
మనం బాగా లావుగా ఉన్నప్పటి ఫొటోను ఇప్పుడు చూసుకుంటే ‘అమ్మో! అప్పుడు ఎంత లావున్నానో.. ఈ ఫొటోలో నన్ను నేను చూసుకుంటుంటే అదోలా అనిపిస్తుంది.. థ్యాంక్ గాడ్.. ఇప్పటికైనా సన్నబడ్డాను..’ అంటూ మనల్ని మనం తక్కువ చేసి మాట్లాడుకోవడం సహజమే. అయితే తాను మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధం అంటోంది బాలీవుడ్ బబ్లీ బ్యూటీ జరీన్ ఖాన్. చదువుకునే రోజుల్లో దాదాపు వంద కిలోల బరువుండే ఆమె.. సినిమాల్లోకి వచ్చాక సగానికి సగం బరువు తగ్గింది. ఇప్పటికీ తాను లావుగా ఉన్నప్పటి ఫొటోల్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ‘నేను లావుగా ఉన్న ఈ ఫొటోల్ని చూస్తుంటే నాకెంతో గర్వంగా అనిపిస్తోంది.. అయినా నా శరీరం నా ఇష్టం.. నా శరీరాకృతి గురించి ఇతరులు ఏమనుకుంటే నాకేంటి?’ అంటూ తనలోని ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తుంటుందీ ముద్దుగుమ్మ.

‘వీర్’ సినిమాతో బాలీవుడ్‌లోకి ప్రవేశించిన ఈ బొద్దుగుమ్మ.. ‘రెడీ’, ‘హౌస్‌ఫుల్ 2’, ‘హేట్‌స్టోరీ 3’, ‘అక్సర్ 2’.. వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. అంతేకాదు.. గోపీచంద్ హీరోగా తెరకెక్కిన ‘చాణక్య’లోనూ ఓ కీలకపాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ ముంబై భామ.. ప్రస్తుతం ‘హమ్ భీ అకేలే తుమ్ భీ అకేలే’ సినిమాలో నటిస్తోంది. ఇలా ఓవైపు తన నటనతో అలరిస్తూనే.. మరోవైపు అధిక బరువు, శరీరాకృతి.. వంటి అంశాలపై సోషల్ మీడియా పోస్టుల రూపంలో అందరిలో స్ఫూర్తి నింపుతోందీ లవ్లీ లేడీ. ఇంతకీ ఒకప్పుడు వంద కిలోల బరువున్న జరీన్.. ఇప్పుడు స్వీట్ 60గా ఎలా మారిందో తన మాటల్లోనే తెలుసుకుందాం రండి..
హాయ్ లేడీస్.. నేను మీ జరీన్ ఖాన్ని. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే సూపర్బ్‌గా ఉన్నా.. చాలా రోజుల నుంచి తెలుగులో నటించాలన్న కోరిక ఉండేది. అది గతేడాది ‘చాణక్య’తో తీరిపోయింది. అందులో ఏజెంట్ జుబేదాగా నటించిన నేను ఇప్పటికీ మీ అందరికీ గుర్తుండే ఉంటాను. ప్రస్తుతం బాలీవుడ్లో ఒక సినిమాలో నటిస్తూ కాస్త బిజీగా ఉన్నా.. అప్పుడప్పుడూ ఇలా మీతో మాట్లాడేందుకు సమయం చిక్కుతోంది. అందుకే ఇలా మీ ముందుకొచ్చా. ఈ క్రమంలోనే నా అధిక బరువు, వెయిట్ లాస్ గురించి మీతో కొన్ని విషయాలు పంచుకోబోతున్నా..!
డాక్టర్ అవ్వాలనుకున్నా.. కానీ!
