జీవితంలోని ఒత్తిళ్ల నుంచి మనసును దూరం చేసి, మన ఇంద్రియాలను ప్రశాంత పరచుకోవాలన్నా.. ఆలోచనాశక్తిని పెంపొందించుకోవాలన్నా.. చేసే పనిపై ఏకాగ్రత, శ్రద్ధ పెంచుకోవాలన్నా.. సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలన్నా.. అన్నింటికీ ఒకే మందు.. అదే 'ధ్యానం'. అయితే ఈ ప్రక్రియను సరైన పద్ధతిలో అవలంబిస్తేనే పూర్తి ఫలితం దక్కుతుంది. కొంతమంది ధ్యానం చేసే క్రమంలో చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. ఫలితంగా వారు చేరుకోవాల్సిన లక్ష్యాలను అనుకున్న సమయంలో చేరుకోలేకపోవచ్చు. తద్వారా వారు పడిన శ్రమ, సమయం.. రెండూ వృథానే అవుతాయి. కాబట్టి ఆ పొరపాట్లేంటో ముందుగానే తెలుసుకుని సరిదిద్దుకుంటే మంచి ఫలితాలు పొందచ్చు.
నిశ్శబ్దంగా ఉండాలి..
సాధారణంగా వ్యాయామం చేసేటప్పుడు బోర్ కొట్టకుండా ఉండడానికి కొంతమంది సంగీతం వినడం, టీవీ చూడడం.. వంటివి చేస్తుంటారు. ధ్యానం చేసేటప్పుడు కూడా వీటిని తక్కువ సౌండ్‌తో పెట్టుకునే వారు కూడా కొందరుంటారు. ఇలాంటి వాతావరణంలో ధ్యానం చేయడం వల్ల దానిపై పూర్తి శ్రద్ధ పెట్టలేకపోవచ్చు. కాబట్టి ధ్యానం చేసే ప్రదేశం ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత మంచిది. కావాలంటే మంద్రస్థాయిలో వినిపించే ఇన్స్ట్రుమెంటల్ సంగీతాన్ని పెట్టుకోవచ్చు. అలాగే ధ్యానం కోసం మరీ చల్లగా లేదా వేడిగా ఉన్న ప్రదేశాన్ని కూడా ఎంచుకోకపోవడం మంచిది.

వెనువెంటనే వద్దు..
ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి నుంచి విముక్తి పొంది మానసిక ప్రశాంతత సొంతమవుతుందన్నది నిజమే. కానీ మీరు విపరీతమైన ఒత్తిడితో సతమతమైపోతున్నప్పుడు దీన్ని చేయడం వృథానే అవుతుంది. ఒత్తిడితోనే వెళ్లి ధ్యానంలో కూర్చోవడం వల్ల మీరు దానిని ఏకాగ్రతతో చేయలేకపోవచ్చు. కాబట్టి ముందుగా మీరు ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని కాసేపు రిలాక్స్ అవ్వండి. అవసరమైతే ఓ కునుకు కూడా తీయచ్చు. తద్వారా మీకు తలనొప్పి కూడా తగ్గుతుంది. ఇప్పుడు మనసు కాస్త కుదుట పడుతుంది కాబట్టి వెళ్లి ధ్యానం చేసినా మనసును దానిపై మరింతగా లగ్నం చేయగలుగుతారు. తద్వారా మంచి ఫలితం కూడా దక్కుతుంది. అలాగే శరీరానికి అసౌకర్యంగా అనిపిస్తున్నప్పుడు కూడా ధ్యానం చేయకపోవడం మంచిది.
బ్రేక్ తీసుకోండి..
