చాలామంది ఉదయాన్నే నిద్ర లేవడానికి బద్ధకిస్తుంటారు. 'కాసేపాగి లేద్దాంలే' అని లేవాల్సిన సమయం కన్నా ఆలస్యంగా నిద్ర లేస్తారు. ఇక అంతే సంగతులు. ఆ రోజంతా మీకు బద్ధకం ఆవహిస్తుంది. అది మీ చురుకుదనాన్ని, ఉత్సాహాన్ని తగ్గించి, మిమ్మల్ని ఏ పనీ చేయనివ్వదు. పైగా అతిగా నిద్రపోవడం వల్ల మీకు మరింత నిద్ర ఆవహించే ఆస్కారం కూడా ఉంది. అందుకే బద్ధకాన్ని తరిమి కొట్టి కనీసం ఒక్క రోజైనా ఉదయాన్నే నిద్ర లేచి చూడండి. మీకే తెలుస్తుంది ఆరోజంతా ఎంత ఉల్లాసంగా ఉంటుందో.

ఎక్కడివక్కడే..
రాత్రి మీరెప్పుడు పడుకున్నారనేది ముఖ్యం కాదు.. ఉదయాన్నే నిద్ర లేచారా.. లేదా.. అనేదే ముఖ్యం. ఇంట, బయట, ఆఫీసులో ఎన్నో రకాల ఒత్తిళ్లు ఉండచ్చు. అయితే కొంతమంది రాత్రి పడుకునే ముందు కూడా వాటి గురించే ఆలోచిస్తుంటారు. ఉదయం లేచేటప్పుడు కూడా వాటి గురించే ధ్యాస. ఇవన్నీ ఎక్కడివక్కడే మరచిపోవడం మంచిది. అప్పుడే రాత్రిళ్లు బాగా నిద్ర పడుతుంది. ఉదయం ఫ్రెష్‌గా ఉండగలుగుతారు. లేకపోతే దాని ప్రభావం ఆరోగ్యంపై పడుతుంది. అలాగే పడుకునేటప్పుడు బెడ్రూమ్ చాలా ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. టీవీ, సెల్ఫోన్లకు దూరంగా ఉండండి.
ఉల్లాసంగా.. ఉత్సాహంగా..
ఉదయం లేచిన తర్వాత మీకు నచ్చిన వార్తాపత్రిక లేదా బ్లాగ్ కాలమ్‌ని చదవడానికి కొంత సమయాన్ని వెచ్చించండి. దీంతోపాటు కొద్దినిమిషాలు వార్తలు చూడండి. మీరు రోజూ చేసే వ్యాయామాలు లేదా మెడిటేషన్‌కు మరికొంత సమయం కేటాయించండి. ఇవన్నీ చేసిన తర్వాత కూడా మరో కప్పు కాఫీ తాగడానికి మీకింకా సమయం మిగిలితే.. ఉదయం లేవడం వల్ల మీరెంత చురుగ్గా, ఉల్లాసంగా ఉన్నారో మీకే అర్థమవుతుంది. ఉదయం లేచినప్పటి నుంచి ఈ పనులన్నీ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో నోట్ చేసుకోండి.

వ్యాయామం చేస్తున్నారా?
ఉదయం లేవగానే వ్యాయామం చేస్తే మీలో శక్తి, ఉత్సాహం రెట్టింపవుతాయి. వ్యాయామం చేసిన కొద్ది గంటల తర్వాత శరీర ఉష్ణోగ్రత, అడ్రినలిన్ లెవల్స్ పెరుగుతాయి. ఫలితంగా రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాయామం మానద్దు.
బ్రేక్‌ఫాస్ట్ మానద్దు..
రాత్రి పడుకున్నప్పుడు.. మన శరీరంలోని మెటబాలిజం, చక్కెర స్థాయులు తక్కువగా ఉంటాయి. కాబట్టి వాటిని పునరుత్తేజితం చేయడానికి బ్రేక్‌ఫాస్ట్ చాలా అవసరం. రోజంతా ఎదురయ్యే వివిధ ఒత్తిళ్లను భరించడానికి, ఆలోచనలు ఆరోగ్యంగా ఉండటానికి కప్పు కాఫీతో పాటు బ్రేక్‌ఫాస్ట్ కూడా తీసుకోవడం మరచిపోవద్దు.
ఎక్కువ వెలుతురు వచ్చేలా..
సూర్యకాంతి వల్ల వచ్చే వెలుతురు ఇంట్లోకి ఎక్కువగా ప్రవేశించేలా చూసుకోవాలి. దీనివల్ల ఉదయం త్వరగా నిద్ర లేవొచ్చు. అదెలాగంటే.. మన మెదడు ఎక్కువ కాంతిని, ఉష్ణోగ్రతను తట్టుకోలేదు. కాబట్టి ఎక్కువ వెలుతురు ముఖంపై పడితే త్వరగా మెలకువ వస్తుంది. దీంతో మరీ ఆలస్యంగా కాకుండా.. సరైన సమయానికే నిద్ర లేవచ్చు. కాబట్టి బెడ్రూమ్లో ధారాళంగా వెలుతురు వచ్చేలా ఉంటే మీరు బారెడు పొద్దెక్కేదాకా పడుకోమన్నా పడుకోరు.