
ప్రసవమయ్యాక కొందరు మహిళలు బరువు తగ్గి పూర్వస్థితికి రావడానికి డైటింగ్, కఠినమైన వ్యాయామాలు.. వంటి పలు రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఇలాంటి వాటివల్ల అటు బాలింతల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు ఆహార నియమాల పేరుతో కడుపు మాడ్చుకోవడం వల్ల బిడ్డకు సరైన మొత్తంలో పాలు ఉత్పత్తి కాకపోవచ్చు. అందుకే పూర్తిగా ఈ నియమాలపైనే ఆధారపడకుండా బిడ్డకు నిరంతరాయంగా తల్లిపాలు అందించాలని అంటోంది బాలీవుడ్ హాట్ మమ్మీ లిసా హెడెన్.
ఇద్దరు బాబుల ముద్దుల అమ్మగా ప్రస్తుతం అమ్మతనంలోని కమ్మదనాన్ని ఆస్వాదిస్తోన్న లీసా.. జాక్ పుట్టాక తాను కేవలం ఐదు నెలల వ్యవధిలోనే తిరిగి బరువు తగ్గానంటోంది. అంతేకాదు.. అందుకు బ్రెస్ట్‌ఫీడింగ్ ఎంతగానో దోహదం చేసిందని చెబుతోంది. ప్రెగ్నెన్సీ సమయంలో బికినీలో తన బేబీ బంప్‌ని ప్రదర్శిస్తూ నేటి తల్లులందరి మదిలో ప్రెగ్నెన్సీపై ఉండే అపోహల్ని, మూసధోరణుల్ని బద్దలు కొట్టిన ఈ యమ్మీ మమ్మీ.. ప్రసవానంతరం తన ఫిట్టెస్ట్ ఫిజిక్‌తో, వర్క్-లైఫ్ బ్యాలన్స్తో మహిళలకు ఎన్నో పాఠాలు నేర్పుతోంది. ఈ క్రమంలో ప్రసవానంతరం తిరిగి ఫిట్‌గా మారేందుకు లిసా పాటించిన డైట్, ఫిట్నెస్, ఇతర సీక్రెట్స్ ఏంటో మనమూ తెలుసుకుందాం రండి..
'బోల్డ్ అండ్ బ్యూటిఫుల్'.. ఈ రెండు పదాలు బాలీవుడ్ అందం లిసా హెడెన్‌కు సరిగ్గా సరిపోతాయి. కేవలం మోడల్‌గానే కాకుండా.. 'క్వీన్', 'హౌస్‌ఫుల్ 3', 'యే దిల్ హై ముష్కిల్'.. వంటి సినిమాల్లో నటిగానూ సక్సెస్ సాధించిందీ ముద్దుగుమ్మ. 2016లో డినో లల్వానీ అనే బ్రిటిష్ వ్యాపారవేత్తను వివాహమాడిన లిసా.. ఆ తర్వాతి ఏడాది జాక్ లల్వానీ అనే ముద్దుల బాబుకు జన్మనిచ్చింది. బాబు పుట్టిన తర్వాత ఎక్కువగా కుటుంబానికే పరిమితమైన ఈ అందాల తార.. గతంలో 'టాప్ మోడల్ ఇండియా' అనే రియాల్టీ షోకు హోస్ట్‌గా వ్యవహరించింది. ఓవైపు తన బాబు ఆలనా పాలనలో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మహా చురుగ్గా ఉంటూ తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాల్ని ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటుందీ బ్యూటిఫుల్ మామ్. ఈ క్రమంలో తన బేబీ బంప్‌ని ప్రదర్శిస్తూ, తన ముద్దుల బాబుకు పాలిస్తూ క్లిక్‌మనిపించిన ఫొటోల్ని సైతం నిర్మొహమాటంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మహిళలకు మాత్రమే దక్కిన అలాంటి అందమైన ఫీలింగ్స్‌ని దాచుకోకుండా అందరితో పంచుకోవాలని చెబుతోందీ యమ్మీ మమ్మీ.
10 పెరగమంటే 20 పెరిగా!
