మనల్ని నెలనెలా పలకరించే నెలసరి కారణంగా అటు శారీరకంగా, ఇటు మానసికంగా పలు ఆరోగ్య సమస్యలు ఎదురవడం సహజం. ముఖ్యంగా పొత్తి కడుపులో నొప్పి, నడుం నొప్పి.. వంటివి ఏ పనీ చేసుకోనివ్వకుండా, విశ్రాంతి తీసుకోనివ్వకుండా మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. అయితే అలాంటప్పుడే శరీరానికి కాస్త పని చెప్పాలంటోంది ఫిట్నెస్ ఫ్రీక్ అంకితా కొన్వర్. ఫిట్నెస్ గురూ మిలింద్ సోమన్ భార్యగానే కాకుండా.. శారీరక, మానసిక ఆరోగ్యం విషయంలో తాను చేసే వ్యాయామాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది అంకిత. తన వ్యక్తిగత విషయాలు, తాను చేసే వర్కవుట్‌కి సంబంధించిన పోస్టులను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకునే ఈ ముద్దుగుమ్మ.. నెలసరి సమస్యల్ని ఓ సింపుల్ చిట్కాతో ఇట్టే ఎదుర్కోవచ్చంటూ తాజాగా ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. మరి, అదేంటో మనమూ తెలుసుకొని ఫాలో అయిపోదామా?!
అంకితా కొన్వర్.. ఫిట్నెస్ గురూ, నటుడు అయిన మిలింద్ సోమన్‌ను పెళ్లి చేసుకోకముందు అసలు ఆమె గురించి ఎవరికీ తెలియదు. అలాగని మిలింద్‌తో వివాహం తర్వాత కేవలం ఆయన భార్యగానే ఉండిపోకుండా.. ఫిట్‌నెస్‌పై తనకున్న ఆసక్తి, భర్తతో కలిసి మారథాన్లలో పాల్గొనడంతో తాను కూడా ఓ సెలబ్రిటీగా మారిపోయింది.
ఇక సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది.. తాను చేసే వర్కవుట్ ఫొటోలను, వీడియోలను పోస్టుల రూపంలో ఎప్పటికప్పుడు పంచుకుంటుంది. అంతేనా.. తన భర్తతో కలిసి గడిపే ప్రతి క్షణాన్నీ పంచుకుంటూ భార్యాభర్తల అనుబంధంలోని మాధుర్యాన్ని ఆసాంతం ఆస్వాదిస్తున్నానని చెబుతుంటుంది. అయితే తాజాగా మహిళల కోసం మరో పోస్ట్‌ని ఇన్‌స్టాలో పంచుకుంది అంకిత.
డ్యాన్స్‌తో ఆ అలసట మాయం!
నెలసరి అంటేనే శారీరక అలసట ఆవహిస్తుంది. ఈ సమయంలో మనకు ఎదురయ్యే నడుం నొప్పి, కడుపునొప్పి వంటివి అందుకు కారణమవుతుంటాయి. అయితే ఇలా నీరసంగా అనిపించినప్పుడు డల్‌గా ఉంటే మరింత నీరసపడిపోతామంటోంది అంకిత. అందుకే ఇలాంటప్పుడు శరీరానికి కాస్త జోష్ని అందించాలంటూ తాను హుషారుగా డ్యాన్స్ చేస్తోన్న ఓ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఓ పాటకు ఉత్సాహంగా స్టెప్పులేస్తోన్న ఈ వీడియోకు.. ‘పిరియడ్స్ సమయంలో మన శరీరంలో హార్మోన్లు విడుదలై వివిధ రకాల రసాయనిక చర్యలకు కారణమవుతాయి. ఫలితంగా ఈ రోజుల్లో నీరసపడిపోయి ఏ పనిపై దృష్టి పెట్టలేం. కాబట్టి ఇలా అలసటగా అనిపించినప్పుడు చిన్న పాటి వ్యాయామాలు, డ్యాన్స్.. వంటివి చేయడం వల్ల శరీరంలో కొత్త ఉత్సాహం జనిస్తుంది. ఇది మనల్ని నెలసరి నొప్పులకు దూరం చేస్తుంది. అందుకే నేనూ ప్రతిసారీ ఈ చిట్కాలను పాటిస్తుంటా..’ అంటూ క్యాప్షన్ పెట్టిందీ ముద్దుగుమ్మ. ఇలా పిరియడ్స్ సమయంలో ఎదురయ్యే అలసటను దూరం చేసుకోవడానికి ఓ చక్కటి చిట్కాను అందించి అందరిలో మరోసారి స్ఫూర్తి నింపిందీ ఫిట్నెస్ ఫ్రీక్.
ఈ చిట్కాలూ పనికొస్తాయ్!

