
కాలేజీ రోజుల్లో తరచూ ఫ్రెండ్స్‌తో కలిసి బయటికి వెళ్లడం, ముందు-వెనకా ఆలోచించకుండా నచ్చిన ఆహారం తినేయడం, తద్వారా బరువు పెరగడం.. ఈ అనుభవాలన్నీ మనలో చాలామందికి ఎదురయ్యే ఉంటాయి. కేవలం మీకే కాదు.. మీతో పాటు నాకూ ఇలాంటి బోలెడన్ని జ్ఞాపకాలున్నాయంటోంది ముంబయి మిల్కీ బ్యూటీ హన్సిక మోత్వాని. చిన్నతనం నుంచి ఎంతో ముద్దుగా, కాస్త బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ.. పెద్దయ్యాక ఫ్రెండ్స్‌తో కలిసి బయటికి వెళ్లినప్పుడల్లా ఏదో ఒక చిరుతిండి తినడానికే ఇష్టపడేదాన్నని, ఈ అలవాటే ఆ సమయంలో తనను కాస్త బబ్లీగా కనిపించేలా చేసిందని అంటోంది. పలు బాలీవుడ్ సినిమాల్లో బాలనటిగా మెప్పించిన హన్సిక.. తెలుగులో ‘దేశముదురు’ సినిమాతో వెండితెరపై హీరోయిన్గా తొలిసారి మెరిసింది. ఆపై ‘కంత్రి’, ‘మస్కా’, ‘బిల్లా’, ‘కందిరీగ’.. వంటి చిత్రాల్లో నటించి తెలుగులో టాప్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు సంపాదించింది. హీరోయిన్గా మనకు పరిచయం కాకముందు కాస్త చబ్బీగా ఉండే ఈ ముద్దుగుమ్మ.. ఇక తెర ముందుకొచ్చాక మాత్రం తన ఫిజిక్‌ను ఫిట్‌గా ఉంచుకుంటూ.. సక్సెస్‌ఫుల్‌గా ముందుకు దూసుకుపోతోంది. ఇలా తాను ఇంత ఫిట్‌గా, నాజూగ్గా ఉండడం వెనుక తాను పాటించే కఠినమైన డైట్, వ్యాయామ నియమాల పాత్ర ఎంతో ఉందంటోందీ మిల్కీ గర్ల్. మరి, చక్కటి శరీరాకృతితో నేటి తరం అమ్మాయిలకు ఫిట్నెస్ పాఠాలు నేర్పుతోన్న ఈ ముంబయి బ్యూటీ ‘ఫ్యాట్ టు ఫిట్’ జర్నీ ఏంటో తన మాటల్లోనే వినేద్దాం రండి..

హాయ్ ఫ్రెండ్స్.. నేనండీ.. ‘దేశముదురు’ సినిమాతో వైశాలిగా మీ అందరినీ పలకరించి మీకు దగ్గరైన మీ హన్సికను. ఈ మధ్య తమిళ సినిమాలతో బాగా బిజీగా ఉన్నప్పటికీ.. అప్పుడప్పుడూ తెలుగు సినిమాలతో మిమ్మల్ని పలకరించే అవకాశం వస్తే మాత్రం అస్సలు వదలట్లేదు. అది సరే కానీ.. ఈ మధ్య మహిళల అధిక బరువు గురించి సోషల్ మీడియాలో ట్రోల్స్ బాగా వినిపిస్తున్నాయి. ఇలా ఎవరో అన్న విషయాల్ని పట్టించుకొని అమ్మాయిలు కూడా ఆత్మన్యూనతా భావానికి గురవుతున్నారు. కాబట్టి అలా బాధపడాల్సిన అవసరం లేదనేది నా ఫీలింగ్.