హాయ్.. నేను మీ లిసాని. నా పోస్ట్ ప్రెగ్నెన్సీ వెయిట్ లాస్ గురించి మాట్లాడడం కరక్ట్ కాదేమో అనేది నా భావన! ఎందుకంటే ఒక్కొక్కరి శరీరతత్వం ఒక్కోలా ఉంటుంది. అందరికీ ఒకే రకమైన రొటీన్ సరిపడకపోవచ్చు. అయినా సరే.. మీకోసం కొన్ని విషయాలు చెప్పడానికే ఇలా మీ ముందుకొచ్చా. నేను గర్భం ధరించక ముందు 53-54 కిలోల బరువుండేదాన్ని. ప్రెగ్నెన్సీలో అదనంగా 20 కిలోలు పెరిగా. నేను ప్రెగ్నెన్సీలో కనీసం 10 కిలోలైనా పెరగాలని డాక్టర్లు సూచించారు.. కానీ నేను 20 కిలోలు పెరిగా. ఆ సమయంలో నా చుట్టూ ఉన్న వాళ్లంతా.. 'ఇది నీ బరువు కాదు.. నీ శరీరంలో ఉండే నీటి శాతం అని, పాపాయి ఎక్కువ బరువు ఉండి ఉండచ్చు అని..' ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా అనేవారు. ప్రసవానికి ముందు డాక్టర్ నా బరువు చెక్ చేశారు.. జాక్ పుట్టాక నా బరువు కొలుచుకుంటే వాడి వెయిట్ తప్ప నేనేమీ కోల్పోలేదనిపించింది. వాడు మూడున్నర కిలోలతో ఆరోగ్యంగా పుట్టాడు. ఆ సమయంలో పనుల్ని సమన్వయం చేసుకోవడం, బ్రెస్ట్‌ఫీడింగ్ విషయంలో నాకు ఎదురైన సందేహాల్ని తీర్చుకోవడానికి కాస్త ఇబ్బంది పడ్డా.. ఎందుకంటే నేను గర్భం దాల్చకముందే అమ్మ పోయింది.. దాంతో ఈ విషయాలన్నీ నాకు కొత్త కావడంతో మొదట్లో కాస్త ఒత్తిడిగా అనిపించేది. కానీ క్రమంగా ఆ ఒత్తిడి, ఆందోళనల నుంచి బయటపడి నా చిన్నారికి సంతోషంగా పాలివ్వడం అలవాటు చేసుకున్నా. పాలిచ్చే తల్లులు ఎలాంటి మానసిక ఒత్తిళ్లు, ఆందోళనలు లేకుండా బిడ్డలకు పాలిస్తేనే అవి పిల్లల ఒంటికి పడతాయి. అప్పుడే తల్లీబిడ్డలిద్దరికీ మధ్య అనుబంధం మరింతగా దృఢమవుతుంది.
పాలు పడితే బరువు తగ్గుతాం!
అయితే బ్రెస్ట్‌ఫీడింగ్ గురించి నేను ఇంతలా నొక్కి చెప్పడానికి కారణం లేకపోలేదు. దానివల్ల తల్లీబిడ్డల మధ్య అనుబంధం పెరగడం ఒక్కటే కాదు.. నిరంతరం తల్లి బిడ్డకు పాలివ్వడం వల్ల అటు తల్లికి, ఇటు బిడ్డకు ఇద్దరూ ఎలాంటి అనారోగ్యాల పాలు కాకుండా తమని తాము కాపాడుకోవచ్చు. అలాగే ఈ ప్రక్రియ వల్ల ప్రసవానంతర బరువూ సులభంగా తగ్గచ్చు. ఈ విషయం నేను అనుభవ పూర్వకంగా చెబుతున్నది. బాబు పుట్టాక నేను పోస్ట్ చేసిన ఫొటోలు చూసి చాలామంది నా ఫిట్నెస్, ఆరోగ్యం గురించి పలు ప్రశ్నలు సంధించేవారు. బాబు పుట్టాక ఇంత త్వరగా తిరిగి ఫిట్నెస్ను ఎలా సొంతం చేసుకున్నారంటూ అడిగేవారు. వారందరికీ నేను చెప్పదలచుకున్న సమాధానం ఒక్కటే. అదే బ్రెస్ట్‌ఫీడింగ్. నేను తిరిగి మునుపటి శరీరాకృతికి చేరుకోవడంలో బిడ్డకు పాలివ్వడం ఎంతగానో సహకరించింది. ఈ బిజీ షెడ్యూల్లో పిల్లలకు పాలివ్వడం అనేది కాస్త సమయం తీసుకునే ప్రక్రియే. కానీ అన్నింటికంటే అదే ముఖ్యం. అదే మనల్ని, మన పిల్లలకు దగ్గర చేస్తుంది. అంతేకాదు.. పిల్లలకు పూర్తి పోషకాలను తల్లిపాలే అందించగలుగుతాయి. అందుకే నేను నా కొడుక్కి ఏడాది పాటు పాలిచ్చా. కాబట్టి మీరూ మీ చిన్నారులకు తల్లిపాలు అందిస్తూ అటు వారి ఆరోగ్యాన్ని కాపాడుతూనే ఇటు మీరు ప్రసవానంతర బరువూ తగ్గచ్చు.
|
వాడు పడుకున్నాకే యోగా!
