మాతృత్వం కారణంగా సుమారు రెండేళ్ల పాటు టెన్నిస్‌కు దూరమైంది సానియా మీర్జా. అయితే తల్లయినా ఆటమీద తనివి తీరలేదంటూ గతేడాది మళ్లీ టెన్నిస్ కోర్టులోకి అడుగుపెట్టింది. ఆడిన మొదటి టోర్నమెంట్‌లోనే విజేతగా నిలిచి తన సెకండ్ ఇన్నింగ్స్‌ను అద్భుతంగా ఆరంభించింది. అయితే ఈ ఘనమైన పునరాగమనం వెనుక ఎంతో కఠోర శ్రమ దాగుంది. చాలామంది మహిళల్లాగే తల్లయ్యాక బరువు పెరిగిన సానియా...ఆటమీద మమకారంతో మళ్లీ మెరుగైన ఫిట్నెస్ను సాధించేందుకు తీవ్రంగా శ్రమించింది. కుమారుడి ఆలనాపాలన చూసుకుంటూనే, బరువు తగ్గేందుకు జిమ్‌లో వర్కవుట్లు, వ్యాయామాలు చేసింది. కేవలం 4 నెలల్లోనే 26 కిలోలు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్వహించిన ఓ ఆన్లైన్ కార్యక్రమంలో పాల్గొన్న సానియా... తన బరువు, ఫిట్‌నెస్‌కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను అందరితో షేర్ చేసుకుంది.
నాలుగు నెలల్లో 26 కిలోలు!
క్రికెట్‌ను మాత్రమే ఆరాధించే ఇండియాలో తన ఆటతీరుతో టెన్నిస్‌కు విశేష గుర్తింపు తీసుకొచ్చింది సానియా మీర్జా. గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో పాటు డబుల్స్ విభాగంలో వరల్డ్ నెం.1 ర్యాంకింగ్‌ను సొంతం చేసుకున్న ఈ టెన్నిస్ క్వీన్ మెటర్నిటీ బ్రేక్ కారణంగా రెండేళ్లు టెన్నిస్ కోర్టుకు దూరమైంది. ఆ సమయంలో విపరీతమైన బరువు పెరిగిన సానియా మళ్లీ రీ ఎంట్రీ కోసం తీవ్రంగా శ్రమించింది. కేవలం 4 నెలల్లోనే 26 కిలోల బరువు తగ్గి మళ్లీ టెన్నిస్ బ్యాట్ పట్టేందుకు సరిపడా ఫిట్నెస్ను సొంతం చేసుకుంది. అదేవిధంగా బరువు తగ్గడంలో భాగంగా తన వర్కవుట్లు, వ్యాయామాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి అందరిలో స్ఫూర్తి నింపిందీ టెన్నిస్ స్టార్. ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్ కోసం సన్నద్ధమవుతోన్న ఆమె తాజాగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్వహించిన ఓ ఆన్లైన్ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా తన వర్కవుట్లు, వ్యాయామాలను ఓ వీడియో ద్వారా వివరించిన సానియా... తాను బరువు తగ్గడానికి గల బలమైన కారణమేంటో ఇలా చెప్పుకొచ్చింది.
ఆటపై నాకున్న మమకారమే!
‘నాది మొదటి నుంచి వెనకడుగు వేయని తత్వం. ఏదైనా సరే అది నా వల్ల కాదు అని ఎవరైనా అంటే నేను ఏ మాత్రం ఒప్పుకోను. వెంటనే అది చేసి చూపిస్తాను. నాకున్న ఈ వ్యక్తిత్వమే నన్ను బరువు తగ్గేలా చేసింది. అదేవిధంగా టెన్నిస్‌పై నాకున్న మమకారం నన్ను వ్యాయామం వైపు నడిపించింది. ఈ ప్రపంచంలో ఇంకెవరూ చేయనిది నేను చేయాలనుకున్నాను. అందుకోసం నా మానసిక బలాన్ని నమ్ముకున్నా. ఇష్టమైన వాటిని తినకుండా నన్ను నేను నియంత్రించుకున్నా. ఈ క్రమంలో నాలుగు నెలల్లో మొత్తం 26 కిలోల బరువు తగ్గాను. ఇక ప్రసవానంతరం ఎదురయ్యే కుంగుబాటు (పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్) సమస్యలను అధిగమించడానికి నా వర్కవుట్లు, వ్యాయామాలు ఎంతో మేలు చేశాయి. ఇక ఇజాన్‌కు జన్మనిచ్చాక పెరిగిన నా బరువు గురించి ప్రశ్నించిన వారే...26 కిలోలు తగ్గాక నా వెయిట్ లాస్ సీక్రెట్ ఏంటని అడిగారు’..
ఈ సమయాన్ని అలా సద్వినియోగం చేసుకుంటా!
‘రియో ఒలింపిక్స్ (2016)లో ఓటమి నా జీవితంలోని అత్యంత బాధాకరమైన సంఘటనల్లో ఒకటి. ఆ ఓటమి తర్వాత మళ్లీ ఒలింపిక్స్‌లో ఆడతానని అసలు అనుకోలేదు. కానీ గతేడాది పునరాగమనం చేసినప్పుడు ఎలాగైనా ఒలింపిక్స్‌లో ఆడి పతకం గెలవాలని నిర్ణయించుకున్నా. కరోనా ప్రభావంతో ఈ ఏడాది జరగాల్సిన ఒలింపిక్స్ వాయిదా పడ్డాయి. ఇదేమీ నన్ను ఆశ్చర్యపరచలేదు. ఒకటిన్నర ఏడాది గ్యాప్ అంటే మాలాంటి అథ్లెట్లకు చాలా విలువైన సమయం. 2021 నాటికి నేనూ 34వ వసంతంలోకి అడుగుపెడుతున్నా. మళ్లీ ఇంకో పతకాన్ని అందుకునేందుకు 2021 ఒలింపిక్స్ రూపంలో నాకో అద్భుతమైన అవకాశం ఉంది. అయితే దానికింకా చాలా సమయం ఉంది. నా ఫిట్నెస్ను మరింత మెరుగుపర్చుకునేందుకు, నా పునరాగమనాన్ని మరింత ఘనంగా మార్చుకునేందుకు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాను’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది సానియా.