బరువు.. ప్రస్తుతం ప్రపంచాన్నంతా పట్టి పీడిస్తున్న ఓ మహమ్మారి. వూబకాయం, మధుమేహం, గుండెపోటు, క్యాన్సర్.. ఇలా అన్ని రకాల సమస్యలకూ ఇదే మూలకారణం. చక్కని ఆరోగ్యకరమైన అలవాట్లతో అధికబరువు సమస్యకు చెక్ పెట్టొచ్చు అన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ వాటిని పాటించడానికి మనం పెద్దగా ఆసక్తి చూపించం. అందుకే చాలా దేశాల్లో అధిక బరువున్నవారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. అయితే కొన్ని దేశాలు మాత్రం ఆరోగ్యకరమైన అలవాట్లతో ఈ మహమ్మారికి దూరంగా ఉంటున్నాయి. మరి, ఆ దేశాలేంటి? అక్కడి ప్రజలు పాటించే చిట్కాలేంటి? చూద్దాం రండి..
కళ్లతోనూ తింటారు..!
ప్రపంచంలోని ప్రజల్లో అత్యంత ఆరోగ్యంగా ఉండేవారిగా జపాన్ వాసులను చెప్పుకోవచ్చు. దీనికి వారి ఆహారపుటలవాట్లే కారణం. వారు తినే ఆహారంలో సాత్వికమైన పదార్థాలే ఎక్కువగా ఉంటాయి. తాజా కూరగాయలను పచ్చిగా లేదా కాస్త ఉడికించి ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. అంతేకాదు.. తీసుకునే మొత్తం కూడా మోతాదు ప్రకారం మాత్రమే ఉంటుంది. ఇక ఆహారంలో ఎక్కువ భాగం చేపలు, రొయ్యలు వంటి పదార్థాలనే తీసుకుంటూ ఉంటారు. ఇతర రకాల మాంసాహారాన్ని వారు చాలా తక్కువగా ఉపయోగిస్తారు. అలాగే గ్రీన్ టీ, సీ వీడ్.. వంటి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పదార్థాలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల వారు బరువు పెరగకుండా ఉండడమే కాదు.. అనారోగ్యాలకు కూడా దూరంగా ఉంటారు. జపనీయులు 'కళ్లతో తినడం' అనే మాటకు విలువిస్తారు. అంటే ఆహారం తీసుకునేటప్పుడు దాన్ని చూస్తూ, ఆస్వాదిస్తూ తినడం అన్నమాట. దీని ప్రకారమే వారు ఆహార పదార్థాలను గార్నిష్ చేయడానికి కూడా ఎక్కువగా ప్రాధాన్యమిస్తుంటారు. ఫలితంగా తక్కువ ఆహారంతోనే తృప్తి పడొచ్చట! అంతేకాదు.. వీరు క్యాలరీలు ఎక్కువగా ఉండే తీపి పదార్థాలకు దూరంగా ఉంటారు. ఎప్పుడో ఒకసారి అన్నంతో చేసిన తీపి పదార్థాన్ని తీసుకుంటూ ఉంటారు. పండ్లు కూడా తక్కువగానే తింటారు. పులియబెట్టిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల వీరి జీర్ణక్రియలు కూడా సజావుగా సాగుతాయి.

ఎక్కువసేపు భోజనం!
'అదేంటి? ఎక్కువసేపు తింటే ఎక్కువ ఆహారం తీసుకొని తద్వారా బరువు పెరుగుతాం కదా!'అన్న అనుమానం మీకు వచ్చుంటుంది. కానీ ఫ్రెంచివారు ఎక్కువసేపు భోజనం చేయడం వల్ల బరువు తగ్గుతామని నిరూపించారు. ప్రపంచంలోకెల్లా అత్యంత సన్నగా ఉండే వ్యక్తులు ఫ్రాన్స్వారే. దీనికి వీరు ప్రత్యేకమైన ఆహారాన్ని కూడా తీసుకోరు. కానీ వారు ఆహారం తీసుకునే పద్ధతులు వారిని అలా సన్నగా ఉండేలా చేస్తాయి. వీరు ఆహారం విషయంలో కచ్చితమైన నియమాలు పాటిస్తారు. వారి భోజన సమయం సాధారణంగా చాలా ఎక్కువసేపు ఉంటుంది. ప్రపంచంలో అందరికంటే ఎక్కువ సమయం భోజనం చేసేది ఫ్రెంచివారేనని చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయాన్ని ఎక్కువ తినడానికి కాకుండా తినే కాస్త ఆహారాన్నే ఎక్కువసేపు తీసుకుంటారు. ఈ మధ్యలో సమయాన్ని ఆహారం బాగా నమలడానికే కాక, స్నేహితులు, బంధువులతో మాట్లాడుతూ తీసుకోవడానికి ఉపయోగిస్తారు. దీనివల్ల వారు ఆహారాన్ని తొందరగా జీర్ణం చేసుకోగలుగుతారు. ఇక వారు తినే ఆహారం కూడా ఎక్కువగా ఇంట్లో తయారుచేసేదే కావడంతో ఆరోగ్యకరంగా ఉంటుంది. తాజా కూరగాయలతో ఆరోగ్యకరమైన పద్ధతుల్లో ఆహారాన్ని తయారుచేసుకుంటారు. ఇక అన్నిదేశాల కంటే ఫ్రెంచ్ వారు తినే ఆహారం చాలా తక్కువని చెప్పుకోవచ్చు. అక్కడి రెస్టారెంట్లలో కూడా సర్వింగ్ పోర్షన్ సైజులు చాలా చిన్నగా ఉంటాయి.