ప్రసవానంతరం కొన్ని నెలలకే నేను బరువు తగ్గానంటే అందులో నేను చేసిన వ్యాయామాల పాత్ర కూడా కీలకమే! ఒక రకంగా చెప్పాలంటే వ్యాయామం అనేది నా రక్తంలోనే ఉంది. ఎందుకంటారా..? మా అమ్మకు వ్యాయామం అంటే చాలా ఇష్టం. మేం ఎనిమిది మంది పిల్లలం. మా అందరితో ఆమె వ్యాయామం చేయించేది. అలా చిన్నతనం నుంచే ఎక్సర్సైజ్పైకి నా మనసు మళ్లింది. ప్రెగ్నెన్సీలో, ప్రసవానంతరం కూడా ఎక్సర్సైజ్ రొటీన్‌ని మరవలేదు. అలాగే చిన్నతనం నుంచి కథక్ డ్యాన్స్ అన్నా నాకు చాలా ఇష్టం. కానీ పెద్దయ్యే క్రమంలో దాన్ని కొనసాగించలేకపోయా. నా బాబు పుట్టిన తర్వాత రోజూ వాడితో మారథాన్ చేస్తున్నా. వాడిని బేబీ క్యారియర్‌లో కూర్చోబెట్టుకొని మెట్లెక్కడం, దిగడం.. వీటితోనే నాకు చాలా వర్కవుట్ చేసినట్లవుతుంది. దీంతో వ్యాయామం చేయడానికి కూడా సరైన సమయం దొరక్కపోయేది. ఎప్పుడైనా వాడు చిన్న కునుకు తీస్తే.. ఆ సమయాన్ని యోగా సెషన్‌గా ఉపయోగించుకునేదాన్ని. అలాగే అప్పుడప్పుడూ కాస్త ఖాళీ దొరికితే మా ఇంటికి దగ్గర్లో ఉండే స్పిన్నింగ్ క్లాసులకు వెళ్తా.. సెలబ్రిటీ ఎక్స్పర్ట్ నమ్రతా పురోహిత్ ఆధ్వర్యంలో నేను చేసిన పిలాటిస్ కూడా ప్రసవానంతరం నేను బరువు తగ్గడానికి ఎంతో దోహదం చేశాయి. ఇక ఎక్కడికైనా దగ్గర ప్రదేశానికి వెళ్లాల్సి వస్తే నడుచుకుంటూ వెళ్లిపోతా.. వీటితో పాటు రోజూ రన్నింగ్, స్విమ్మింగ్.. వంటివి నా వర్కవుట్ రొటీన్లో ఉండాల్సిందే! ఇలా మనం ప్రసవానంతరం బరువు తగ్గడానికి కఠినమైన వ్యాయామాలంటూ పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు.. ఇలాంటి సింపుల్ వర్కవుట్స్తోనే తక్కువ సమయంలోనే మల్లెతీగలా మారిపోవచ్చు.. అయితే ఒక్కొక్కరి శరీరతత్వం ఒక్కోలా ఉంటుంది కాబట్టి మీరూ పోస్ట్ ప్రెగ్నెన్సీ వర్కవుట్స్ చేయాలంటే ఓసారి నిపుణుల్ని అడిగితే వారే మీ శరీరానికి నప్పే వ్యాయామాలు సూచిస్తారు. తద్వారా మంచి ఫలితం కనిపిస్తుంది.
|
సప్లిమెంట్స్ మానేశా!