అధిక బరువు.. మహిళలంతా పెద్ద సమస్యగా భావించే అంశాల్లో ఇదొకటి. ఎవరైనా కాస్త లావుగా ఉన్నారంటే చాలు.. చాలామంది వారిని అదోలా చూస్తుంటారు.. నవ్వుకుంటారు.. హేళన చేస్తుంటారు. ఇలా తమ శరీరాకృతి గురించి ఇతరులు చేసిన విమర్శల్ని పట్టించుకొని బాధపడడం, తమ శరీరాన్ని తామే అసహ్యించుకోవడం.. వంటివి చేసే వారు మనలో చాలామందే! ఇలాంటి విమర్శల్ని టీనేజ్‌లో ఉన్నప్పుడు నేనూ ఎదుర్కొన్నా. పాఠశాలలో చదువుకునే రోజుల్లో అంటే అప్పుడు నేను తొమ్మిదో తరగతిలో ఉన్నాననుకుంటా.. ఆ సమయంలో నేను బాగా లావుండేదాన్ని. దాదాపు 100 కిలోల దాకా బరువున్నా. ఇక 12వ తరగతి పరీక్షలు పూర్తయ్యే సరికి కూడా ఏమాత్రం బరువు తగ్గలేదు. నా ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు నేను ఎక్కువగా బరువు పెరిగిపోతున్నానని చెప్పినా అప్పుడు నేను పట్టించుకునేదాన్ని కాదు.. ఆ సమయంలో నా మదిలో మెదిలిన ఆలోచన ఒక్కటే.. చక్కగా చదువుకొని డాక్టర్నవ్వాలని! ఈ క్రమంలో నా శరీరం, అందం.. వంటి విషయాలేవీ నేను పట్టించుకోలేదు. ఎందుకంటే ఈ వృత్తికి అందం, చక్కటి శరీరాకృతితో సంబంధం లేదు అనేది నా భావన. కానీ కాలక్రమేణా నా ఆశ నెరవేరలేదు.. డాక్టర్ని కాలేకపోయా. ఆ సమయంలోనే మోడలింగ్‌ని కెరీర్‌గా ఎంచుకున్నా.

అలా తగ్గడం మొదలెట్టా!
మోడలింగ్నైతే కెరీర్‌గా ఎంచుకున్నా.. కానీ అందుకోసం బరువు తగ్గాల్సి వచ్చింది. నా చుట్టూ ఉన్న వారు నా శరీరాకృతి, అధిక బరువు గురించి విమర్శించినా ‘ఇది నా జీవితం.. నా శరీరం.. నా ఇష్టం.. నేనెలా ఉండాలో నిర్ణయించుకునే హక్కు నాకుంది.. ఇతరులకు కాదు..!’ అంటూ ముక్కుసూటిగా ఉండేదాన్ని. ఇతరుల కామెంట్స్‌ని పట్టించుకోకపోయేదాన్ని. అయితే అప్పటిదాకా బరువు తగ్గాలనే ఆలోచన లేని నాకు.. ఒక రోజు.. ‘నేను కాస్త బరువు తగ్గితే ఎలా ఉంటుంది.. ఓసారి ట్రై చేస్తే పోలా..!’ అనిపించింది. అలా నా బరువు తగ్గే ప్రక్రియ ప్రారంభమైంది.

చక్కటి ఆహార నియమాలు పాటిస్తూ, వ్యాయామాలు చేస్తూ ముందుకు సాగాను.. రోజులు గడుస్తున్న కొద్దీ నన్ను నేను అద్దంలో చూసుకుని ఆశ్చర్యపోయేదాన్ని. బరువు తగ్గి నాజూగ్గా మారడం గమనించిన నాకు ఇంకా ఇంకా తగ్గాలనిపించేది. నాజూగ్గా మారుతోన్న నా శరీరాన్ని చూస్తుంటే ఎంతో ముచ్చటగా అనిపించేది. నాకు నేనే ఓ కొత్త వ్యక్తిలా కనిపించేదాన్ని. ఇలా దాదాపు 43 కిలోల బరువు తగ్గా.. అంటే అప్పటిదాకా వంద కిలోలున్న నేను కొన్ని నెలల్లోనే 57 కిలోలకు చేరుకున్నా. బొద్దుగుమ్మగా ఉన్న నేను ముద్దుగుమ్మగా మారి మోడలింగ్‌లో కొనసాగుతుండగానే నాకు ‘వీర్’ సినిమాలో తొలి అవకాశం దక్కింది. అందులో కాస్త బొద్దుగానే కనిపించినప్పటికీ.. ఆ తర్వాత ‘రెడీ’లో ఓ ప్రత్యేక గీతంలో నర్తించిన నన్ను, నా నాజూకైన శరీరాకృతిని చూసి విమర్శించిన నోళ్లే తెగ పొగిడేశాయి. అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే సరికే స్లిమ్మీ బ్యూటీగా తయారయ్యా.
