సిరి.. హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఉదయం హాస్టల్లోనే టిఫిన్ చేసి, లంచ్ బాక్స్ కట్టుకొని వెళ్లడం, తిరిగి రాత్రి హాస్టల్‌కి చేరుకొని డిన్నర్ చేసి పడుకోవడం.. ఇదీ ఆమె దినచర్య. కానీ ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా సొంతూరికి వచ్చిన సిరి ఇంటి నుంచే ఆఫీసు పని చేస్తోంది. ఎప్పుడో రెండు నెలలకోసారి వచ్చి.. రెండు రోజులుండి వెళ్లిపోయే తన కూతురు.. ఇప్పుడు ఇన్ని రోజులు ఇంట్లోనే ఉండడంతో తల్లి రకరకాల వంటకాలు చేసి పెడుతోంది. దీంతో ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు అటు పనిచేస్తూనే.. ఇటు ఏదో ఒకటి తింటూనే ఉంది. దీంతో ఒక్కసారిగా బరువు పెరిగింది సిరి..
సుగుణ ఒక గృహిణి.. లాక్‌డౌన్‌కు ముందు ఎప్పుడో పండగలకు తప్ప పెద్దగా పిండి వంటలు చేసి ఎరగదు. కానీ ఇప్పుడు లాక్డౌన్ కారణంగా వ్యాపార రీత్యా బయటికి వెళ్లాల్సిన భర్త, స్కూల్‌కు వెళ్లాల్సిన పిల్లలు ఇంట్లోనే ఉండడంతో రకరకాల పిండి వంటలు, స్నాక్స్ తయారు చేస్తోంది. అంతేకాదు.. అటు ఏదో ఒక పనిచేస్తూ లేదంటే ఇటు టీవీ చూస్తూనే వాటిని లాగించేస్తోంది. ఇంకేముంది.. నాజూగ్గా ఉండే సుగుణ కాస్తా ఈ నెల రోజుల వ్యవధిలోనే కాస్త బొద్దుగా తయారైంది.
ఇది కేవలం వీరిద్దరి సమస్యే కాదు.. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ఇళ్లకు పరిమితమైన వారిలో చాలామంది ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ నెల రోజుల లాక్డౌన్ పిరియడ్‌లో చాలామంది ఆహారపుటలవాట్లు మారిపోయాయి. ఇంట్లో ఉంటూ ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ, వ్యాయామం చేయడానికి బద్ధకిస్తూ విపరీతంగా బరువు పెరిగిపోతున్నారు. కాబట్టి ఇకనైనా ఈ విషయాన్ని గ్రహించి అతిగా తినే అలవాటును మానుకోవడం ఉత్తమం. మరి, అదెలా సాధ్యమో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్లాన్ ప్రకారమే..!
ఎటు తిరిగి ఇంట్లోనే ఉన్నాం కదా అని ఎప్పుడు పడితే అప్పుడు అదే పనిగా తినే అలవాటును మానుకోండి. తినడానికి కూడా ప్రత్యేకంగా ఓ ప్రణాళికను పెట్టుకోండి. ఇక వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నాం కదా అని ల్యాప్‌టాప్ పక్కనే మీకు నచ్చిన ఆహార పదార్థాలు పెట్టుకొని కూర్చుంటే మనకు తెలియకుండానే ఎక్కువగా తినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉదయం చేసే బ్రేక్‌ఫాస్ట్ దగ్గర్నుంచి రాత్రి తినే భోజనం దాకా నిర్ణీత సమయంలో తినేలా ప్లాన్ చేసుకోండి. లేదంటే మీరు ఆఫీసుకు వెళ్లేటప్పుడు ఎలాంటి టైమ్ టేబుల్ ఫాలో అయ్యే వారో ఇప్పుడూ అదే ఫాలో కావచ్చు. తద్వారా ఆకలై ఏది పడితే అది తినే అవకాశం ఉండదు. భోజనానికి, భోజనానికి మధ్య నట్స్, డ్రైఫ్రూట్స్, పండ్ల ముక్కలు.. వంటివి తీసుకుంటే అటు ఆరోగ్యంతో పాటు ఇటు అనారోగ్యకరమైన చిరుతిండ్లను దూరం పెట్టచ్చు. ఫలితంగా అతిగా తినే అలవాటుకు స్వస్తి పలకచ్చు.

ధ్యానం చేయండి..
మెడిటేషన్‌కు, తిండికి సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారు కదూ! మనిషి ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎక్కువగా తింటాడని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా మనల్ని మనమే ఇంట్లో బంధించుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. అలాగే ఈ క్రమంలో చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు కూడా! మరి, ఈ సమస్యను తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలంటే ఉదయం లేవగానే ఓ అరగంట పాటు ధ్యానం చేయాలి. అలాగే మరో అరగంట పాటు చిన్న పాటి వ్యాయామాలు చేస్తే శరీరం కూడా చురుగ్గా ఉంటుంది. ఈ రెండింటి ఫలితంగా ఒత్తిడి తగ్గి ఎక్కువగా తినాలన్న కోరికకు చెక్ పెట్టచ్చు.

