శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండడానికి ప్రస్తుతం చాలామంది ఎంచుకుంటోన్న ఆప్షన్ వ్యాయామం. అందుకు తాము ఎంత బిజీగా ఉన్నా ఎక్సర్సైజ్ కోసం రోజూ కొంత సమయం కేటాయిస్తున్నారు చాలామంది. నటీనటులూ ఇందుకు అతీతం కాదు. సినిమాల్లో తమ పాత్రల కోసమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యానికి, దృఢత్వానికి ఫిట్నెస్ను తమ రొటీన్లో భాగం చేసుకునే ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు. వారిలో అలనాటి అందాల తార భాగ్యశ్రీ కూడా ఒకరు. ‘మైనే ప్యార్ కియా’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి తొలి చిత్రంతోనే ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. పలు హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తన సినీ కెరీర్లో మధ్యమధ్యలో కాస్త విరామం తీసుకుంటూ తిరిగి వెండితెరపై మెరుస్తోన్న ఈ అందాల తార.. ఈ మధ్య సోషల్ మీడియాలోనూ బిజీగా మారిపోయింది. ఈ క్రమంలోనే తన ఫిట్నెస్, కుకింగ్ వీడియోలను తన ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలా తాజాగా తన ఫిట్నెస్ జర్నీకి సంబంధించిన వీడియోను పంచుకుంటూ.. దానికి జతగా ఆమె పెట్టిన క్యాప్షన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
‘దిల్ దివానా దిల్ సజ్నా కే మానే నా’ అంటూ ‘మైనే ప్యార్ కియా’ సినిమాతో కుర్రకారు కలల రాణిగా మారిపోయింది అలనాటి అందాల భాగ్యశ్రీ. ‘రాణా’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల్నీ పలకరించిందీ బ్యూటీ. కేవలం బాలీవుడ్‌కే పరిమితం కాకుండా కన్నడ, బెంగాలీ, మరాఠీ.. వంటి పలు భారతీయ భాషా చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ అందాల తార.. ప్రస్తుతం ‘తలైవి’తో పాటు ప్రభాస్‌కు తల్లిగా ఓ సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఈ అందాల అమ్మ.. తన కొడుకుతో కలిసి వంట చేసిన వీడియోలను, తన వర్కవుట్ వీడియోలను పంచుకుంటూ తన ఫ్యాన్స్‌తో అనునిత్యం టచ్‌లోనే ఉంటోంది.
కొన్నేళ్ల క్రితమే ప్రారంభమైంది!
ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన భాగ్యశ్రీ తాను గతంలో చేసిన వర్కవుట్కు సంబంధించిన వీడియోను త్రోబ్యాక్ పేరుతో తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. తన ఫిట్నెస్ ట్రైనర్ స్వప్నిల్ హజారేతో కలిసి చేసిన కఠినమైన వ్యాయామాలకు సంబంధించిన ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. ‘నా ఫిట్నెస్ జర్నీ గత కొన్నేళ్ల క్రితమే ప్రారంభమైంది. దీన్ని ఎప్పటికీ ఇలాగే కొనసాగిస్తా. మనల్ని మనం ఫిట్‌గా మార్చుకోవడానికి ఇప్పటికీ సమయం మించిపోయింది లేదు.. నా ఈ జర్నీలో నాకు సహకరించిన స్వప్నిల్ హజారేకు థ్యాంక్యూ..!’ అంటూ ఓవైపు తన ఫిట్నెస్ జర్నీ గురించి చెబుతూనే.. మరోవైపు తన ఫ్యాన్స్‌ను వ్యాయామం చేసే దిశగా ప్రోత్సహించిందీ సుందరి. అంతేకాదు.. వ్యాయామం మొదలుపెట్టడానికి సమయం, సందర్భం, వయసుతో పనిలేదని.. ఫిట్‌గా మారాలని మనసులో బలంగా నిశ్చయించుకుంటే ఎప్పుడైనా వర్కవుట్ జర్నీని ప్రారంభించచ్చని తన ఫ్యాన్స్‌కు ఫిట్నెస్ పాఠాలు నేర్పుతోందీ అందాల తార.
6 వ్యాయామాలు.. ఒక్కోటి 20 సార్లు!
