున్నారు చాలామంది. ఈ క్రమంలోనే చేసే వ్యాయామాలతో సంబంధం లేకుండా తీసుకునే ఆహారంలో పలు మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు. మరి, మీరూ ఇదే జాబితాలో ఉన్నారా? అయితే ‘బుల్లెట్‌ప్రూఫ్ కాఫీ’ అందుకు చక్కటి మార్గం అని చెబుతోంది బాలీవుడ్ అందాల భామ భూమి పెడ్నేకర్.
సినిమాలపై ఉన్న ఆసక్తితో ఒకప్పుడు బొద్దుగుమ్మగా ఉన్న తాను ముద్దుగుమ్మగా మారి తనను తాను నిరూపించుకుంటోన్న ఈ బబ్లీ గర్ల్.. తన అభిమానుల కోసం తాను పాటించే ఫిట్నెస్ సీక్రెట్స్‌ని కూడా అప్పుడప్పుడూ బయటపెడుతుంటుంది. ఈ క్రమంలోనే తాను ఉదయాన్నే తీసుకునే ఈ కాఫీ రెసిపీ వీడియోను పంచుకుంటూ ఇదే తన వెయిట్‌లాస్ సీక్రెట్ అని చెప్పకనే చెప్పిందీ చక్కనమ్మ. మరి, ఈ కాఫీ ఎలా తయారుచేసుకోవాలి? బరువు తగ్గడంతో పాటు దీని వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయి? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!
మనకు నచ్చిన పని చేయాలన్న తపన ఉండాలే కానీ అందుకోసం మనం ఎంతగానైనా మారచ్చు అనడానికి భూమి ప్రత్యక్ష ఉదాహరణ. తొలి సినిమా ‘దమ్ లగా కే హైసా’ సినిమాలో ఎంతో బబ్లీగా కనిపించిన ఈ క్యూటీ.. ఆ తర్వాత సినిమాల్లో పాత్రలకు అనుగుణంగా బరువు తగ్గి నాజూగ్గా మారిపోయింది. ఇక గత ఏడు నెలలుగా ఇంటికే పరిమితమైన ఈ బాలీవుడ్ బేబ్.. ఫిట్‌నెస్‌పై మరింత శ్రద్ధ పెట్టింది. ఈ క్రమంలో ఇంట్లోనే కసరత్తులు చేయడం, ఆహారంలో పలు మార్పులు చేసుకోవడం అలవాటు చేసుకుంది. అంతేకాదు.. తన ఫిట్నెస్ సీక్రెట్స్‌ని కూడా వీలు చిక్కినప్పుడల్లా అందరితో పంచుకుంటుంటుందీ అందాల తార.
నా మార్నింగ్ సీక్రెట్ ఇదే!
పర్యావరణంపై ఉన్న ప్రేమతో తనకిష్టమైన మాంసాహారాన్నీ త్యజించడానికి వెనకాడలేదు భూమి. ఈ క్రమంలోనే తాను పూర్తి శాకాహారిగా మారిపోయానంటూ ఇటీవలే పోస్ట్ పెట్టిన ఈ చిన్నది.. తాజాగా తన ఫిట్నెస్ వెనకున్న మరో సీక్రెట్‌ని బయటపెట్టింది. బుల్లెట్‌ప్రూఫ్ కాఫీ (కాఫీలో నెయ్యి, కొబ్బరి నూనె కలిపి దీన్ని తయారుచేస్తారు) తయారుచేసుకొని తాగుతోన్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఈ బాలీవుడ్ అందం.. ‘నెయ్యి+కాఫీ = హ్యాపీ మార్నింగ్’ అన్న క్యాప్షన్ రాసుకొచ్చింది. అంటే.. ఉదయాన్నే ఈ బుల్లెట్‌ప్రూఫ్ కాఫీ తాగుతూ తన ఫిట్నెస్ను కాపాడుకుంటున్నానంటూ చెప్పకనే చెప్పిందీ అందాల తార.

ఎలా తయారుచేసుకోవాలి?
