సాధారణంగా అధిక బరువున్న వాళ్లు తగ్గడానికి నానా ప్రయత్నాలూ చేస్తుంటారు.. అంతేతప్ప కావాలని ఎవరూ బరువు పెరగడానికి సాహసించరు. కానీ కొందరు నటీమణులు మాత్రం తమ పాత్రలకు అనుగుణంగా తమ రూపాన్ని మార్చుకోవడం, బరువు పెరగడం-తగ్గడం వంటివి చేస్తుంటారు. తద్వారా తాము నటించే సినిమాలకు, అందులోని తమ పాత్రలకు పూర్తి న్యాయం చేస్తుంటారు. అలాంటి అందాల తారల్లో బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతీ సనన్ ఒకరు. ‘ఆవ్ తుఝో మోగ్కొర్తా’ అంటూ ప్రిన్స్ మహేష్ సరసన ఆడిపాడి తెలుగు వారికి దగ్గరైన ఈ చిన్నది.. పలు బాలీవుడ్ సినిమాలతో సక్సెస్ఫుల్ హీరోయిన్గా పేరుతెచ్చుకుంది. ప్రస్తుతం ‘మిమి’ అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తోన్న కృతి.. అందులో సరొగేట్ మదర్‌గా కనిపించనుంది. ఆ పాత్ర కోసం ఏకంగా 15 కిలోలు పెరిగిన ఈ ముద్దుగుమ్మ.. ఈ లాక్డౌన్ సమయంలో పెరిగిన బరువు తగ్గించుకొని తిరిగి నాజూగ్గా మారిపోయింది. అయితే ఇదంతా తన డైటీషియన్ జాన్వీ కనకియా సంఘ్వీ వల్లే సాధ్యమైందని తాజాగా చెప్పుకొచ్చింది కృతి. ఈ క్రమంలోనే జాన్వితో దిగిన ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో పంచుకుంటూ ఆమెకు ధన్యవాదాలు తెలిపిందీ సుందరి. మరి, తాను ఫిట్‌గా ఉండడానికి, బరువు తగ్గడానికి కృతి ఎలాంటి డైట్, ఫిట్నెస్ టిప్స్ పాటిస్తుందో తన మాటల్లోనే తెలుసుకుందాం రండి..
అందుకే బరువు పెరగాలని నిర్ణయించుకున్నా!
హీరోయిన్లుగా సినిమాల్లో అవకాశాలు రావడానికి గ్లామరస్‌గా, నాజూగ్గా ఉండడం చాలా ముఖ్యం. అలాంటిది నేను ‘మిమి’ కోసం బరువు పెరిగానంటే ఆ పాత్రకున్న వైవిధ్యతే అందుకు కారణం. ‘మలా ఐ వైచ్యా’ అనే మరాఠీ ఫీచర్ ఫిల్మ్ ఆధారంగా లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో సరొగేట్ మదర్‌గా కనిపిస్తా. ఈ సినిమా కథ వినగానే ఈ పాత్ర నా మనసుకు బాగా నచ్చింది. అందుకోసం ఏమైనా చేయాలని నిర్ణయించుకున్నా. ఈ క్రమంలోనే అప్పటిదాకా 56 కిలోల బరువున్న నేను అదనంగా 15 కిలోలు పెరగాలని నిర్ణయించుకున్నా. తద్వారా ఈ పాత్రలో సహజసిద్ధంగా ఒదిగిపోవచ్చనేది నా ఆలోచన. మామూలుగా నేను చాలా స్లిమ్‌గా ఉంటాను. కానీ ఇలా బరువు పెరగడం నా శరీరానికి కొత్త. అంతేకాకుండా చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ బరువు పెరగాలనేది నాకో సవాల్ లాంటిది. అందుకే కొత్త డైట్ అలవాటు చేసుకున్నా. ఈ క్రమంలో నా ఆహారపుటలవాట్లను సైతం మార్చుకున్నా. కార్బోహైడ్రేట్లు, కొవ్వులు అధికంగా ఉండే జున్ను, నెయ్యి, పండ్లు వేయించిన బంగాళాదుంపలు, చిలగడదుంపలకు నా మెనూలో చోటిచ్చా. ఇక పిజ్జా, పాస్తా, దాల్ మఖనీ.. వంటి క్యాలరీలు అధికంగా ఉండే ఆహారానికీ ప్రాధాన్యమిచ్చా. ఇవన్నీ ఆకలేసినప్పుడే కాదు.. ఆకలేయకుండా కూడా లాగించేదాన్ని. అలా మొత్తానికి 15 కిలోలు పెరిగా.
ఆమె వల్లే సాధ్యమైంది!
