సాధారణంగా చబ్బీగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో పంచుకోవడానికి చాలామంది ఇష్టపడరు. వాటిని చూసి ఎవరెలా స్పందిస్తారో అని వెనకడుగు వేస్తుంటారు. కానీ కొందరు ముద్దుగుమ్మలు మాత్రం ఇందుకు భిన్నం. ‘ఎవరేమనుకుంటే మాకేంటి.. మా శరీరం మా ఇష్టం..’ అంటూ తాము గతంలో లావుగా ఉన్న ఫొటోల్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడానికి ఏమాత్రం వెనకాడరు. మన పటౌడీ ప్రిన్సెస్ సారా అలీ ఖాన్ కూడా ఇదే కోవలోకి వస్తుంది. సినిమాల్లోకి రాకముందు 96 కిలోల బరువుతో చబ్బీగా ఉండే సారా.. ఆపై కఠోరమైన కసరత్తులు చేసి మల్లెతీగలా మారిపోయింది.
ఇలా ఒకసారి సన్నబడ్డాక.. తిరిగి తాము గతంలో లావుగా ఉన్నప్పటి ఫొటోల్ని చూడడానికి, ఆ రోజుల్ని తలచుకోవడానికి కూడా ఇష్టపడరు. కానీ సారా అలా కాదు.. ఆ రోజుల్ని పదే పదే గుర్తుచేసుకుంటూ అప్పటి ఫొటోలు, వీడియోలను తరచూ సోషల్ మీడియాలో పంచుకుంటుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాలో ఓ వీడియోను పోస్ట్ చేసిందీ బబ్లీ గర్ల్. తాను గతంలో చదువుకునే రోజుల్లో లావుగా ఉన్నప్పటి ఫొటోలు, ఆపై కసరత్తులు చేస్తూ తీసిన ఫొటోలు-వీడియోలను కొలేజ్ చేసి ఓ వీడియోగా రూపొందించిందీ చిన్నది. దాన్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా అందరూ తనను.. ‘నువ్వు అంత సన్నగా ఎలా మారావ్?’ అంటూ అడుగుతున్నారు. అదే విషయం గురించి గతంలో తాను తన తండ్రి సైఫ్‌తో కలిసి ‘కాఫీ విత్ కరణ్’ షోలో పాల్గొన్నప్పుడు ఇలా చెప్పుకొచ్చిందీ పటౌడీ బ్యూటీ.
అలా సగమయ్యా!
సినిమాల్లోకి రాకముందు తానెంత లావుగా ఉండేదో చెబుతూ.. అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేయడం సారాకు అలవాటే. అలా తాను చాలా లావుగా ఉన్నప్పటి ఫొటోలను, ఆపై వ్యాయామాలు చేస్తూ బరువు తగ్గిన ఫొటోలు-వీడియోలు కొలేజ్ చేసి రెండు నిమిషాల నిడివి గల వీడియోను రూపొందించిందీ పటౌడీ ప్రిన్సెస్. దాన్ని ఇటీవలే ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన సారా.. ‘అందరికీ నమస్కారం.. లాక్డౌన్ ఎడిషన్.. ఎపిసోడ్ 2: ఎంతో చబ్బీగా ఉన్న సారా.. ఇప్పుడు సగానికి సగం బరువు తగ్గి నాజూగ్గా ఎలా మారిందో మీరే చూడండి..’ అనే క్యాప్షన్‌ను జోడించింది. ఇందులో సారా.. పిలాటిస్, కార్డియో వ్యాయామాలతో పాటు స్విమ్మింగ్, కిక్‌బాక్సింగ్, బైక్ రైడింగ్.. వంటివి చేయడం మనం చూడచ్చు. ఇలా తాను పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండింగ్‌లో ఉంది. ఈ వీడియో చూసిన చాలామంది ‘మీ అంకితభావంతోనే ఇది సాధ్యమైంది..’ అంటూ ఆమెను ఓవైపు ప్రశంసిస్తూనే.. మరోవైపు ‘నాకూ పీసీఓఎస్ ఉంది.. మీరే నా స్ఫూర్తి..’ అంటూ తమ అనుభవాలను సైతం పంచుకుంటున్నారు. ఇక మరికొందరేమో.. ‘మీ వెయిట్‌లాస్ వెనకున్న సీక్రెట్ ఏంటో చెప్పచ్చుగా..!’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇప్పుడే కాదు.. తాను సినిమాల్లోకి రాకముందు తన తల్లి అమృతాసింగ్‌తో కలిసి దిగిన ఓ ఫొటోను మొన్నామధ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సారా. ఇందులో ఎంతో బొద్దుగా, అసలు ఆమె సారా అలీ ఖాన్ కాదేమో అనేంత గుర్తుపట్టలేనట్లుగా ఉన్న ఆ ఫొటోను చూసి అటు అభిమానులే కాదు.. పలువురు సెలబ్రిటీలు కూడా షాకయ్యారు. ‘అమేజింగ్ జర్నీ.. హ్యాట్సాఫ్!’, ‘నీ డైట్ సీక్రెట్స్ ఏంటో చెప్పవా?’.. అంటూ సారా ఫిట్నెస్ సీక్రెట్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు.