డైటింగ్‌కి నేను విరుద్ధం!
టీనేజ్‌లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్‌తో కలిసి బయటికెళ్లడం, ఏది పడితే అది తినడం, జంక్‌ఫుడ్ అంటే తెగ ఇష్టపడిపోవడం కామన్. నా విషయంలో ఇలానే జరిగింది. అయితే బరువు తగ్గే క్రమంలో మాత్రం జంక్‌ఫుడ్, స్వీట్లకు పూర్తి దూరంగా ఉన్నా. అలాగే బరువు తగ్గాలని నిర్ణయించుకున్న చాలామంది డైటింగ్ చేస్తుంటారు. నేనైతే ఆ కాన్సెప్ట్‌కి పూర్తి విరుద్ధం. రోజూ ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడమే నా ఫిట్నెస్కి ఓ కారణంగా చెబుతా. ఈ క్రమంలోనే నా డైట్ రొటీన్‌ని నాలుగు భాగాలుగా విభజించుకున్నా.
* బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా రెండు కోడిగుడ్లలోని తెల్లసొనలు, బ్రౌన్ బ్రెడ్ టోస్ట్, తాజా పండ్లు, మొలకెత్తిన గింజలు.. వంటివి తీసుకుంటా.
* బ్రౌన్ రైస్, గ్రిల్డ్ చికెన్, తక్కువ నూనెలో వేయించిన కూరగాయల ముక్కలు.. నేను మధ్యాహ్న భోజనం కోసం తీసుకునే ఆహార పదార్థాలు. రాత్రి భోజనంలో కూడా ఇవే ఆహార పదార్థాల్ని తీసుకోవడం నాకు అలవాటు.
* ఇక సాయంత్రం స్నాక్స్ కోసం.. కొబ్బరి నీళ్లు, మొలకెత్తిన గింజలు, సూప్స్.. వంటివి తీసుకుంటా.
* ఇక వీటితో పాటు నా శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండడానికి ఎక్కువ మొత్తంలో నీళ్లు, పండ్ల రసాలు, కాయగూరలతో చేసిన రసాలు.. వంటివి తీసుకుంటా.
* ఇక వీటన్నింటితో పాటు రోజూ ఉదయం లేవగానే పరగడుపున లీటర్ నీళ్లు తాగడం నాకు అలవాటు. ఇలా చేయడం వల్ల శరీరంలోని విషపదార్థాలన్నీ బయటికి వెళ్లిపోతాయి. ఇది ఆరోగ్యదాయకం కూడా!
|
పిలాట్స్తో వర్కవుట్ షురూ!

