‘అమ్మ’ అనే పిలుపు మన ప్రపంచాన్నే మార్చేస్తుంది. అంతేనా.. పాపాయి ఆలనా పాలనలో పడిపోయి, ఆ బోసి నవ్వులను ఆస్వాదిస్తూ మనం గడిపే ఆ క్షణాలు మాటలకు అందనివి. ప్రతి మహిళా పొందాలని పరితపించే వెలకట్టలేని అనుభూతి ఇది. ప్రస్తుతం ఇదే అనుభూతిని ఆస్వాదిస్తూ.. పూర్తి సమయాన్ని తన ఇద్దరు చిన్నారుల కోసం కేటాయిస్తూ ఆనందంగా గడుపుతోందీ బాలీవుడ్ మామ్ సమీరా రెడ్డి. మరోవైపు సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ.. ఎప్పటికప్పుడు బాడీ పాజిటివిటీ, బ్రెస్ట్ ఫీడింగ్, బాడీ షేమింగ్.. వంటి అంశాలపై పోస్టులు పెడుతూ.. ఎంతోమంది మహిళలకు ప్రేరణగా నిలుస్తోందీ బ్యూటిఫుల్ మామ్.. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్య్వూలో భాగంగా మాట్లాడుతూ.. తాను తొలిసారి తల్లయ్యాక డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని, ఎంతో మానసిక వేదనకు గురయ్యానని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. దాన్ని తాను ఎలా గుర్తించిందో, బయటపడడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుందో కూడా తెలియజేస్తూ మరోసారి తల్లులందరిలో స్ఫూర్తి నింపింది సమీర. మరి, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ గురించి ఈ బ్యూటిఫుల్ మామ్ పంచుకున్న అనుభవాలేంటో తన మాటల్లోనే విందాం రండి..

అప్పుడు 105కిలోలు పెరిగా!
‘#imperfectlyperfect అనే హ్యాష్‌ట్యాగ్ పేరుతో నేను సోషల్ మీడియాలో పెడుతోన్న పోస్టులు మీరు చూసే ఉంటారు. నా కొడుకు హన్స్ పుట్టాక నేను ఎదుర్కొన్న డిప్రెషన్ నుంచి పుట్టిన ఆలోచనే ఇది. వాడు కడుపులో పడ్డాక (నా మొదటి ప్రెగ్నెన్సీలో) నేను 105 కిలోల బరువు పెరిగాను. ‘సినిమాలు చేస్తున్నప్పుడు ఉన్న అందమైన శరీరాకృతిని కోల్పోయాను.. నా ముఖం పూర్తిగా మారిపోయింది.. నా సర్వస్వం కోల్పోయానే..’ అంటూ చాలా బాధపడ్డా. ఇక అందరూ నా శరీరం, బరువు గురించి నెగెటివ్‌గా మాట్లాడుకోవడం నన్ను మరింతగా కలచివేసేది.

డిప్రెషన్‌లో ఉన్నానని తెలుసుకోలేకపోయా!
ఇలా నాలో నేనే మథన పడుతున్నాననుకున్నాను కానీ డిప్రెషన్‌కి లోనవుతున్నానని నేను తెలుసుకోలేకపోయా. ప్రతిదానికీ ఎమోషనల్ అవడం, ముభావంగా ఉండడం, అంతా కోల్పోయానన్న ఫీలింగ్‌తో నా మనసంతా కకావికలమయ్యేది. అయితే ఇవన్నీ గర్భం దాల్చడం వల్లేనేమో అని సరిపెట్టుకున్నాను. కానీ బిడ్డ పుట్టాక కూడా నాలో నెగెటివ్ ఆలోచనలు ఎక్కువయ్యాయి. ఇలా ఎందుకు జరుగుతుందోనని ఆలోచిస్తుంటే అప్పుడర్థమైంది.. నేనేదో సమస్యతో బాధపడుతున్నానని! వెంటనే డాక్టర్‌ని సంప్రదించి నా సమస్య వివరించాను. నాకొస్తున్న ఆలోచనలు, నేను పడుతున్న బాధను తెలియజేశాను. దాంతో డాక్టర్ నేను ప్రసవానంతర డిప్రెషన్‌తో బాధపడుతున్నానని చెప్పారు. ఈ సమస్యను నయం చేసుకుని, ఇలా నా బాధ గురించి అందరి ముందూ మాట్లాడడానికి నాకు దాదాపు సంవత్సరం పట్టింది.