ప్రాసెస్డ్ ఫుడ్‌కి దూరంగా..!
ప్రస్తుతం ప్రపంచమంతా బెకాన్, చీజ్, క్యాన్డ్ వెజిటబుల్స్ లాంటి ప్రాసెస్డ్ ఫుడ్‌ని ఉపయోగిస్తోంది. అయితే దీనికి భిన్నంగా గ్రీస్ మాత్రం ఆ తరహా ఆహారానికి 'నో' చెబుతోంది. ఆహారంలో ఎక్కువ మోతాదులో ఫైబర్ ఉండేలా చూసుకోవడం వల్ల గ్రీస్ ప్రజలు ఆరోగ్యంగా ఉండడంతో పాటు బరువును కూడా అదుపులో ఉంచుకుంటున్నారు. వాళ్లు చాలా సాధారణమైన ఆహారం తీసుకుంటారు. మొక్కల నుంచి వచ్చిన పదార్థాలు, పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, తృణధాన్యాలు, గింజలు వంటివి ఎక్కువగా తీసుకుంటారు. శాకాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల వారి బరువు కూడా అదుపులో ఉంటుంది. అయితే ఇవన్నీ తీసుకుంటున్నారు కదా.. అని వారి ఆహారం రుచికరంగా ఉండదని మాత్రం అనుకోకండి. అటు ఆరోగ్యాన్ని, ఇటు రుచిని సమతూకం వేసి ఆహారం సిద్ధం చేయడం వారికి మాత్రమే అబ్బిన విద్య అనుకోవచ్చు.

ఇతర దేశాల్లో ఇలా..
కేవలం ఈ మూడు దేశాలే కాదు.. ప్రపంచంలోని ఇంకా మరెన్నో దేశాలు బరువు పెరగకుండా ఉండడానికి కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను ఆచరణలో పెట్టాయి.. అవేంటంటే..
* బ్రెజిల్ ప్రజలు ఎక్కువ పీచుపదార్థం ఉన్న ఆహారాన్ని తీసుకోవడానికి ఇష్టపడతారు. వారు తీసుకునే ఆహారం కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, పీచుపదార్థాల సమ్మేళనంగా ఉంటుంది. అయితే బియ్యం, బీన్స్‌తో చేసిన వంటకాలంటే వారికి చాలా ఇష్టం.
* ఇండోనేషియా ప్రజలు అప్పుడప్పుడూ ఉపవాసం చేస్తూ బరువును అదుపులో ఉంచుకుంటారు. అంతేకాదు.. ఒకసారి తిన్న ఆహారం అరిగిన తర్వాతే మరోసారి ఆహారం తీసుకోవడం వారికి అలవాటు.
* పోలెండ్ ప్రజలు ఎక్కువగా ఇంటి భోజనమే చేస్తుంటారు. అక్కడ హోటళ్లలో తినే ప్రజలు చాలా తక్కువమంది కనిపిస్తారు.
* మనం రోజూ తీసుకునే ఆహారంలో బ్రేక్‌ఫాస్ట్ ప్రధానమైందన్న విషయం తెలిసిందే. ఉదయం తినే ఈ ఆహారం వల్ల శరీరంలో శక్తి ఉత్పన్నమవుతుంది. అందుకే జర్మనీ ప్రజలు బ్రేక్‌ఫాస్ట్‌ని ఎప్పుడూ మానేయరట.
* నెదర్లాండ్స్‌లో ఉన్న ప్రజల సంఖ్య కంటే సైకిళ్ల సంఖ్యే ఎక్కువట. అక్కడివారు ఎక్కడికి వెళ్లినా సైకిళ్ల మీద వెళ్లడానికే ఆసక్తి చూపుతారనడానికి ఇది నిదర్శనం.
