అన్‌లాక్-2.0లో కేంద్రం చాలావరకు సడలింపులిచ్చినా జిమ్, యోగా, ఏరోబిక్స్.. తదితర వర్కవుట్ సెంటర్లు తెరవడానికి ఇంకా అనుమతులు రాలేదు. పైగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు మళ్లీ లాక్డౌన్ దిశగా ఆలోచిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బయటకు వెళ్లి చేసే వ్యాయామాలకు దూరమవుతున్నామని వాపోతున్నారు కొందరు ఫిట్నెస్ ప్రియులు. అయితే మనసు పెట్టి ఆలోచిస్తే.. ఇంట్లో ఉండే కొన్ని వస్తువులనే జిమ్ పరికరాలుగా మార్చుకోవచ్చు. అది ఎలాగో మీరే చూడండి.
బకెట్
జిమ్‌లో చేసే వ్యాయామాల్లో భాగంగా చాలామంది ‘డెడ్ లిఫ్ట్’ కూడా చేస్తుంటారు. నేలపై ఉన్న వెయిట్ (బార్బెల్)ని రెండు చేతులతో పట్టుకొని మోచేతులు వంచకుండా నడుము వరకు పైకి ఎత్తి మళ్లీ కిందికి దించాలి. ఇలా పలుమార్లు చేయడం వల్ల కండరాలు దృఢంగా తయారవుతాయి. అయితే ఈ వ్యాయామాన్ని ఇంట్లో కూడా చేయచ్చు. ఇందుకోసం ఒక బకెట్లో నీటిని నింపి (మీరు మోయగలిగే బరువు వరకు), జిమ్‌లో చేసే విధంగానే బకెట్‌ని నేలపై నుంచి పైకి ఎత్తి మళ్లీ కిందికి దించాలి. ఈ క్రమంలో బకెట్ హ్యాండిల్ లేదా బకెట్‌పై అంచును పట్టుకోవచ్చు.
బకెట్ బదులు రైస్ బ్యాగ్, కూరగాయలున్న సంచి, లగేజ్ బ్యాగ్.. ఇలా మీకు అందుబాటులో ఉన్న ఏ వస్తువునైనా వాడచ్చు.
కుర్చీ
ఇంట్లో ఉండే కుర్చీలు కేవలం కూర్చోడానికి మాత్రమే కాదు వ్యాయామ పరికరంగా కూడా ఉపయోగపడతాయి. ఈ క్రమంలో కుర్చీతో ట్రైసెప్స్ డిప్స్, హిప్ ఎక్స్టెన్షన్స్, లెగ్ ఎక్స్టెన్షన్స్, సైడ్ రైజెస్.. ఇలా ఎన్నో రకాల వ్యాయామాలు చేయచ్చు. అయితే ఇందుకోసం చేతులు లేని కుర్చీలను ఎంపిక చేసుకుంటే మేలు.
పుస్తకాలు
పుస్తకాలనేవి చదవడానికి, రాయడానికి మాత్రమే కాదు.. వ్యాయామం చేయడానికి కూడా ఉపయోగపడతాయి. పుషప్స్, ప్లాంక్స్ వంటి వ్యాయామాలు చేసేటప్పుడు బరువున్న పుస్తకాలను కొన్నింటిని మీ వీపుపై పెట్టుకోండి. అవి కింద పడకుండా ఈ వ్యాయామాలు చేయడానికి ప్రయత్నించండి. ఇదే విధంగా, సిటప్స్ చేసేటప్పుడు కూడా బరువున్న పుస్తకాన్ని మీ చేతులతో పట్టుకొని వ్యాయామం చేయడానికి ప్రయత్నించండి. తద్వారా కండరాలు ఎక్కువ శ్రమకు లోనవుతాయి.
వాటర్ బాటిల్
జిమ్‌లో డంబెల్స్‌తో చేసినట్లే.. ఇంట్లో ఉండే వాటర్ బాటిల్స్‌తో కూడా వ్యాయామం చేయచ్చు. ఇందుకోసం మీరు ఒకేలా ఉండే రెండు వాటర్ బాటిల్స్‌ను తీసుకోండి. వాటిని నీటితో నింపండి. ఇప్పుడు ఈ వాటర్ బాటిల్స్‌ని చేతులతో పట్టుకొని జిమ్‌లో డంబెల్స్‌తో చేసే విధంగానే చేతులను పైకి, కిందికి.. ముందుకి, వెనక్కి అనాలి. తద్వారా చేతి కండరాల (బైసెప్స్, ట్రైసెప్స్)కు వ్యాయామం లభిస్తుంది.
టవల్
ఇంట్లో ఉపయోగించే టవల్‌తో నడుము పక్క భాగాల కండరాలకు వ్యాయామం కల్పించచ్చు. అదెలా అంటే.. టవల్ని నిలువుగా చుట్టి రెండు చేతులతో టవల్ రెండు చివర్లను పట్టుకోవాలి. ఇప్పుడు చేతులు పైకి ఎత్తి అటు పక్కకు.. ఇటు పక్కకు సాధ్యమైనంత వరకు వంగాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల ఫలితం తప్పక కనిపిస్తుంది.
స్టూల్
శరీరాన్ని ఫిట్‌గా ఉంచేందుకు జిమ్‌లో బాక్స్ జంప్స్ సాధన చేస్తుంటారు చాలామంది. ఇందులో భాగంగా మన మోకాలు/లేదా అంతకంటే తక్కువ ఎత్తులో ఉన్న ఒక బాక్స్‌పైకి అమాంతం ఎగిరి నిలబడాలి. దానిపై నుంచి దిగి మళ్లీ అలాగే ఎగరాలి. అయితే ఇంట్లో ఈ వ్యాయామాన్ని చేసేందుకు మీరు ఎత్తు తక్కువున్న స్టూల్ని బాక్స్ లాగా ఉపయోగించుకోవచ్చు. కాకపోతే మీరు దానిపైకి ఎగిరి నిలబడినప్పుడు అది అటు ఇటు కదలకుండా కింద ఏదైనా మ్యాట్‌ను వేయడం మంచిది. స్టూల్ అందుబాటులో లేని వాళ్లు మీ బెడ్ని, మెట్లను ఉపయోగిస్తూ కూడా ఈ వ్యాయామం చేయచ్చు.
లగేజ్ బ్యాగ్
జిమ్‌లో చేసే బర్పీస్, స్క్వాట్స్, యాబ్స్.. తదితర వ్యాయామాలను పర్ఫెక్ట్గా చేసేందుకు వెయిటెడ్ బ్యాగ్‌ని వాడుతుంటారు చాలామంది. అయితే ఇలాంటి వ్యాయామాలు ఇంట్లో చేసేటప్పుడు వెయిటెడ్ బ్యాగ్ బదులు బట్టలతో నింపిన లగేజ్ బ్యాగ్‌ను వాడచ్చు. అంతేకాదు, ఈ బ్యాగ్‌ను భుజాలపై వేసుకొని మెట్లు ఎక్కి దిగడం, కాఫ్ రైజెస్ వంటి వ్యాయామాలు కూడా చేయచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం? ఎలాంటి భయాలు, సంకోచాలూ లేకుండా మళ్లీ బయటకు వెళ్లగలిగేవరకు ఇంట్లో అందుబాటులో ఉండే ఇలాంటి వస్తువులనే జిమ్ పరికరాలుగా మార్చుకొని వ్యాయామాలు చేయండి.. మీ శరీరాన్ని ఫిట్‌గా మలచుకోండి!