ఇలా నాకు నచ్చిన పని చేయడంలో బరువు పెరిగినా సంతృప్తిగానే అనిపించింది. అయితే బరువు పెరగడం ఎంత కష్టమో.. తగ్గడం అంతకంటే కష్టమని తగ్గేటప్పుడు గానీ నాకు తెలియలేదు. నా శరీరంలో చేరిన అదనపు క్యాలరీలను కరిగించుకునేందుకు చాలా కష్టపడ్డా. అందులోనూ బరువు పెరిగేందుకు కొన్ని నెలలుగా వర్కవుట్ మానేయడంతో నా శక్తిసామర్థ్యాలు కూడా తగ్గిపోయాయి. అయినా చక్కటి ఆహార నియమాలు పాటిస్తూ, వ్యాయామాలు చేస్తూ నా శక్తిని కూడగట్టుకొని మరీ బరువు తగ్గాను. ఈ క్రమంలో నా డైటీషియన్ జాన్వీ కనకియా సంఘ్వీ పాత్ర కీలకం. ఆమె సూచించిన ఆహార నియమాలే నేను ఈ లాక్డౌన్ సమయంలో బరువు తగ్గడానికి దోహదం చేశాయి. ‘మిమి’ కోసం బరువు పెరగడానికి, ఆపై తగ్గడానికి చక్కటి ఆహార నియమాలు సూచించిన జాన్వీకి ధన్యవాదాలు. తను లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదేమో! నేను పెరిగిన 15 కిలోల బరువును ఈ లాక్డౌన్ సమయంలో దాదాపుగా తగ్గాను. మహా అయితే ఇంకా కిలో, కిలోన్నర తగ్గాలంతే! ఆ మార్క్‌నీ త్వరగానే అందుకుంటా.
తేలికపాటి ఆహారం తీసుకుంటా!
బరువు తగ్గడానికనే కాదు.. ముందు నుంచీ ఆరోగ్యకరమైన ఆహార శైలి పాటించడం నాకు అలవాటు. సరైన సమయంలో తినడం, సరైన ఆహారం తీసుకోవడమే నా ఆరోగ్య సూత్రం. ఈ క్రమంలో తక్కువ మొత్తాల్లో ఎక్కువ సార్లు ఆహారం తీసుకుంటా. మీల్‌కి మీల్‌కి మధ్య రెండు నుంచి రెండున్నర గంటల గ్యాప్ ఉండేలా చూసుకుంటా. అలాకాకుండా ఎక్కువ గ్యాప్ ఇవ్వడం, సమయం లేదంటూ కడుపు మాడ్చుకోవడం నాకు నచ్చదు. దానివల్ల ఇతర అనారోగ్యాలూ తలెత్తుతాయి. నా డైట్ మెనూ కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది.
* సాధారణ సమయాల్లో అన్నం, చికెన్ కర్రీ లేదంటే పప్పు, కూరగాయలు.. వంటివి తీసుకుంటా.
* ఒక్కోసారి మరీ హెవీగా అనిపించినప్పుడు సూప్, సలాడ్ లేదా శాండ్విచ్.. వంటి వాటికి ప్రాధాన్యమిస్తా.
* లంచ్ మెనూ కంటే డిన్నర్ మెనూలో చాలా తేలికపాటి ఆహార పదార్థాలుండేలా జాగ్రత్తపడతా. ఫలితంగా త్వరగా జీర్ణమవడంతో పాటు ఎలాంటి పొట్ట సంబంధిత సమస్యలు తలెత్తకుండా చూసుకోవచ్చు. * ఇక నేను బయటికి వెళ్లినా నా కార్లో లేదంటే నా హ్యాండ్‌బ్యాగ్‌లో తినడానికి ఏదో ఒకటి ఉంచుకుంటా. అలాగని అవేవో ప్రాసెస్డ్ ఫుడ్ అనుకునేరు. నట్స్, ఓట్స్ చియా పుడ్డింగ్, బెర్రీస్.. వంటివాటికే ఎక్కువ ప్రాధాన్యమిస్తాను.
* ఒక్కోసారి బిజీ షెడ్యూల్ వల్ల తినడానికి సమయముండదు. అలాంటప్పుడు చాక్లెట్ లేదా కనీసం ఓ అరటిపండైనా లాగించేస్తా. ఇవీ కాదంటే డేట్స్ తింటా.. అవైతే అప్పటికప్పుడు శరీరానికి శక్తిని అందిస్తాయి.