నేను నాజూగ్గా మారే క్రమంలో తీసుకున్న ఆహారం పాత్ర ఎంత ఉందో.. చేసిన వ్యాయామాల పాత్రా అంతే ఉంది. రోజూ ఉదయాన్నే గంటపాటు పిలాట్స్తో నా వర్కవుట్ రొటీన్ ప్రారంభమవుతుంది. ఇక బరువులెత్తే వ్యాయామాలు వారానికి మూడురోజులు చేయడం నాకు అలవాటు. వీటితోపాటు స్విమ్మింగ్, జాగింగ్, నడక.. వంటివి రోజూ ప్రాక్టీస్ చేస్తా. రోజూ ఒకేరకమైన వ్యాయామాలు చేస్తే బోరింగ్‌గా అనిపిస్తుందనేది నా భావన. అందుకే వివిధ రకాల ఎక్సర్‌సైజుల్ని నా ఫిట్నెస్ రొటీన్లో భాగం చేసుకుంటా. ఈ క్రమంలో నా జిమ్ ఇన్స్ట్రక్టర్ యాస్మిన్‌కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే పిలాట్స్, వెయిట్ ట్రైనింగ్, కార్డియో.. వంటి కఠినతరమైన వ్యాయామాల్ని ఎంతో సులభంగా చేసేలా నాకు శిక్షణనందించారామె. ఇక వీటితో పాటు రెండేళ్ల క్రితం యోగా కూడా నా ఫిట్‌నెస్‌లో భాగం చేసుకున్నా. యోగాతో నా జీవితంలో కొత్త ఉత్సాహం నిండిన ఫీలింగ్ నాకు కలుగుతోంది. అందుకే షూటింగ్‌తో బిజీగా ఉన్నా, హోటల్ రూమ్‌లో ఉన్నా, ఎక్కడికైనా వెళ్లినా.. యోగాను మాత్రం మిస్సవ్వట్లేదు.
|
అవి స్ట్రెచ్ మార్క్స్ కాదు.. పులి చారలు!

గతంలో లావుగా ఉన్న ఫొటోల్ని చూస్తూ చాలామంది ఆత్మన్యూనతకు గురవుతుంటారు. అప్పుడు అలా ఎందుకున్నామంటూ తమను తామే నిందించుకుంటారు. కానీ నేను మాత్రం నా స్కూలింగ్, కాలేజ్ డేస్‌లో బొద్దుగా ఉన్నప్పటి ఫొటోల్ని చూసి గర్వపడుతుంటా. అయినా మనల్ని మనం ప్రేమించుకోవాలి.. కానీ మన శరీరం విషయంలో ఇతరుల అభిప్రాయాలు మనకెందుకు? కేవలం ఇదొక్క విషయంలోనే కాదు.. నేను సగానికి సగం బరువు తగ్గాక నా శరీరంపై స్ట్రెచ్ మార్క్స్ కూడా స్పష్టంగా కనిపించేవి. అలాగని నేను వాటిని చూసి సిగ్గుపడలేదు.. పైగా వాటిని ఆడపులి శరీరంపై ఉండే చారల్లా భావించి గర్వపడేదాన్ని. నేనే కాదు.. ప్రతి మహిళా తమ అధిక బరువు గురించి ఇతరుల మాటలు పట్టించుకోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. ఎవరి శరీరాన్ని వారు ప్రేమించుకోవాలి. అలా చేసినప్పుడే మనలో పాజిటివిటీ పెరుగుతుంది. అదే అటు శారీరక, ఇటు మానసిక ఆరోగ్యానికి కారణమవుతుంది. అందరూ ఈ విషయం గుర్తుపెట్టుకుంటారనుకుంటున్నా..
|
కాబట్టి అధిక బరువున్నామని మీలో మీరే కుమిలిపోకుండా.. త్వరగా బరువు తగ్గాలని ఆతృత పడకుండా.. మీ శరీర ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నిపుణుల సలహా మేరకే బరువు తగ్గడం ఉత్తమం. ఈ క్రమంలో మీరు కూడా మీ చుట్టూ ఉండే వారికి సాయం చేయండి.. వారికి ఆదర్శంగా నిలవండి.. సరేనా.. ఉంటాను మరి.. త్వరలోనే ఏదైనా తెలుగు చిత్రంతో మళ్లీ మిమ్మల్ని పలకరించే అవకాశం రావాలని ఆశిస్తున్నా.. బై.. బై..!!
గమనిక: ‘చిన్నారి పెళ్లికూతురు’గా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమై.. ఇప్పుడు వెండితెరపై నటిగా ప్రశంసలందుకుంటోన్న బబ్లీ బ్యూటీ అవికా గోర్ వెయిట్ లాస్ సీక్రెట్సేంటో తెలుసుకోవాలంటే ‘ఫ్యాట్ టు ఫిట్’ శీర్షికలో జనవరి 23న ప్రచురితమయ్యే ప్రత్యేక వ్యాసం చదవండి.