ఎంత ఓపిక పడితే అంత ఫలితం!
అలాగే అధిక బరువుతో బాధపడుతోన్న మహిళలు, అమ్మాయిలు తాము బరువు తగ్గించుకొని నాజూగ్గా మారడానికి నానా ప్రయత్నాలూ చేయడం, తక్షణ ఫలితం లేకపోవడంతో తిరిగి ఒత్తిడిలోకి కూరుకుపోవడం.. వంటి సంఘటనలూ చాలానే విన్నాను. నేను వెళ్లిన చోట కూడా చాలామంది అమ్మాయిలు ‘మీలా ఫిట్‌గా మారదామని చాలా ప్రయత్నిస్తున్నాం.. కానీ మా వల్ల కావట్లేదు.. మీకిది ఎలా సాధ్యమైంది?’ అంటూ అడుగుతుంటారు. సోషల్ మీడియా చాటింగుల్లోనూ నన్ను ఎక్కువమంది అడిగే ప్రశ్నల్లో ఇదొకటి. ఇలాంటి వారందరికీ నేను చెప్పదలచుకున్నది ఒక్కటే. బరువు తగ్గి నాజూగ్గా మారడమనేది ప్రతి ఒక్కరికీ సాధ్యమయ్యే పనే. అయితే అది అప్పటికప్పుడే జరిగిపోవాలనుకోవడం సరికాదు. అందుకు కొన్ని నెలల పాటు ఓపిక పట్టాలి. ఈ క్రమంలోనే చక్కటి డైట్, వ్యాయామ నియమాలు పాటించాలి. నచ్చిన ఆహారం తీసుకున్నా.. కఠినమైన వ్యాయామాలతో ఆ క్యాలరీలను కరిగించేలా కష్టపడేతత్వాన్ని అలవాటు చేసుకోవాలి. ఇలా బరువు తగ్గే విషయంలో ఎంతగా ఓపిక పడితే అంతగా మనం కోరుకున్న ఫలితం మన దరిచేరుతుంది. ఇది నా స్వీయానుభవం. నటిగా మీ ముందుకు రాకముందు నేను కూడా ఫ్రెండ్స్‌తో బయటికి వెళ్లి నాకు నచ్చిన ఫుడ్ లాగించేదాన్ని. నేను ముందు నుంచీ పెద్ద ఫుడీని! అలా అప్పుడు కాస్త చబ్బీగా ఉన్నప్పటికీ సినిమాల్లోకొచ్చాక మాత్రం ఫిట్‌నెస్‌పై పూర్తి దృష్టి పెట్టా. చక్కటి ఆహార, వ్యాయామ నియమాలతో నా శరీరాన్ని ఫిట్‌గా, నాజూగ్గా ఉంచుకుంటున్నా. ఆ సీక్రెట్సే ఇప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నా.
ఇంటి ఆహారమే ది బెస్ట్!
నాకు చిన్నతనం నుంచీ ఉదయాన్నే లేవడం అలవాటు. ఇలా ఒక టైమ్ ప్రకారం నిద్ర లేవడం వల్ల బ్రేక్‌ఫాస్ట్ దగ్గర్నుంచి రాత్రి భోజనం వరకు అన్నీ సరైన సమయంలో నా శరీరానికి అందుతాయి. ఇంట్లో ఉన్నా, సెట్లో ఉన్నా ఇంటి ఆహారానికే నా మొదటి ప్రాధాన్యం. నేను ఇంత ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండగలుగుతున్నానంటే అందుకు ఇదీ ఓ కారణమే. ఇలా నేను తీసుకునే ఆహారాన్ని తక్కువ మొత్తాల్లో ఎక్కువ సార్లు తీసుకోవడానికే మొగ్గుచూపుతా. ఈ క్రమంలో నేను పాటించే డైట్ ప్లాన్ ఉదయం లేవగానే తాగే నీళ్లతో మొదలవుతుంది.
* ఉదయాన్నే లేచీ లేవగానే రెండు గ్లాసుల నీళ్లు తాగుతా. ఆపై కప్పు గ్రీన్ టీ చక్కెర లేకుండా తీసుకుంటా.
* అల్పాహారం కోసం బౌల్ బొప్పాయి ముక్కలు తీసుకుంటా. ఇవి నేను చేయబోయే వ్యాయామానికి నాకు కావాల్సిన శక్తిని అందిస్తాయి.
* ఇక జిమ్ వర్కవుట్స్ పూర్తయిన తర్వాత మూడు కోడిగుడ్లలోని తెల్లసొనతో తయారుచేసిన ఆమ్లెట్, మల్టీగ్రెయిన్ టోస్ట్ తీసుకుంటా.

* ఉడికించిన కాయగూరల్ని మధ్యాహ్న భోజనంలో భాగం చేసుకుంటా. అంతే.. ఇదే లైట్‌గా ఉండే నా లంచ్ మెనూ.
* ఇక సాయంత్రం గ్రీన్ టీతో పాటు మల్టీగ్రెయిన్ బిస్కట్లు తీసుకోవడం నాకు అలవాటు.
* ఇక రాత్రి భోజనం ఆరు లేదా ఏడింటికల్లా ముగించేలా ప్లాన్ చేసుకుంటా. ఇందులో భాగంగా ఉడికించిన కాయగూరలు లేదా సలాడ్ తీసుకుంటా. ఆ తర్వాత మరే ఆహారం తీసుకోను.

* ఇలా ఆరు రోజుల పాటు కఠినమైన ఆహార నియమాలు పాటించే నేను ఆదివారం మాత్రం నా డైట్ రొటీన్‌కి కాస్త విరామమిచ్చి.. ఆ రోజును ఛీట్ డేగా మార్చుకుంటా. అలాగని ఆ రోజు మరీ హెవీగా ఉండే పదార్థాలేవీ తీసుకోను. నాకు నచ్చిన ఫుడ్ మితంగా తీసుకునేలా జాగ్రత్తపడతా.
* ఈ డైట్ రొటీన్‌తో పాటు రోజంతా ఎక్కువ మోతాదులో నీళ్లు తాగుతా. ఈ చిట్కానే నన్ను ఆరోగ్యంగా, ఫిట్‌గా, అందంగా ఉంచేందుకు దోహదం చేస్తుంది.
|
శరీరాన్ని ఎక్కువగా కష్టపెట్టను!