ప్రత్యామ్నాయంగా పానీయాలు..
అతిగా తినే అలవాటుకు చెక్ పెట్టాలంటే ఆహారం తీసుకునే ముందు ఓ గ్లాసు మంచి నీళ్లు తాగమని సలహా ఇస్తుంటారు నిపుణులు. ఎందుకంటే నీళ్లు తాగడం వల్ల పొట్ట కాస్త నిండినట్లుగా అనిపిస్తుంది. తద్వారా మనం ఆహారాన్ని మితంగా తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు వేసవి కాలం కాబట్టి మధ్యమధ్యలో నీళ్లతో పాటు పండ్ల రసాలు, నిమ్మకాయ షర్బత్, మజ్జిగ.. వంటివి తీసుకుంటే పొట్ట నిండినట్లుగా ఉంటుంది.. వీటిలోని పోషకాలు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే వేసవిలో మనమంతా ఎదుర్కొనే డీహైడ్రేషన్ సమస్య నుంచి కూడా బయటపడచ్చు. అయితే మనం తాగే నీళ్లైనా, పండ్ల రసాలు తయారుచేసుకోవడానికి ఉపయోగించే మంచి నీళ్లైనా ఫ్రిజ్‌లో పెట్టినవి కాకుండా గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటిని మాత్రమే తీసుకోవాలి. వీలైతే కాచి చల్లార్చిన నీళ్లైతే మరీ మంచిది.

పొట్ట నింపే ప్రొటీన్..!
సాధారణంగా ఖాళీగా ఉన్నప్పుడు ఆకలేసినా, వేయకపోయినా ఏదో ఒకటి తినాలనిపిస్తుంటుంది. అలాంటి ఆహారపు కోరికలకు చెక్ పెట్టాలంటే మీరు తీసుకునే మెనూలో ప్రొటీన్లు అధికంగా ఉండే పదార్థాలను చేర్చుకోవాలి. పాలు, కోడిగుడ్లు, పప్పులు, బఠానీ, బీన్స్.. వంటివి తీసుకోవాలి. ఇవి జీర్ణం కావడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి పదే పదే ఆకలేయకుండా ఉంటుంది. అలాగే ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు..
బరువు అదుపులో ఉంచుకోవడానికైనా, అతి ఆకలిని తగ్గించాలన్నా.. తక్కువ ఆహారం ఎక్కువసార్లు తినమని సలహా ఇస్తుంటారు నిపుణులు. ఇలా మనం తీసుకునే ఆహార పదార్థాలను ఒక్కసారిగా ఎక్కువ మొత్తంలో కాకుండా ఒక్కో పదార్థాన్ని రెండు భాగాలుగా విభజించుకొని రెండు మూడు గంటల వ్యవధిలో తీసుకునేలా ప్లాన్ చేసుకోవాలి. తద్వారా పదే పదే ఆకలి వేయకుండా ఉంటుంది. ఏది పడితే అది తిని అతిగా బరువు పెరుగుతామన్న భయం కూడా ఉండదు. పైగా ఇలా కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు తినడం వల్ల మనం తీసుకున్న ఆహారంలోని పోషకాలు శరీరానికి చక్కగా అందుతాయి. ఇది ఆరోగ్యదాయకం కూడా!

మనసును పని మీదకు మళ్లించండి..
‘హమ్మయ్య.. లాక్డౌన్ పుణ్యమాని కొన్ని రోజులు సెలవులొచ్చాయి.. విశ్రాంతి తీసుకోవాలి..’ అనుకుంటుంటారు కొంతమంది అమ్మాయిలు. ఇలా ఏ పనీ లేకపోయినా, రోజంతా ఖాళీగా కూర్చున్నా అతిగా ఆకలేస్తుంటుంది. ఇంకేముంది చేతికి దొరికిందల్లా తిని లావైపోవడం తప్ప మరే ప్రయోజనం ఉండదు. కాబట్టి రోజంతా టీవీ చూస్తూనో, లేదంటే పడుకొనో ఉండకపోతే అమ్మకు కాస్త పనిలో సహాయం చేయడం, వంట పనిలో సహకరించడం, ఇంటిని సర్దడం.. వంటి చిన్న పాటి పనులు చేసినా తిండి మీదకు దృష్టి మళ్లదు. తద్వారా అతిగా తినే అలవాటుకు స్వస్తి పలకచ్చు. పైగా ఇలా ఏదో ఒక పని చేయడం వల్ల ఫిట్‌గానూ ఉండచ్చు.
చూశారుగా.. సింపుల్ టిప్స్‌తోనే అతిగా తినే అలవాటును ఎలా దూరం చేసుకోవచ్చో! కాబట్టి ఈ లాక్డౌన్ సమయంలో వీటిని పాటిస్తూ అతిగా తినే అలవాటుకు చెక్ పెడదాం.. మితంగా తింటూ, వ్యాయామాలు చేస్తూ ఫిట్‌గా ఉందాం.. ఏమంటారు?