ఈ లాక్డౌన్లో జిమ్‌లన్నీ మూతపడ్డాయి.. దీంతో జిమ్‌తో పనిలేకుండా ఇంట్లోనే వర్కవుట్స్ చేయాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే ఇలా ఇంట్లో వ్యాయామం చేసినా జిమ్ పరికరాలతో పనిలేదంటోంది భాగ్యశ్రీ. ఇంట్లో ఉండే వస్తువులనే మనం చేసే వ్యాయామం కోసం ఉపయోగించుకొని ఫిట్‌గా మారచ్చంటూ మరో వీడియోను పోస్ట్ చేసిందీ ముద్దుగుమ్మ. ఇందులో భాగంగా కుషన్ సహాయంతో తాను విభిన్న వ్యాయామాలు చేస్తూ రూపొందించిన వీడియోను ఇన్‌స్టాలో పంచుకుంది భాగ్య. ‘వ్యాయామం చేయడానికి ఇంట్లో జిమ్ పరికరాలు లేకపోతే దిండు, కుషన్ లేదా వాటర్ బాటిల్‌ని ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవచ్చు. ఈ వీడియోలో చూపించిన ఈ ఆరు వ్యాయామాలను మూడుసార్లు చేయాల్సి ఉంటుంది.
* ముందుగా ఎక్సర్సైజ్ మ్యాట్ని నేలపై పరచుకొని నడుమును మాత్రమే నేలకు తాకేలా ఇలా ‘వి’ ఆకృతిలో కూర్చోవాలి. ఇప్పుడు దిండును రెండు చేతులతో పట్టుకొని శరీర పైభాగాన్ని మాత్రమే కదిలిస్తూ ఒకసారి కుడివైపుకి, మరోసారి ఎడమవైపుకి తిరగాలి. ఇలా 20 సార్లు చేయాల్సి ఉంటుంది.
* ఇంతకుముందులాగే కూర్చొని.. కాళ్లను కాస్త మడుస్తూ పాదాల మడమలు నేలకు తాకేలా ఆనించాలి. ఆపై దిండును రెండు చేతులతో పట్టుకొని తల వెనక నుంచి ఓసారి కుడివైపుకి, మరోసారి ఎడమవైపుకి తీసుకురావాలి. ఇలా 20 సార్లు చేయాలి.
* ఇక మూడో వ్యాయామంలో భాగంగా.. ముందుగా రెండు మోకాళ్లను, రెండు చేతుల్ని నేలపై ఆనించి క్యాట్ పోజ్‌లో కూర్చోవాలి. ఇప్పుడు కుడి కాలిని వెనక్కి చాచి మళ్లీ యథాస్థితికి తీసుకురావాలి. ఆపై ఎడమ కాలితో కూడా ఇలాగే చేయాలి. ఇలా రెండేసి కాళ్లతో ఇరవై సార్లు చేయాల్సి ఉంటుంది.
* ఇప్పుడు నిటారుగా నిల్చొని, దిండును రెండు చేతులతో పట్టుకొని తల వెనక భాగంలో పైకి, కిందికి అంటుండాలి. ఇలా ఇరవై సార్లు చేయాలి.
* ఇప్పుడు ప్లాంక్ పొజిషన్లో ఉండి.. కుడి చేతిని ఎడమ భుజానికి తాకించాలి.. ఆపై ఎడమ చేతిని కుడి భుజానికి తాకించాలి. ఇలా రెండు చేతులు మార్చుతూ ఇరవై సార్లు ఈ వ్యాయామం చేయాల్సి ఉంటుంది.
* ఇంతకుముందులాగే ప్లాంక్ పొజిషన్లో ఉండి.. కుడి చేత్తో ఎడమ కాలిని, ఆపై ఎడమ చేత్తో కుడి కాలిని తాకాలి. ఇలా ఇరవై సార్లు చేయాలి.
ఈ వ్యాయామాల వల్ల పొట్ట కండరాలు దృఢమవుతాయి. నడుంనొప్పి తగ్గుతుంది. అలాగే శరీర పైభాగానికి చక్కటి వ్యాయామం అందుతుంది..’ అంటూ తాను స్వయంగా చేసి మరీ చూపించిందీ అందాల తార.
ఇలా ఈ లాక్డౌన్ సమయంలో తాను చేసే వర్కవుట్ వీడియోలను పంచుకుంటూ.. వాటి ద్వారా తన ఫ్యాన్స్‌కు ఫిట్నెస్ పాఠాలు చెబుతోంది భాగ్యశ్రీ. 50 ఏళ్లు దాటినా వన్నె తరగని అందానికి చిరునామాగా నిలుస్తోన్న ఈ భామ.. వర్కవుట్స్‌తో వయసును కూడా దాచేయచ్చంటూ తన ఫిట్టెస్ట్ ఫిజిక్‌తో చెప్పకనే చెబుతోంది. మరి, వర్కవుట్ రొటీన్‌ను ప్రారంభించడానికి ఇప్పటికైనా సమయం మించిపోయింది లేదంటూ మనమూ ఈ అందాల తార ఫిట్నెస్ టిప్స్‌ని ఫాలో అయిపోదాం.. ఇంట్లోనే ఫిట్‌గా మారిపోదాం..!