ఫిట్‌గా ఉండడానికి నేను తీసుకునే ఆహారం ఓ కారణమైతే.. పాటించే జిమ్ రొటీన్ మరో కారణమని చెబుతా. ఉదయం లేవగానే జాగింగ్‌తో నా వర్కవుట్ రొటీన్ ప్రారంభమవుతుంది. చాలామంది తమ ఇంటికి దగ్గర్లో ఉన్నా.. జిమ్‌కు వెళ్లడానికి బైక్ లేదా కారు ఉపయోగిస్తుంటారు. కానీ నేను మాత్రం రోజూ ఉదయాన్నే జాగ్ చేసుకుంటూ మా ఇంటికి దగ్గర్లోని జిమ్‌కు వెళ్లిపోతా. అక్కడ నా శరీరం తట్టుకొనే వ్యాయామాలు మాత్రమే సాధన చేస్తా.. అంతేతప్ప మరింత ఫిట్‌గా మారాలని నా శరీరాన్ని ఎక్కువగా కష్టపెట్టను. ఈ క్రమంలో స్పిన్నింగ్ వ్యాయామాలు, స్విమ్మింగ్.. వంటి వాటికీ ఒక్కోరోజు కేటాయిస్తా. ఇక నా ఫిట్నెస్ రొటీన్లో ఏ వర్కవుట్ ఉన్నా లేకపోయినా యోగా మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందే! ఇది నా శరీరాన్ని దృఢంగా చేయడానికి మాత్రమే కాదు.. నా మనసును రిలాక్స్డ్గా ఉంచడానికీ దోహదం చేస్తుంది.
|
డోంట్ వర్రీ.. బీ హ్యాపీ!

ఫిట్‌గా ఉండాలంటే డైట్, వర్కవుట్ నియమాలు మాత్రమే పాటిస్తే సరిపోదు.. నిత్యం ఆనందంగా ఉండడం కూడా ముఖ్యమే! అందుకు నేను నమ్మే సిద్ధాంతం ‘డోంట్ వర్రీ.. బీ హ్యాపీ!’ ఒక్కోసారి కొన్ని కొన్ని విషయాలు ఉదయాన్నే మనకు చికాకును కలిగిస్తుంటాయి. అలాగని వాటినే ఆలోచిస్తూ కూర్చుంటే ఎంతో విలువైన ఆ రోజంతా చికాకుతోనే గడిచిపోతుంది. అందుకే వాటిని పట్టించుకోకుండా కొత్త విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేస్తా. సో ఆ బిజీలో పడిపోయి అసలు సమస్యను మనం మర్చిపోయి హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది. రేపు ఏం జరుగుతుందోనన్న విషయం పక్కనపెట్టి ఈ రోజును ఎంత సమర్థంగా ఉపయోగించుకున్నాననే దానిపైనే నా పూర్తి దృష్టి ఉంటుంది. నా కెరీర్ సక్సెస్‌కి, నేను ప్రతి క్షణం ఆనందంగా ఉండడానికి నేను పాటించే ఈ సూత్రం ఎంతగానో దోహదం చేస్తుంది. ఇక నాకెంతో ఇష్టమైన ట్రావెలింగ్, కుటుంబంతో - ఫ్రెండ్స్‌తో గడపడం.. వంటి విషయాలతో ఎక్కువ రిలాక్సేషన్ నాకు లభిస్తుంది.
|
సో.. ఇవండీ నేను నిరంతరం ఫిట్‌గా ఉండేందుకు నాకు దోహదం చేస్తోన్న విషయాలు. మరి, మీరూ చక్కటి డైట్, ఫిట్నెస్ రొటీన్‌ను పాటిస్తూ.. నిత్యం హ్యాపీగా ఉండగలిగితే నాజూగ్గా మారడమనేది అంత పెద్ద కష్టం కాదు. కాబట్టి మీ డైటీషియన్, ఫిట్నెస్ నిపుణుల చిట్కాల్ని పాటిస్తూ సులభంగా మీ అధిక బరువును తగ్గించుకోండి.. ఆ చిట్కాల్ని మీ చుట్టూ ఉన్న మరో నలుగురికి పంచి.. ఫిట్‌నెస్‌పై వారిలోనూ అవగాహన పెంచండి.. ఉంటాను మరి.. బై బై!!
గమనిక: ‘అరుంధతి’, ‘దేవసేన’.. వంటి ప్రతిష్ఠాత్మక పాత్రలతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని నం.1 హీరోయిన్గా దూసుకుపోతోంది అందాల తార అనుష్కా శెట్టి. ‘సైజ్ జీరో’ సినిమా కోసం ఏకంగా 20 కిలోలు పెరిగిన అను.. ఆ వెంటనే మరో పాత్ర కోసం పెరిగిన బరువు తగ్గి తన అంకితభావాన్ని చాటుకుంది. ఇలా నేటి తరం అమ్మాయిలందరికీ ఫిట్నెస్ గురూగా మారిన అనుష్క వెయిట్ లాస్ సీక్రెట్సేంటో తెలుసుకోవాలంటే ‘ఫ్యాట్ టు ఫిట్’ శీర్షికలో జనవరి 2న ప్రచురితమయ్యే ప్రత్యేక వ్యాసం చదవండి.