అంత సులువేమీ కాదు..!
స్టార్ నటీనటుల వారసులకుండే రెడీమేడ్ స్టార్ స్టేటస్‌తో సినీరంగంలో రాణించడం అంత సులువేమీ కాదు. ముఖ్యంగా కథానాయికల విషయంలో వారి అందచందాలు, శరీరాకృతి, నటన.. వంటివన్నీ కూడా ముఖ్యమే. చాలామంది స్టార్ కిడ్లు సినీరంగంలోకి రాక ముందు బొద్దుగా, సరైన ఫిట్నెస్ లేకుండా ఉండడం మనం చూస్తూనే ఉంటాం. సారా అలీ ఖాన్ కూడా ఆ కోవలోకే చెందుతుంది. సినిమాల్లోకి రాక ముందు 96 కిలోల బరువుతో బొద్దుగుమ్మగా కనిపించిన ఆమె.. సినిమాల కోసం ఎంతో శ్రమించి తన బరువును తగ్గించుకొని స్లిమ్‌గా తయారైంది. పీసీఓఎస్ సమస్యతో బాధపడిన ఆమె ఆహారపుటలవాట్లలో మార్పులు చేసుకుని, వ్యాయామాలు చేస్తూ ఎంతో కష్టపడి మరీ బరువు తగ్గింది. ఈ క్రమంలో తాను ఎంత శ్రమ పడిందో గతంలో తన తండ్రి సైఫ్‌తో కలిసి పాల్గొన్న ‘కాఫీ విత్ కరణ్’ షోలో భాగంగా చెప్పుకొచ్చిందీ బాలీవుడ్ దివా.
అప్పుడు నిర్ణయించుకున్నా..
సెలబ్రిటీ కిడ్స్ అయినంత మాత్రాన అందరూ నటించాలనుకోరు కదా..! అందుకు నటన పట్ల వారికి ఆసక్తి ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే ఏదో ఒక సందర్భంలో బయటపడి తీరుతుంది. అలా నటన పట్ల తనకున్న మక్కువను తాను కొలంబియాలో ఉన్నప్పుడు తెలుసుకున్నానని చెబుతోంది సారా. ‘గతంలో చదువు కోసం నేను నాలుగేళ్ల పాటు కొలంబియా వెళ్లా. రెండో ఏడాది ముగిసే క్రమంలో నా మనసులో నటన పట్ల ఉన్న ఆసక్తిని గమనించా. సినిమాల్లోకి రావాలని అప్పుడే నిర్ణయించుకున్నా..! అయితే అది అనుకున్నంత సులువు కాదు. ఒక నటిగా రాణించాలంటే అందమొక్కటే ఉంటే సరిపోదు.. మంచి శరీరాకృతి, ఫిట్నెస్ కూడా ముఖ్యమే. కానీ అప్పటికి నా బరువు 96 కిలోలు. బరువు తగ్గి స్లిమ్‌గా మారడం కాస్త కష్టమే అనిపించింది. అయినా సరే వెనక్కి తగ్గలేదు. నా ఆహారపుటలవాట్లు మార్చుకున్నా. వ్యాయామం చేశా. ఇలా నా చదువు పూర్తయ్యే సరికి బరువు తగ్గా..’ అంటూ సినిమాల్లోకి రావాలన్న తన తపన గురించి చెప్పుకొచ్చిందీ బాలీవుడ్ భామ.

నా అధిక బరువుకు అదే కారణం..
గతంలో 96 కిలోల బరువున్న సారా.. తాను ఇలా బరువు పెరగడానికి పీసీఓఎస్ కారణమని చెబుతోంది. ‘గతంలో నా బరువు 96 కిలోలు. అంటే ఎంత లావుగా కనిపించేదాన్నో మీరే అర్థం చేసుకోవచ్చు. నాకు పీసీఓఎస్ సమస్య కూడా ఉండేది. బహుశా నేను అంతలా బరువు పెరగడానికి అదీ ఓ కారణమే. దాంతో హార్మోన్ల సమస్య కూడా తలెత్తింది. అంతేకాదు.. అప్పట్లో ఖాళీ సమయం ఎక్కువగా ఉండేది కాబట్టి ఏది పడితే అది ఎక్కువగా తినేదాన్ని. కొలంబియాలో చదువుకోవడానికి వెళ్లినప్పుడు మా ఇంటికి దగ్గర్లో ఓ పిజ్జా షాపు ఉండేది. అందులోని పిజ్జాలంటే ప్రాణమిచ్చేదాన్ని. అలా అక్కడి కాలేజీలో చదువుకునేటప్పుడు వాటిని ఎక్కువగా తిన్నా. అయితే ఆ పక్కనే ఓ విటమిన్ షాపు కూడా ఉండేదన్న విషయం నేను బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాకే తెలిసిందంటే.. పిజ్జాలకు నేనెంతలా అలవాటు పడ్డానో మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ విటమిన్ షాపులోని సలాడ్లు, ప్రొటీన్ బార్స్.. వంటి పదార్థాలే నేను బరువు తగ్గడంలో ప్రధాన పాత్ర పోషించాయి..’ అంటూ తాను పిజ్జా గర్ల్ నుంచి ఫిట్టెస్ట్ గర్ల్‌గా మారిన సందర్భాన్ని వివరించిందీ స్టార్ బ్యూటీ.