వ్యాయామానికి ఎలాగైతే నిర్ణీత సమయాన్ని కేటాయిస్తామో.. అలాగే ధ్యానం చేయడానికి కూడా ఓ కచ్చితమైన సమయాన్ని నిర్ణయించుకోవడం మంచిది. ఎందుకంటే గంటల తరబడి ధ్యానం చేసినా కొన్ని రోజులకి బోర్ కొట్టే అవకాశం ఉంటుంది. అదీ కాక ఎక్కువ సేపు చేయాలనుకోవడం వల్ల చేసినంత సేపూ శ్రద్ధగా చేయలేం కాబట్టి పూర్తి ఫలితం దక్కదు. కాబట్టి రోజూ ఓ అరగంటో, గంటో ధ్యానం చేయడానికి కేటాయించడం ఉత్తమం. ఒకవేళ మీరు శ్రద్ధగా ఎక్కువ సేపు చేయాలనుకున్నా మధ్యమధ్యలో పది పదిహేను నిమిషాల పాటు విరామం తీసుకోవడం ఉత్తమం. తద్వారా దానిపై మరింతగా మనసు లగ్నం చేయచ్చు.

భోంచేసి చేస్తున్నారా??
కడుపునిండా ఆహారం తీసుకున్న తర్వాత సాధారణంగా నిద్రొస్తూ ఉంటుంది. ఈ సమయంలో ధ్యానం చేయడానికి మనసు, శరీరం.. రెండూ సహకరించవు. పైగా ఈ సమయంలో ధ్యానంపై కూర్చుంటే అలాగే నెమ్మదిగా నిద్రలోకి జారుకునే అవకాశం ఉంటుంది. తద్వారా ధ్యానం చేసినా ఫలితం ఉండదు. కాబట్టి ఇలా ఆహారం తీసుకున్న వెంటనే లేదా బాగా నిద్రొచ్చేటప్పుడు.. ధ్యానం చేయకూడదు. కావాలంటే ధ్యానం చేసిన తర్వాత తినడం, లేదా కాసేపు పడుకొని లేచిన తర్వాత ధ్యానం చేయడం.. వంటివి చేసినా ఫలితం ఉంటుంది.
ఇవన్నీ..
* ధ్యానం చేయడానికి సంబంధిత నిపుణులను అడిగి తగిన సలహాలు, సూచనలు తెలుసుకోవడం మంచిదే. కానీ ఇందుకోసం చాలామందిని సంప్రదించడం, దీంతో పాటు సీడీలు, డీవీడీలను ఆశ్రయించడం.. ఇలా ఎక్కువ మార్గాలను అనుసరిస్తే ఎవరు చెప్పింది పాటించాలో అర్థం కాక దానిపై ఉండే ఆసక్తి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా చేయకపోవడం మంచిది.
* ధ్యానం చేస్తున్న తొలి క్షణంలోనే మనసు పూర్తిగా లగ్నం కాకపోవచ్చు. అంతమాత్రానికే మీపై మీరే కోపగించుకోవడం, తిట్టుకోవడం.. చేయకూడదు. తద్వారా దానిపై ఆసక్తి మరింతగా తగ్గుతుంది. కాబట్టి ముందు నెమ్మదిగా దాని మీద మీ మనసు నిలపడానికి ప్రయత్నం ప్రారంభిస్తే క్రమక్రమంగా రెండు మూడు రోజులకైనా అదే అలవాటవుతుంది.
* ఎవరి ఒత్తిడితోనో ధ్యానం చేయకండి. తద్వారా ఎలాంటి లాభమూ ఉండదు. ముందు మీకు దానిపై ఆసక్తి ఉందో లేదో నిర్ణయించుకుని ఆ తర్వాత ధ్యానం చేయడం ప్రారంభిస్తే మంచిది.
* ఓవైపు ధ్యానం చేస్తూ మరోవైపు పక్కవాళ్లతో మాట్లాడడం, వారిని ఆటంకపరచడం మంచిది కాదు. మీరు అంతగా మాట్లాడాలనుకుంటే ధ్యానం పూర్తయిన తర్వాత లేదంటే విరామ సమయాల్లో ఇతరులతో మాట్లాడడం ఉత్తమం.
చూశారుగా.. ధ్యానం చేసే క్రమంలో దొర్లే సాధారణమైన పొరపాట్లేంటో! మరి ధ్యానం చేస్తున్నప్పుడు మీ వైపు నుంచి ఇలాంటి పొరపాట్లేమైనా జరిగితే ఇక నుంచైనా వాటిని సరిదిద్దుకోవడం మంచిది. తద్వారా మంచి ఫలితాల్ని పొందచ్చు.