Photos: Facebook
గర్భం ధరించిన సమయంలో బరువు పెరగడం సహజమే అనుకుంటాం.. ఇక పిల్లలు పుట్టాక వారి ఆలనా పాలనలో పడిపోయి మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటాం.. అటు ఉద్యోగం-ఇటు ఇంటి పనుల్ని బ్యాలన్స్ చేసుకోలేక ఫిట్నెస్ పైనా దృష్టి పెట్టలేం.. ఇలాంటి అనుభవాలు ప్రతి మహిళకూ పరిచయమే! అయితే మనం ఏ దశలో ఉన్నా.. ఎన్ని పనులతో బిజీగా ఉన్నా ఆరోగ్యమే మనకు తొలి ప్రాధాన్యం అంటున్నారు ఐఏఎస్ అధికారిణి సోనల్ గోయెల్. దాదాపు పదేళ్లకు పైగా వివిధ హోదాల్లో విధులు నిర్వర్తిస్తోన్న ఆమె.. ఇద్దరు పిల్లల బాధ్యతను, ఇంటిని సమర్థంగా బ్యాలన్స్ చేస్తున్నారు. మీకు ఇదెలా సాధ్యమవుతుందని అడిగితే.. తాను ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండడం వల్లేనంటూ సమాధానమిస్తున్నారామె. అంతేకాదు.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన వర్కవుట్ ఫొటోలను సైతం పోస్ట్ చేస్తుంటారీ కలెక్టరమ్మ. ఈ క్రమంలోనే తాను ప్రసవానంతరం బరువు తగ్గి తిరిగి ఫిట్‌గా ఎలా మారారో వివరిస్తూ ఇటీవలే ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారామె. ఆరోగ్యంగా ఉంటేనే అన్ని పనుల్ని సమర్థంగా నిర్వర్తించుకోవచ్చనే సందేశాన్ని చాటుతోన్న ఈ పోస్ట్ సారాంశమేంటో ఆమె మాటల్లోనే మీకోసం..
‘ఇంటి పనులు, ఆఫీస్ విధులు.. ఇలా రోజూ చాలామంది వర్కవుట్‌పై దృష్టి పెట్టకపోవడానికి బోలెడన్ని సాకులు చెబుతుంటారు. నిజానికి ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలన్న ఆలోచన ఉంటే వీటిని మనం లెక్కే చేయం. నేనైతే ఎంత బిజీగా ఉన్నప్పటికీ వర్కవుట్ గురించే ఆలోచిస్తుంటా. ఎందుకంటే రోజూ వ్యాయామం చేయడం వల్లే నా శరీరం ఇంత ఆరోగ్యంగా ఉంటుంది.. రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతున్నా.
ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్నీ సాధ్యం!
‘దేహమే దేవాలయం’ అన్నారు పెద్దలు. ఈ మాటను నేను బాగా నమ్ముతాను. నిజమే కదా మరి.. మన శరీరాన్ని మనం ఎంతగా ప్రేమిస్తామో, దాని పూర్తి బాధ్యతను స్వీకరించి జాగ్రత్తపడతామో.. మనం అంత ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండగలుగుతాం. ఈ క్రమంలోనే నా జీవితంలోని కొన్ని అనుభవాలను పంచుకోవాలని ఇప్పుడు ఇలా మీ ముందుకొచ్చాను. మనం రోజులో ఎన్నో పనులు చేస్తుంటాం.. మరెన్నో బాధ్యతల్ని నిర్వర్తిస్తాం. మనం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడే అవన్నీ సాధ్యమవుతాయి. గర్భం ధరించిన సమయంలో బరువు పెరగడం సహజమే కదా అని చాలామంది దాన్ని పెద్దగా పట్టించుకోరు.. కానీ ఆ సమయంలోనూ ఫిట్‌గా ఉండడం ముఖ్యం.
ఆ వ్యాయామాలు ప్రోత్సహించాయి!
ఇప్పుడు మీకు చెబుతున్నాను కానీ.. నేనూ ప్రెగ్నెన్సీ సమయంలో అలాగే అనుకున్నా. 2009లో పెళ్లయ్యాక క్రమంగా బరువు పెరిగాను. 2013లో తొలి కాన్పు అయ్యే సమయానికి నా బరువు గరిష్టానికి చేరుకుంది. అయితే ఆ సమయంలో అందరూ ‘తల్లయ్యాక బరువు పెరగడం సహజమే’ అని చెబుతుంటారు. నా విషయంలోనూ ఇలాగే జరిగినప్పటికీ నేను మాత్రం చిన్న పాటి వ్యాయామాలపై దృష్టి పెట్టేదాన్ని. కానీ 2018 ప్రారంభంలో జజ్జర్లో విధుల్లో చేరాక ఏరోబిక్స్, జుంబా, యోగాతో పాటు మరికొన్ని వ్యాయామాలు ఇంట్లోనే సాధన చేసేదాన్ని. అవి నాకు ప్రోత్సాహకర ఫలితాలు అందించడంతో ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి సారించా.
వర్క్-లైఫ్ బ్యాలన్స్ ముఖ్యం!