* ఒకవేళ మాంసాహారం ఎక్కువగా తినాల్సి వచ్చినప్పుడు గ్రీన్ జ్యూస్ తప్పనిసరిగా తాగుతా. పాలకూర, కీరా, కాకర, ఉసిరి, నిమ్మ, పుదీనా, గ్రీన్ యాపిల్.. మొదలైన పదార్థాలతో చేసిన రసం అంటే మరీ ఇష్టం. * ఇక వ్యాయామం తర్వాత ప్రొటీన్ షేక్ లేదా ప్రొటీన్ బార్ తినడానికి మొగ్గుచూపుతా. వీటి వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది.
|
వర్కవుట్ మానను!
నేను చిన్నతనం నుంచీ చాలా సన్నగా ఉంటాను. అలాగని క్రమం తప్పకుండా వ్యాయామాలు చేసేస్తానేమో అనుకునేరు. ఎక్సర్సైజ్ అంటేనే నాకు ఎక్కడలేని బద్ధకం ఆవహిస్తుంది. ఈ విషయంలో నన్ను ప్రోత్సహించడానికి, జిమ్ దాకా నడిపించడానికి నాకో ట్రైనర్ కచ్చితంగా కావాల్సిందే! అయితే శరీరం ఫిట్‌గా ఉండాలంటే తప్పనిసరిగా వర్కవుట్ చేయాల్సిందే అనేది నా అభిప్రాయం.
* ఈ క్రమంలో నేను నా కండరాల దృఢత్వాన్ని పెంచుకోవడానికి బరువులెత్తడం, పిలాటిస్.. వంటివి చేస్తుంటా. వీటివల్ల శరీరం ఫ్లెక్సిబుల్‌గా మారుతుంది. బలంగా కూడా తయారవుతాం.
* అలాగే డ్యాన్స్ కూడా ఒక వ్యాయామం లాంటిదే. అందుకే వారానికి రెండు మూడు రోజులు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తా. చిన్నతనంలో కథక్ నేర్చుకున్నా.. కానీ ఇప్పుడు జాజ్ తరహా డ్యాన్స్ ఫామ్‌ను ఫాలో అవుతున్నా.
* ఒకవేళ షూటింగ్ రీత్యా బయటి ప్రదేశాలకు వెళ్లాల్సి వస్తే కూడా వర్కవుట్ మానుకోను. ఒకవేళ నేనుండే ప్రదేశంలో జిమ్ లేకపోయినట్లయితే నాతో పాటు యోగా మ్యాట్ తప్పకుండా ఉంటుంది. సో.. వివిధ యోగాసనాలు వేస్తుంటా.
* నా పాత్రకు తగినట్లుగా నన్ను నేను మార్చుకోవడానికి ఫిట్నెస్ ఎక్స్పర్ట్ సలహాతో వివిధ రకాల వర్కవుట్స్ కూడా ప్రాక్టీస్ చేస్తుంటా. * ముఖ్యంగా నాకు ఫిట్నెస్ ఎక్స్పర్ట్ యాస్మిన్ కరాచీవాలా పిలాటిస్ సెషన్ అంటే చాలా ఇష్టం. ఆయా వ్యక్తుల శరీర తత్వాలకు తగినట్లుగా పిలాటిస్ ఎక్సర్సైజ్ నేర్పించడం ఆమెకే సాధ్యం.
* ఇక ఫిట్నెస్ విషయంలో నాలో స్ఫూర్తి నింపిన వ్యక్తి ఎవరంటే కత్రినా కైఫ్ అనే చెబుతా. తన వర్కవుట్ వీడియోస్ కూడా రెగ్యులర్‌గా చూస్తుంటా. అలాగే శిల్పా శెట్టి, మలైకా అరోరాలు కూడా చాలా ఫిట్ పర్సనాలిటీని మెయింటెయిన్ చేస్తారు.
|
ఇక చివరిగా మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా.. మనం ఎలా ఉన్నా మన శరీరాన్ని ప్రేమించుకోవడం నేర్చుకోవాలి. అప్పుడే కంఫర్టబుల్‌గా ఉండగలం.. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండడానికి ఇదీ ఓ చిట్కానే. అలాగే ఈ లాక్డౌన్ కారణంగా చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు. అది రాన్రానూ మిమ్మల్ని డిప్రెషన్లోకి తీసుకెళ్లే ప్రమాదముంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లోనే సానుకూల దృక్పథంతో ఉండాలి. ఇందుకోసం ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పనిలో నిమగ్నమవ్వండి.. యోగా-ధ్యానం చేయండి.. అలాగే మీరు వాయిదా వేసిన పనుల్ని పూర్తి చేయండి.. కొత్త విషయాలు నేర్చుకోండి.. ఒకవేళ బయటికి వెళ్లాల్సి వచ్చినా సరైన జాగ్రత్తలు పాటిస్తూ కరోనాకు దూరంగా ఉండండి.. త్వరలోనే ‘మిమి’ సినిమాతో కలుద్దాం.. టేక్ కేర్..!