ఆమె పాటలు వింటూ..
ఆహారపుటలవాట్లే కాదు.. వ్యాయామాలు కూడా తాను బరువు తగ్గడానికి ఎంతగానో సహకరించాయని చెబుతోంది సారా. ముఖ్యంగా తన ఫేవరెట్ సింగర్ నేహా కక్కర్ పాటలు వింటూ ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తేదాన్నని అంటోందీ బ్యూటీ. ‘గాయని నేహా కక్కర్ అంటే నాకు చాలా ఇష్టం. ఆమె పాటలు వింటుంటే చెవుల్లో తేనె పోసినంత మధురంగా అనిపిస్తుంది. రోజూ ఆమె పాటలు వింటూ ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తడం నాకు అలవాటు. వాటిని పదే పదే వినేదాన్ని కూడా..! చేసే వ్యాయామానికి తగిన ఆహారం తినేదాన్ని. ఇలా నేను స్లిమ్‌గా మారడానికి నేహా కక్కర్ పాటలు కూడా ఓ కారణమే. నేనే కాదు.. ప్రతిఒక్కరూ తమకు నచ్చిన పనులు చేస్తూ వ్యాయామం చేయడం, తద్వారా బరువు తగ్గడం చాలా సులభమైన పద్ధతి. బరువు ఎక్కువగా ఉంటే మోడలింగ్, సినిమా రంగాల్లో అవకాశాలు రావనే కాదు.. దాని వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. హార్మోన్లు సమతౌల్యం కోల్పోతాయి. తద్వారా అటు శారీరకంగానే కాదు.. మానసికంగానూ ఇబ్బందులు తప్పవు. కాబట్టి నిర్ణీత బరువుతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి అందరూ ప్రయత్నించాలి..’ అంటూ తన ఫిట్నెస్ రహస్యాలు పంచుకుంటూనే తన ఫ్యాన్స్‌లో స్ఫూర్తి నింపిందీ పటౌడీ బేబ్.
టెన్నిస్ ఆడతా!
* సారా అలీ ఖాన్ బాలీవుడ్ నటీనటులు సైఫ్ అలీ ఖాన్ - అమృతా సింగ్ దంపతులకు 1993లో జన్మించింది.
* న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీలో హిస్టరీ, పొలిటికల్ సైన్స్ విభాగాల్లో డిగ్రీ పూర్తిచేసింది సారా.
* టెన్నిస్ అంటే అమితంగా ఇష్టపడే ఈ ముద్దుగుమ్మ.. ఖాళీ సమయాల్లో తండ్రి సైఫ్, సోదరుడు ఇబ్రహీం అలీ ఖాన్‌లతో కలిసి టెన్నిస్ కోర్టుకు వెళ్లిపోతుంటుంది.
* బాలీవుడ్లో నచ్చిన నటీనటులెవరంటే కరీనా కపూర్, రణ్వీర్ సింగ్ అంటూ సమాధానమిస్తుందీ హాట్ బ్యూటీ.
* ఇక నచ్చిన ప్రదేశాల విషయానికొస్తే.. ఏమాత్రం ఖాళీ దొరికినా గోవా, లండన్, న్యూయార్క్, దుబాయ్‌కి చెక్కేస్తానని చెబుతోంది.
|
ప్రస్తుతం లాక్డౌన్లో ఇంటికి పరిమితమైనప్పటికీ తన ఫిట్నెస్ వీడియోలు, తాను లావుగా ఉన్నప్పటి జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ తన అభిమానుల్లో స్ఫూర్తి నింపుతోందీ చిన్నది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘లవ్ ఆజ్ కల్’లో మెరిసిన ఈ ఖాన్ బ్యూటీ.. ప్రస్తుతం వరుణ్ ధావన్ సరసన ‘కూలీ నం.1’తో పాటు అక్షయ్ కుమార్-ధనుష్‌లతో కలిసి ‘ఆత్రంగి’ సినిమాల్లో కనిపించనుంది.