అలా కొన్ని నెలల్లోనే దాదాపు 15 కిలోల బరువు తగ్గి.. నేనుండాల్సిన బరువుకు చేరుకున్నా. ఇలా రోజూ నేను చేసే వ్యాయామాలు నాలో సరికొత్త ఉత్సాహాన్ని నింపేవి. రోజంతా ఎంతో ఎనర్జిటిక్‌గా అనిపించేది. అయితే అదే ఏడాది నేను రెండోసారి గర్భం ధరించాను. ఇక ఈసారి ప్రెగ్నెన్సీ సమయంలోనూ డాక్టర్ సలహా మేరకు యోగా, చిన్న చిన్న వ్యాయామాలు చేశాను. డెలివరీ తర్వాత కూడా ఎనిమిది నెలల్లో మళ్లీ సాధారణ బరువుకు చేరుకున్నా. అయితే అది చెప్పినంత ఈజీ కాదు. ఇటు ఇల్లు-పిల్లలు, అటు ఆఫీస్‌ని బ్యాలన్స్ చేసుకుంటూ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలంటే ఎంతో నిబద్ధత కావాలి.. ఓపిక ఉండాలి. ఇప్పుడు నేను అన్నీ మేనేజ్ చేసుకోగలుగుతున్నాను.. సంతోషంగా నా వర్కవుట్ పైనా శ్రద్ధ పెట్టగలుగుతున్నాను. మన జీవితంలో ఏదైనా మనకోసం ఎదురు చూస్తుందేమో కానీ ఆరోగ్యం, ఫిట్నెస్ మాత్రం ఎదురుచూడవు.. వాటి విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే! ఇకపైనా ఈ అంకితభావాన్ని ఇలాగే కొనసాగిస్తాననుకుంటున్నా.. మీరు కూడా మీ ఆరోగ్యంపై పూర్తి దృష్టి పెట్టండి..’ అంటూ తన వెయిట్ లాస్ జర్నీని పంచుకున్నారీ ఐఏఎస్ అధికారిణి. ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం అన్ని పనుల్ని సమన్వయం చేయగలుగుతాం.. సమర్ధంగా పూర్తి చేయగలుగుతాం.. అంటూ ఆమె పెట్టిన పోస్ట్ మహిళల్లో ఆలోచనను రేకెత్తిస్తోంది.
10 ఏళ్లలో ఎన్నెన్నో బాధ్యతలు!
సోనల్ గోయెల్.. హరియాణాలోని గుర్గావ్కు చెందిన ఆమె 2008 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి. దిల్లీలో చదువు పూర్తి చేసి, ఆలిండియా సివిల్స్ పరీక్షల్లో 13వ ర్యాంక్ సాధించిన సోనల్.. త్రిపుర క్యాడర్లో తొలి పోస్టింగ్ అందుకున్నారు. ఆపై అక్కడే వివిధ హోదాల్లో పనిచేసిన ఆమె.. 2016లో తన సొంత రాష్ట్రానికి బదిలీ అయ్యారు. ఇక్కడ ఫరీదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా, జజ్జర్ జిల్లా డిప్యూటీ కమిషనర్‌గా విధుల్లో కొనసాగారు. ప్రస్తుతం ఫరీదాబాద్‌లోని ‘హరియాణా షెహ్రి వికాస్ ప్రధికరణ్ (హెచ్‌ఎస్‌వీపీ)’ అడ్మినిస్ట్రేటర్‌గా, ‘ఫరీదాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్ఎండీఏ)’ అడిషినల్ సీఈవోగా విధులు నిర్వర్తిస్తున్నారు సోనల్.
|
మహిళా సాధికారతే ధ్యేయంగా!
సివిల్ సర్వీసెస్‌లో 10 ఏళ్ల అనుభవం ఉన్న ఆమె.. మహిళా సాధికారత దిశగా ఎంతో కృషి చేశారు. ఈ క్రమంలోనే త్రిపురలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో మహిళల కోసం ప్రత్యేకంగా పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయించారు. అలాగే గృహ హింసను ఎదుర్కొంటున్న మహిళలకు అండగా నిలిచేందుకు హెల్ప్‌లైన్‌ను ప్రారంభించారు. అంతేకాదు.. స్త్రీల కోసమే ప్రత్యేకంగా 70 వృత్తి విద్యా శిక్షణ కేంద్రాలు నెలకొల్పారు. ఇలా వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటారీ లేడీ ఆఫీసర్. ఈ క్రమంలోనే ఆరోగ్యం, ఫిట్‌నెస్‌కు సంబంధించిన పోస్టులతో పాటు.. మహిళల్లో స్ఫూర్తి నింపే ఇతర పోస్టులు సైతం షేర్ చేస్తూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు సోనల్. ఇలా మహిళా సాధికారత దిశగా తాను చేస్తోన్న కృషికి గుర్తింపుగా 2016లో నీతి ఆయోగ్, ఐక్యరాజ్యసమితి, MyGov సంయుక్తంగా ప్రకటించిన ‘ఉమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా-25’ జాబితాలో చోటు దక్కించుకున్నారీ కలెక్టరమ్మ. ఇక సంగీతం, డ్యాన్స్, రైటింగ్, చెస్ ఆడడం, ప్రయాణాలన్నా సోనల్‌కు చాలా ఇష్టమట! మనలో ఉన్న ఇలాంటి కొన్ని ప్రత్యేకతలు కూడా సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడతాయనే ఫిలాసఫీని నమ్ముతారీ బ్రిలియంట్ ఆఫీసర్.
|