నెలసరి సమయంలో ఎదురయ్యే నొప్పుల్ని, అలసటను దూరం చేసుకోవడానికి మరికొన్ని చిట్కాలు కూడా మనకు ఉపయోగపడతాయి. * పిరియడ్స్ సమయంలో ఏ పనీ చేయకుండా హాయిగా విశ్రాంతి తీసుకోవడానికే మన శరీరం మొగ్గు చూపుతుంది. కానీ ఇలాంటి అలసట, నీరసాన్ని స్నానంతో అధిగమించచ్చంటున్నారు నిపుణులు. స్నానం చేసే గోరువెచ్చటి నీటిలో కప్పు ఎప్సం సాల్ట్, కొన్ని చుక్కల ఏదైనా అత్యవసర నూనె కలుపుకొని.. ఆ నీటితో స్నానం చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. అలాగే ఈ స్నానం మనసుకూ ప్రశాంతతనిస్తుంది. * నెలసరి సమయంలో మనకు ఆహారపు కోరికలు కూడా ఎక్కువగానే కలుగుతుంటాయి. ఈ క్రమంలో కొందరికి చాక్లెట్ తినాలనిపిస్తే, మరికొందరికి ఐస్‌క్రీమ్ వైపు మనసు లాగుతుంటుంది. ఇంకొందరికేమో.. జంక్‌ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్ అంటూ వారి మనసు వాటిపైకి మళ్లుతుంది. అలాగని పిరియడ్ బ్లూస్ని అధిగమించడానికి వీటిని ఎంత తినాలపిస్తే అంత తింటే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కాబట్టి మనసు తృప్తి పడేలా ఓ చాక్లెట్ బైట్, ఓ స్కూప్ ఐస్‌క్రీమ్, ఇంట్లో చేసుకున్న పదార్థాలు.. వంటివి మితంగా తీసుకోవడం మంచిది. * మానసికంగా, శారీరకంగా ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఏ పనీ చేయాలనిపించదు. కానీ ఇలాంటి సమయంలో మన మనసుకు నచ్చిన పనిచేస్తే ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. అందుకే నెలసరితో అలసిపోకుండా ఉండాలంటే నచ్చిన సినిమా చూడడం, ఇష్టమైన వంటకం తయారుచేసుకొని తినడం, మనసుకు నచ్చిన వాళ్లతో గడపడం.. వంటివి చేస్తే ఎలాంటి శారీరక నొప్పుల మీదకు మనసు మళ్లదు.
 * పిరియడ్స్ అంటూ ఉదయం నుంచి సాయంత్రం దాకా మంచం పైనే పడుకుంటే ఎలా? అందుకే ఉదయం, సాయంత్రం కాసేపు అలా బాల్కనీ, వరండా లేదంటే గార్డెన్లో నడవడం, ఇంట్లో ఉండే ఫిట్నెస్ పరికరాలతోనే చిన్నపాటి వ్యాయామాలు చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా మనలో సరికొత్త ఉత్సాహం వస్తుంది. అయితే ఈ సమయంలో కఠినమైన వ్యాయామాలకు దూరంగా ఉండడమే మంచిది. లేదంటే బ్లీడింగ్ ఎక్కువయ్యే అవకాశమూ లేకపోలేదు. నెలసరి సమయంలో వ్యాయామాలు చేసే విషయంలో మీకు ఏ సందేహం ఉన్నా ఫిట్నెస్ నిపుణుల సలహాలు పాటించడం మాత్రం మరవద్దు. * శరీరంలో మెగ్నీషియం లోపం వల్ల ఒత్తిడి, ఆందోళనలు ఎదురవడంతో పాటు నెలసరి సమయంలో పలు శారీరక నొప్పులకు కారణమవుతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే ఈ ఖనిజం అధికంగా లభించే నట్స్, వేరుశెనగ, గుమ్మడి గింజలు, అవకాడో, పెరుగు, ఆకుకూరలు.. వంటివి ఎక్కువగా ఆహారంలో భాగం చేసుకోవాలి.
|
నెలసరి సమయంలో ఎదురయ్యే శారీరక నొప్పులు దాదాపు అందరిలో కామన్! అయితే కొంతమందిలో ఈ సమయంలో భరించలేనంత నొప్పి వస్తుంటుంది. అలాంటప్పుడు నిర్లక్ష్యం చేయకుండా మీకు తెలిసిన డాక్టర్ని ఫోన్లోనే సంప్రదించి తగిన సలహాలు తీసుకోవడం మంచిది. అంతేకానీ.. మీకు తెలిసిన ఏవో ట్యాబ్లెట్లు తెచ్చుకొని వాడడం, తద్వారా లేనిపోని అనారోగ్యాలు కొని తెచ్చుకోవడం ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో అస్సలు మంచిది కాదు.