శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలని వ్యాయామం, ధ్యానం, యోగా.. వంటివి చేస్తుంటాం. అలాగే ఆరోగ్యంగా ఉండడానికి మంచి పోషకాహారం తీసుకుంటాం. మరి ఈ రెండూ ఒకేసారి సొంతం కావాలంటే.. ఏం చేయాలో మీకు తెలుసా?? చాలా సింపుల్.. పంచింగ్ బ్యాగ్ వ్యాయామం చేస్తే సరి. అవునండీ! ఈ వ్యాయామం కేవలం బాక్సర్స్కు మాత్రమే ఉపయోగపడుతుందని చాలామంది అపోహపడతారు. కానీ దీనివల్ల శారీరకంగా బలంగా తయారవడంతో పాటు మానసిక ప్రశాంతతను కూడా పొందచ్చు. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. మరి ఈ వ్యాయామం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందామా..!
అభ్యాసం ముఖ్యం..
ఏ వ్యాయామానికైనా ముందు ప్రాక్టీస్ చేయడం తప్పనిసరి. ఎందుకంటే దీనివల్ల వ్యాయామం బాగా చేయడానికి శరీరం అందుకు వీలుగా మారుతుంది. అలాగే పంచింగ్ బ్యాగ్ వ్యాయామానికి కూడా ముందస్తు అభ్యాసం చేయాల్సిందే. నేరుగా బ్యాగ్‌తో ప్రాక్టీస్ చేస్తే అది బరువుగా ఉంటుంది కాబట్టి అప్పటి వరకు అలవాటు లేకపోవడంతో చేతులు నొప్పి వస్తాయి. అందుకే ఈ వ్యాయామం చేసే ముందు షాడో బాక్సింగ్, కవాతు.. లాంటివి ప్రాక్టీస్ చేయడం వల్ల చేతులు పంచ్ కొట్టడానికి, కాళ్లు ఎగరడానికి సులభంగా ఉంటాయి. అలాగే ప్రాక్టీస్ ఉన్నా సరే.. నేరుగా పంచింగ్ బ్యాగ్స్‌తో కాకుండా అలవాటు పడే వరకు మృదువైన బ్యాగ్స్ కట్టుకుని దాంతో పంచింగ్ వ్యాయామం చేయాలి. నేరుగా పంచింగ్ బ్యాగ్స్‌ని ఉపయోగించడం మణికట్టుకు అంత మంచిది కాదు.

జీవక్రియల పనితీరు మెరుగు..
కొంతమంది బలహీనంగా ఉండడంతో శరీరం అదుపు తప్పి కొన్ని సందర్భాల్లో తూలుతూ నడుస్తుంటారు. ఒక్కోసారైతే కింద పడిపోతుంటారు. మరి ఈ సమస్య నుంచి బయటపడడానికి పంచింగ్ బ్యాగ్ వ్యాయామం కూడా ఒక మార్గం. దీనిలో భాగంగా బ్యాగ్ చుట్టూ తిరుగుతూ, ఎగురుతూ రెండు చేతులతోనూ పంచ్ కొడుతుంటారు. దీంతో శరీరంలోని అన్ని అవయవాలకు చక్కని వ్యాయామం అంది, వాటి పనితీరు మెరుగుపడుతుంది. అలాగే శారీరక దృఢత్వం కూడా లభిస్తుంది.
కండరాల దృఢత్వానికి..
ఈ వ్యాయామం వల్ల కండరాలు దృఢంగా తయారవుతాయి. అలాగే ఈ వ్యాయామం వల్ల దెబ్బ తగిలినప్పుడు తట్టుకునే శక్తి శరీరానికి చేకూరుతుంది. ఇందులో ఉపయోగించే బ్యాండ్స్, పంచింగ్, కికింగ్.. మొదలైన వాటి వల్ల కండరాలు బలపడి దెబ్బను తట్టుకునేలా తయారవుతాయి. కాబట్టి ఈ వ్యాయామం శరీరానికి చాలా మంచిది.

ఒత్తిడి చిత్తు..
ఈ వ్యాయామం వల్ల శారీరకంగానే కాదు.. మానసికంగా కూడా దృఢంగా తయారు కావచ్చు. అదెలాగంటే ఈ వ్యాయామం చేసేటప్పుడు.. శరీరంలో ఎండార్ఫిన్లు (సహజసిద్ధ రసాయనాలు) విడుదలవుతాయి. ఇవి ఒత్తిడి నుంచి మనల్ని కాపాడడంలో సహాయపడతాయి. కాబట్టి మానసిక ఆరోగ్యానికి కూడా ఈ వ్యాయామం చాలా ఉపయోగకరం.
బరువూ తగ్గచ్చు..
పంచింగ్ బ్యాగ్ వ్యాయామం వల్ల శరీరంలో పేరుకుపోయిన అదనపు క్యాలరీలు, కొవ్వులు సులభంగా కరిగిపోతాయి. దీంతో క్రమంగా బరువు తగ్గి నాజూగ్గా తయారయ్యే అవకాశం ఉంటుంది. బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్న వాళ్లు వాళ్ల బరువును బట్టి ఈ వ్యాయామానికి ఎంత సమయం కేటాయించాలో నిర్ణయించుకోవాలి. రోజుకు అరగంట పాటు ఈ వ్యాయామం చేయడం వల్ల శరీరంలో దాదాపు 400 క్యాలరీల వరకు కరిగించుకోవచ్చని ఓ అధ్యయనంలో వెల్లడైంది.

గుండె ఆరోగ్యానికి..
పంచింగ్ బ్యాగ్ వ్యాయామం వల్ల శరీరంలో రక్త ప్రసరణ బాగా జరిగి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఒకవైపు చేత్తో పంచింగ్ ఇవ్వడంతో పాటు కాళ్లతో ముందుకూ వెనక్కూ ఎగురుతూ ఉంటాం.. కాబట్టి కాళ్లకు కూడా చక్కని వ్యాయామం అందుతుంది. వాకింగ్ చేసినంత ఫలితం ఉంటుంది. అయితే.. ఇలా చేయడం వల్ల మొదట్లో కాళ్లు నొప్పి వచ్చినట్లుగా అనిపిస్తుంది. అలాగని ఆపేయకూడదు.. రోజూ ప్రాక్టీస్‌ను నెమ్మదిగా పెంచడం వల్ల కొన్ని రోజులకు అలవాటైపోతుంది. క్రమంగా కాళ్ల నొప్పులు కూడా తగ్గి మరింత ఎంజాయ్ చేస్తూ ఈ వ్యాయామం చేయచ్చు.
దృష్టిలో ఉంచుకోండి..
ఈ వ్యాయామం చేసే క్రమంలో కొన్ని విషయాల్ని దృష్టిలో ఉంచుకోవడం తప్పనిసరి. అవేంటంటే.. చేతులకు బ్యాండ్లు, గ్లౌజులు, హ్యాండ్ రాప్స్.. వంటివి ధరించడం తప్పనిసరి. ఇవి బరువుగా ఉండే బ్యాగ్ వల్ల తగిలే దెబ్బ నుంచి చేతుల్ని రక్షిస్తాయి. లేదంటే పంచ్ చేసినప్పుడు ఆ ప్రభావం మణికట్టు నరాలపై పడే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. అలాగే చేసేటప్పుడు వార్మప్, కూల్‌డౌన్ ప్రక్రియల్ని పాటిస్తూ.. ముందు నెమ్మదిగా చేస్తూ అలవాటవుతున్న కొద్దీ వేగం పెంచుతూ పోవడం మంచిది.