* ఇక నా డైట్ విషయానికొస్తే.. ఉదయం లేవగానే కొబ్బరి నీళ్లు తాగడం నాకు అలవాటు. ఎందుకంటే అది నా శరీరంలో నీటి శాతం తగ్గకుండా చేయడంతో పాటు శరీరంలోని విషపదార్థాలను బయటికి పంపించేస్తుంది. * పండ్లు, ఉడికించిన కోడిగుడ్లు బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా తీసుకుంటా. ఇక షూటింగ్స్లోనైతే ఇడ్లీ-సాంబార్, దోసె.. వంటివి తీసుకుంటా. * లంచ్లోనైతే చికెన్ సలాడ్ తప్పనిసరిగా ఉండాల్సిందే! * డిన్నర్లో చాలా లైట్ ఫుడ్ తీసుకోవడానికే మొగ్గుచూపుతా. ఈ క్రమంలో తాజా పండ్లు, కాయగూరల సలాడ్స్, పండ్ల రసాలు.. వంటివి తీసుకుంటా. అప్పుడప్పుడూ (చాలా రేర్‌గా) ఏదో ఒక డెజర్ట్ తీసుకోవడానికి ఇష్టపడతా. అందులోనూ ప్యాన్‌కేక్స్-ఛీజ్కే నా తొలి ప్రాధాన్యం. * రోజంతా నీళ్లు ఎక్కువగా తాగడం, ఆకుపచ్చ కాయగూరలు, ఆకుకూరలతో చేసిన వంటకాలు తీసుకోవడానికే ఎక్కువ ఇష్టపడతా. * చాలామంది డైటింగ్ పేరుతో ఆహారం మానేసి, పోషకాల కోసం విటమిన్ సప్లిమెంట్స్ తీసుకుంటుంటారు. నేనూ గతంలో అలానే చేసేదాన్ని. కానీ వీటి కంటే తాజా పండ్లు, కాయగూరల ద్వారా శరీరానికి అందే పోషకాలు మంచివని గ్రహించా. ఇక అప్పట్నుంచి సప్లిమెంట్స్ మానేసి తాజా ఆహారానికే ప్రాధాన్యమిస్తున్నా.
|
అమ్మ పాత్రలోని కమ్మదనం అదే!
ప్రతి తల్లికీ తన బిడ్డపై ఎనలేని మమకారం ఉంటుంది. ఆ విషయం నాకు నా పిల్లలు పుట్టినప్పుడే అనుభవపూర్వకంగా అర్థమైంది. వారిద్దరూ నాకు రెండు కళ్లు.. తల్లిగా ఉండడం కంటే ఇప్పటివరకు నాకేదీ అంత ఆనందంగా అనిపించలేదు. ఇప్పటివరకు అటు సినిమాల్లోనే కాకుండా నిజజీవితంలోనూ కూతురిగా, భార్యగా ఎన్నో పాత్రలు పోషించా.. అయినా అమ్మ పాత్ర ఇచ్చినంత ఆనందం, సంతృప్తి అవేవీ ఇవ్వలేదు.. అందుకే ఇంట్లో ఉన్నప్పుడు నా ఏకాగ్రత అంతా నా బుజ్జాయిలపైన, నా భర్తపైనే ఉంటుంది. ప్రస్తుతం నా ముందున్న లక్ష్యాలు రెండు.. అవి అటు పనిని, ఇటు ఇంటిని సమన్వయం చేస్తూ ముందుకు సాగడం, నా చిన్నారుల్ని మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దడం. మీరూ ఇలా రెండింటినీ సమన్వయం చేసుకోగలిగితే ఒత్తిడి నుంచి బయటపడచ్చు.. అలాగే పిల్లలకూ సమయం కేటాయించచ్చు.. అప్పుడే అటు వారు, ఇటు మీరు ఒకరికొకరు మిస్సయిన భావన రాకుండా.. ఇద్దరి మధ్యా అనుబంధం మరింత బలపడుతుంది. ఇప్పటిదాకా నేను చెప్పిన ఈ కొన్ని విషయాలు మీకు కొంతవరకైనా ఉపయోగపడతాయనుకుంటున్నా.. ఆల్ ది బెస్ట్ న్యూ మామ్స్.. టేక్ కేర్ ఆఫ్ యువర్ న్యూ బోర్న్ బేబీస్.. బై బై..!
|
బాలీవుడ్ హాట్ బ్యూటీ లిసా హెడెన్ చెప్పిన అమ్మతనపు అనుభవాలు, పోస్ట్ ప్రెగ్నెన్సీ వెయిట్ లాస్ సీక్రెట్స్ గురించి తెలుసుకున్నారుగా! అయితే ఒక్కొక్కరి శరీరతత్వం ఒక్కోలా ఉంటుంది.. కాబట్టి వీటిని పాటించే ముందు ముఖ్యంగా డైట్, వ్యాయామం.. విషయాల్లో మాత్రం ఓసారి ముందుగా నిపుణుల సలహా తీసుకొని ఆ తర్వాత ప్రారంభించడం మంచిది.
Photo: Instagram