కావాల్సినవి
*బ్లాక్ కాఫీ లేదా కాఫీ డికాక్షన్ - కప్పు
*నెయ్యి - టేబుల్‌స్పూన్
*కొబ్బరి నూనె - టేబుల్‌స్పూన్
*తేనె - తియ్యదనం కోసం
తయారీ
ఈ పదార్థాలన్నింటినీ బ్లెండర్లో వేసి కాస్త నురుగొచ్చే వరకు మిక్సీ పట్టాలి. లేదంటే ఎలక్ట్రిక్ బ్లెండర్ సహాయంతో 30 సెకన్ల పాటు బ్లెండ్ చేసినా సరిపోతుంది. ఇలా తయారైన కాఫీని గాజు గ్లాస్లో లేదంటే కప్‌లో ఎలాగైనా సర్వ్ చేసుకోవచ్చు.
బరువు తగ్గడానికి.. ఇంకా ఇంకా..!
*బుల్లెట్‌ప్రూఫ్ కాఫీ లేదా బటర్ కాఫీగా పిలిచే ఈ కాఫీ కీటో ఆహార పద్ధతిని ఫాలో అయ్యే వారికి చక్కటి ఎంపిక అంటున్నారు నిపుణులు. అంతేకాదు.. ఎవరైనా సరే దీన్ని పరగడుపున తీసుకోవడం వల్ల బరువు తగ్గడంలో మరింత ప్రభావవంతంగా పని చేస్తుందంటున్నారు. నెయ్యిలోని లినోలిక్ ఆమ్లం జీర్ణక్రియలను వేగవంతం చేసి.. తద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుందట!
*పరగడుపునే ఈ కాఫీ తాగడం వల్ల శరీరానికి శక్తి కూడా అందుతుందట! ఫలితంగా రోజంతా యాక్టివ్‌గా ఉండచ్చు. వ్యాయామం కూడా చురుగ్గా చేయచ్చు.
*ఇక నెయ్యిలోని మంచి కొవ్వులు మెదడు ఆరోగ్యానికి, నరాలను ఉత్తేజపరచడానికి దోహదం చేస్తాయి.
*ఈ కాఫీ తాగడం వల్ల శరీరంలో హార్మోన్లు సమతులంగా ఉత్పత్తయి మూడ్ స్వింగ్స్‌ని దూరం చేస్తాయంటున్నారు నిపుణులు.
*బుల్లెట్‌ప్రూఫ్ కాఫీ తాగడం వల్ల కడుపు నిండుగా ఉండి ఎక్కువ సేపు ఆకలేయకుండా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గడానికి ఇదీ ఓ మార్గమే!

ఇలాంటి వాళ్లు తీసుకోవద్దు!
*కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు తక్కువ మొత్తాల్లో తీసుకునే వాళ్లు; పాలియో, మెడిటేరియన్ డైట్ ట్రెండ్స్‌ని ఫాలో అయ్యే వారు ఈ కాఫీకి దూరంగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు.
*అలాగే మీకున్న ఆరోగ్య సమస్యను బట్టి ఎక్కువ కొవ్వులున్న ఆహారం తీసుకోకూడదని డాక్టర్లు సూచించినట్లయితే అలాంటి వారు కూడా ఈ కాఫీకి దూరంగా ఉండాలట!
*ఇక బీఎంఐ 30 కంటే ఎక్కువ ఉన్న వాళ్లను స్థూలకాయులుగా పరిగణిస్తారు. కాబట్టి వీళ్లు ఈ కాఫీ తాగకూడదని నిపుణులు చెబుతున్నారు.
సో.. ఇదండీ బుల్లెట్‌ప్రూఫ్ కాఫీ కథ! అయితే దీని గురించి మీకేమైనా సందేహాలున్నా, ఇది తాగడం మొదలెట్టాక మీ ఆరోగ్యం విషయంలో ఏదైనా తేడాను గుర్తించినా నిపుణుల సలహా, సహాయం తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు..!