* ఓట్స్, పండ్లు లేదా డ్రైఫ్రూట్స్‌తో చేసిన బ్రేక్‌ఫాస్ట్ తినడం మనం ఇప్పుడిప్పుడు అలవాటు చేసుకుంటున్నాం. కానీ అలాంటి బ్రేక్‌ఫాస్ట్‌ని స్విట్జర్లాండ్వాసులు ఎప్పటినుంచో ఇష్టపడతారు. దాని ద్వారా వారు పీచుపదార్థం ఎక్కువ మోతాదులో పొందుతూ బరువును అదుపులో ఉంచుకుంటారు.
* రష్యావాసులు తమ కూరగాయలను తామే పండించుకోవడానికి ఇష్టపడతారు. దీనివల్ల తోటపనితో శరీరానికి వ్యాయామం అందడమే కాకుండా, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ బరువును అదుపులో ఉంచుకుంటారు.
* మలేషియా ప్రజలు పసుపును ఎక్కువగా వినియోగిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మాత్రమే కాదు.. బరువునూ అదుపులో ఉంచుకుంటారు.
* రూయ్‌బోస్ టీ.. ఇందులో గ్రీన్‌టీ కంటే ఎక్కువ మోతాదులో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది సాధారణంగానే తియ్యగా ఉండడం వల్ల చక్కెర కలపాల్సిన అవసరం ఉండదు. ఆఫ్రికన్లు దీన్ని రోజూ తాగడం వల్ల ఆరోగ్యంగా, సన్నగా ఉండగలుగుతున్నారు.

* హంగేరీ ప్రజలు ఎక్కువగా వెనిగర్‌లో నానబెట్టిన కూరగాయ ముక్కలు తినడానికి ఆసక్తి చూపుతారు. దీనివల్ల వెనిగర్‌లోని సుగుణాలు, కూరగాయల్లోని పోషకాలు అంది వారు సన్నగా, తగిన బరువుతో ఉండగలుగుతారు.
* నార్వే ప్రజలు ఆదివారం కుటుంబంతో సహా ఫ్యామిలీ ట్రిప్‌కి వెళ్లడానికి ఇష్టపడతారు. దీనివల్ల వారి సంబంధ, బాంధవ్యాలు మెరుగుపడడమే కాదు.. అక్కడ వారు గడిపే సమయం, ఆడే ఆటలు, సాహస క్రీడల వల్ల వారికి రోజంతా శరీరానికి వ్యాయామం అందుతుంది. దీంతో వారు బరువు పెరగకుండా ఉంటారు.
* మెక్సికోలో ఓ నియమం ఉంది. అక్కడి ప్రజలు మధ్యాహ్న భోజనాన్ని రోజులో ఇతర ఆహారాలన్నింటికంటే ఎక్కువగా తీసుకుంటారు. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ సాధారణంగా చేస్తారు. రాత్రి భోజనం మాత్రం చాలా తక్కువగా, అదీ నిద్రకు రెండు గంటల ముందే పూర్తిచేస్తారు. ఇలాంటి ఆరోగ్యకరమైన అలవాట్ల వల్లే వారు బరువు పెరగకుండా చూసుకుంటున్నారు.
* నోర్డిక్ వాక్.. చలిదేశం ఫిన్లాండ్ ప్రజలకు ఎంతో ఇష్టమైన క్రీడ ఇది. రెండు చేతుల్లోనూ రెండు కర్రముక్కలు పట్టుకుని, వాటి ఆధారంగా మంచులో నడవడమే ఈ క్రీడ. ఇది సాహసక్రీడలకు ఏమాత్రం తక్కువ కాదు.. దీనివల్లే వారు ఆరోగ్యంగా, తగిన బరువుతో ఉండగలుగుతున్నారట.
* చేపలు, రొయ్యలు వంటి సముద్రపు ఆహారం ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మనం ఎప్పటి నుంచో వింటున్నదే.. దీన్ని పాటించడం వల్లే నెదర్లాండ్స్ ప్రజలు తక్కువ బరువుతో ఆరోగ్యకరంగా జీవించగలుగుతున్నారు.
చూశారుగా.. ప్రపంచంలోని వివిధ దేశాల ప్రజలు తమ బరువును అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి పద్ధతులు పాటిస్తారో.. మరి, మీరూ వీటిలో మీకు నచ్చిన పద్ధతులను అనుసరిస్తూ మీ బరువు పెరగకుండా జాగ్రత్తపడండి.