చాలామంది ఐటీ ఉద్యోగినులు ప్రస్తుతం ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఆఫీసులో అయితే అన్ని సౌకర్యాలూ ఉంటాయి.. మరి ఇంట్లో అలా కాదుగా! మన వీలుని బట్టి కూర్చుంటాం. నిటారుగా కూర్చోకుండా కాస్త ఒంగి పనిచేయడం వల్ల త్వరగా అలసిపోతుంటాం. దానికితోడు తలనొప్పి, మెడనొప్పి, నడుంనొప్పి, కాళ్లనొప్పులూ బాధిస్తాయి. అలా కాకుండా ఉండాలంటే.. ఈ వ్యాయామాలు చేసి చూడండి...
భుజాల నొప్పి రాకుండా..

కుర్చీలో కూర్చుని కుడికాలిని ఎడమ మోకాలి మీద పెట్టాలి. కుడిచేత్తో కుడి మోకాలును, ఎడమచేత్తో కుడి పాదం వేళ్లను పట్టుకుని మెల్లగా శ్వాస వదులుతూ కొంచెం వంగి, ముందుకు చూస్తుండాలి. పది నుంచి ఇరవై సెకన్లు ఇలా ఉండాలి. మళ్లీ శ్వాస తీసుకుంటూ మెల్లగా పైకి లేవాలి. కుడి కాలితో చేసిన తర్వాత ఎడమ కాలితో చేయాలి. ఆఫీస్ పని మధ్యలో చేయొచ్చు లేదా ఉదయం, సాయంత్రం చేయొచ్చు.
ప్రయోజనాలు: కాలి కండరాలు వ్యాకోచిస్తాయి. కాళ్లు, భుజాల నొప్పులు రావు.
బరువు పెరగకుండా..

రెండు చేతులను వెనక నుంచి కుర్చీ మీద ఆనించి.. కదలకుండా పట్టుకోవాలి. మెల్లగా కుర్చీ ఎత్తు కన్నా కిందికి రావాలి. మళ్లీ పైకి రావాలి తిరిగి కిందికి వెళ్లాలి. కుర్చీ మీద బరువు సమంగా పడేలా చూసుకోవాలి. ఇలా పది నుంచి ఇరవైసార్లు చేయాలి.
ప్రయోజనాలు: వెన్నెముక కింది భాగం, మోకాలి కండరాలు బలోపేతమవుతాయి. ఎక్కువసేపు కూర్చుని పనిచేసే వాళ్లు బరువు పెరగకుండా ఉంటారు.
అలసట రాకుండా..

కుర్చీలో వెన్నెముక నిటారుగా పెట్టి కూర్చోవాలి. పాదాలను నేల మీద ఆనించి కాళ్లు కదలకుండా ఉండాలి. నడము, భుజాలను మాత్రమే పక్కకు తిప్పాలి. చేత్తో కుర్చీ వెనక భాగాన్ని పట్టుకోవాలి. పక్కకు తిరిగినప్పుడు అర నిమిషం అదే స్థితిలో ఉండాలి. తర్వాత శ్వాస తీసుకుంటూ యథాస్థితికి వచ్చేయాలి. కుడివైపు ఒకసారి, ఎడమవైపు ఒకసారి.. ఇలా ఆరుసార్లు చేయాలి.
ప్రయోజనాలు: నడుము, భుజాల నొప్పులు ఉన్నవాళ్లు తప్పకుండా ఈ వ్యాయామాన్ని చేయాలి. దీని వల్ల అలసట లేకుండా రోజంతా ఉత్సాహంగా ఉంటారు.
వెన్నునొప్పి లేకుండా..

కుర్చీలో నిటారుగా కూర్చుని కుడికాలిని నెమ్మదిగా పైకి లేపి కిందపెట్టాలి. మళ్లీ ఎడమకాలిని నిటారుగా పైకి లేపి కింద పెట్టాలి. ఇలా మార్చిమార్చి ఆరు నుంచి పదిసార్లు చేయాలి. కావాలంటే కాలు పైకి లేపినప్పుడు చేతులను ముందుకు చాచి పెట్టవచ్చు.
ప్రయోజనాలు: మెడ కండరాలు, కాళ్ల కండరాలు బలోపేతం అవుతాయి. నడుము నొప్పి, వెన్నునొప్పి తగ్గుతాయి.
- అరుణ, యోగా నిపుణులు