తన చలాకీ మాటతీరుతో సినీ ప్రేక్షకుల్ని మాయ చేసిన ముద్దుగుమ్మ విద్యుల్లేఖా రామన్. అయితే లావుగా ఉన్న తన శరీరాకృతిని చూసి చాలామంది చాలా రకాలుగా కామెంట్లు చేసే వారని, అయితే వాళ్ల కోసం కాకుండా తన కోసం తాను ఆరోగ్యంగా, ఫిట్‌గా మారాలనుకున్నానని చాలాసార్లు చెప్పుకొచ్చిందీ చక్కనమ్మ. ఈ నేపథ్యంలోనే లాక్డౌన్లో కసరత్తులు చేసి మరీ బరువు తగ్గానని పలు సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఫిట్నెస్ విషయంలో తనకున్న అంకితభావాన్ని బయటపెట్టిన విద్యుల్లేఖ.. తాజాగా తన ఫిట్నెస్ జర్నీకి సంబంధించిన మరో పోస్ట్‌ను ఇన్‌స్టాలో పంచుకుంది. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.. ‘ఇతరుల కోసం మేమెందుకు మారాలంటూ’ అందరిలో ఓ ఆలోచనను రేకెత్తిస్తోంది.
విద్యుల్లేఖా రామన్.. చెన్నై చిన్నదే అయినా అచ్చ తెలుగు అమ్మాయిలా మాట్లాడుతూ, సహజత్వం ఉట్టిపడేలా నటిస్తూ తక్కువ సినిమాలతోనే తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుందీ క్యూట్ బ్యూటీ. అంతేకాదు.. ఫిట్‌నెస్‌పై తనకున్న అంకితభావాన్నీ వరుస పోస్టుల ద్వారా చాటుకుంటోందీ ముద్దుగుమ్మ. ఈ నేపథ్యంలోనే తాను జిమ్‌లో కసరత్తులు చేస్తోన్న ఫొటోలు, వీడియోలు పంచుకుంటూ.. వాటికి స్ఫూర్తిదాయక క్యాప్షన్లు జతచేస్తూ అందరిలో ప్రేరణ కలిగిస్తోందీ చెన్నై చంద్రం. అలా తాజాగా తన వెయిట్‌లాస్ జర్నీకి సంబంధించిన మరో పోస్ట్‌ను ఇన్‌స్టా ద్వారా పంచుకుందీ చక్కనమ్మ.
బరువు తగ్గడానికి అదే కారణం!
మనమెంతో ఇష్టంగా కొనుక్కున్న దుస్తులు మనకు పట్టనంతగా లావైతే మనకెంత కోపమొస్తుంది? ఆ సమయంలో మన శరీరాన్ని మనమే తిట్టుకుంటాం కదా! అచ్చం విద్యుల్లేఖకు కూడా ఓసారి ఇలాంటి సందర్భమే ఎదురైందట! ఆ విషయం గురించే ఇన్‌స్టా పోస్ట్ రూపంలో పంచుకుందీ అందాల తార.
లావుగా ఉన్న ఫొటోకు, బరువు తగ్గాక దిగిన ఫొటోను జతచేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఈ భామ.. ‘20 కిలోలు తగ్గా.. 86.5 కిలోల బరువున్న నేను 65.3 కిలోలకు చేరుకున్నా. అదో సుదీర్ఘ ప్రయాణం. బాధను దిగమింగుతూ, చెమట చిందిస్తూ ముందుకు సాగిన వైనం! ఈ రెండు ఫొటోల్లో ఎడమ వైపున్న ఫొటో తీసుకున్న సందర్భం నాకు ఎప్పటికీ గుర్తే! ఆ రోజు నా మీద నాకే కోపమొచ్చింది.. ఇంకెప్పుడూ అలా ఉండకూడదనుకున్నా. ఆ రోజు ఓ తమిళ చిత్రం ఆడియో లాంచ్ కార్యక్రమానికి వెళ్లాల్సి ఉంది. దానికోసం మంచి డ్రస్ వేసుకుందామంటే నా వార్డ్‌రోబ్‌లో ఒక్కటీ నాకు ఫిట్ కాదే?! ఇక చేసేదేమీ లేక లెగ్గింగ్ వేసుకొని.. నా అసౌకర్యాన్ని కవర్ చేసుకోవడానికి దానిపై నుంచి ఓ ష్రగ్ ధరించాల్సి వచ్చింది. ఆ సమయంలో ఓవైపు ఆందోళన, నాపై నాకే కోపం నన్ను ముంచెత్తాయి. ‘అయినా నేనెందుకు సన్నబడాలి.. నాకు ఆ అవసరం లేదు.. రాదు!’ అని మరోసారి అనిపించింది. కానీ 2019 ఫిబ్రవరిలో ఎదురైన ఓ అనుభవం నాలో స్ఫూర్తిని రగిలించింది.. బరువు తగ్గాలన్న ఆలోచనను నాలో కలిగించింది. జరిగిందేదో జరిగిపోయింది.. ఇకనైనా ఆరోగ్యంగా, ఫిట్‌గా మారాలని నిర్ణయించుకున్నా. కుడివైపు ఉన్న ఫొటో అందుకు నిదర్శనం! ఏదైనా ఇతరుల కోసం కాదు.. మన కోసం మనం చేయాలి!’ అంటూ స్ఫూర్తిదాయక క్యాప్షన్ పెట్టింది విద్యుల్లేఖ.
ఇలా విద్యుల్లేఖ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ పోస్ట్‌కు రాశీఖన్నా హార్ట్ ఎమోజీని జతచేస్తూ ఈ బొద్దుగుమ్మను ప్రశంసల్లో ముంచెత్తింది. అంతేకాదు.. ‘ఇది మీకెలా సాధ్యమైంది.. ఆ టిప్స్ ఏంటో మాతో కూడా పంచుకోవచ్చుగా!’ అంటూ నెటిజన్లు ఈ చక్కనమ్మ పట్టుదలను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవలే తన ఇష్టసఖుడు సంజయ్‌తో నిశ్చితార్థం చేసుకున్న విద్యుల్లేఖ.. త్వరలోనే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టేందుకు రడీ అయిపోతోంది.