మనల్ని మనం అంగీకరించాలి!
ఈ క్రమంలో నేనేలా ఉన్నానో అలా నన్ను నేను అంగీకరించాలని నిర్ణయించుకున్నా. కానీ కొత్తగా తల్లైన వారిలో చాలామంది అలా చేయలేకపోతున్నారు. అగ్నికి ఆజ్యం తోడైనట్లు సోషల్‌మీడియాలో ఇతరులు పెట్టే కామెంట్స్ వారిని మరింతగా కుంగదీస్తున్నాయి. నేటి తరం అమ్మలందరూ ఇలాంటి సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడానికే నేను సోషల్‌మీడియా వేదికగా #imperfectlyperfect అనే ప్రచారాన్ని ప్రచారాన్ని మొదలుపెట్టా. ఈ వేదికగా బాడీ షేమింగ్, బాడీ పాజిటివిటీ, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్.. వంటి విషయాల గురించి అవగాహన కల్పిస్తున్నాను. అందమంటే నేను మీకు చెప్పదలచుకున్నది ఒక్కటే.. నాజూకైన శరీరాకృతి, చర్మ ఛాయ కాదు.. మనసు ప్రశాంతంగా, ఆనందంగా ఉండడమే అసలైన అందం.. అది మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫొటోలకూ వర్తిస్తుంది. ఎలా ఉన్నా మనల్ని మనం మనస్ఫూర్తిగా అంగీకరించడం ముఖ్యం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి.

నైరా కోసం పూర్తిగా సిద్ధపడ్డా!
ఇక రెండోసారి గర్భం దాల్చినప్పుడు నేను నా శరీరాకృతి పట్ల నా ఆలోచనా ధోరణిని పూర్తిగా మార్చుకున్నాను. నైరా పుట్టిన తర్వాత నేను చాలా బిజీ అయిపోయాను. నా బాబు హన్స్ పుట్టి అప్పటికే 4 ఏళ్లు కావడంతో ఈసారి ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ముందు నుంచే పూర్తిగా సిద్ధమయ్యాను. అంతేకాదు, ఈసారి నేను మౌనంగా ఉండాలనుకోలేదు. న్యూమామ్స్ డిప్రెషన్‌కి లోనుకాకుండా అవగాహన కల్పించాలనుకున్నా. అందులోని ఓ చిరు ప్రయత్నమే ఇది..’ అంటూ తన పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ గురించి చెప్పుకొచ్చింది సమీర.

అతి పెద్ద వైఫల్యం అదే!
కేవలం ఇప్పుడే కాదు.. గతంలో పలు సందర్భాల్లోనూ ప్రసవానంతర డిప్రెషన్ గురించి తన అనుభవాలను వివరిస్తూ నేటి తల్లుల్లో స్ఫూర్తి నింపిందీ లవ్లీ మామ్. ఈ నేపథ్యంలో సోషల్‌మీడియా వేదికగా తన ఫ్యాన్స్ కోసం నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్లో పాల్గొని అభిమానుల సందేహాలకు సమాధానాలిచ్చిందీ బబ్లీ బ్యూటీ. ఇందులో భాగంగా ఒకరు.. ‘మీ జీవితంలో అతిపెద్ద వైఫల్యం ఏంటి? దాన్ని మీరు ఎలా ఎదుర్కొన్నారు?’ అని అడగ్గా.. ‘మొదటి ప్రసవం తర్వాత నేను డిప్రెషన్‌కి లోనవడమే నా జీవితంలో నేనెదుర్కొన్న అతిపెద్ద వైఫల్యం. కనీసం దాన్ని నేను గుర్తించడానికే చాలా సమయం పట్టింది. ఆ సమయంలో నా శరీరాకృతిని నేను అంగీకరించలేకపోయా. సినిమాల వల్ల వచ్చిన నా ఇమేజ్ గురించే ఆలోచించాను.. అందరూ నా గురించి ఏమనుకుంటారో అన్న భావనతో నా బాధను నాలోనే అదుముకున్నాను. నేను దానికి చికిత్స తీసుకున్నాను. కానీ, మళ్లీ అలాంటిది నా జీవితంలో జరగనివ్వను’ అంటూ ఎంతో ధైర్యంగా తన సమస్య గురించి బహిర్గతం చేసింది సమీర.

మార్పు మంచిదే!
కేవలం తన సమస్య గురించి వివరించడమే కాదు.. మన శరీరంలో వచ్చిన ఎలాంటి మార్పునైనా పాజిటివిటీతో స్వాగతిస్తే మనసు ప్రశాంతంగా ఉండడంతో పాటు ఆ సమస్య నుంచి త్వరగా బయటపడచ్చంటోందీ సెలబ్రిటీ మామ్. ‘గర్భం ధరించినప్పుడు, ప్రసవానంతరం.. ఇలా కారణమేదైనా మనం బరువు పెరగడం సహజం. ఆ బరువు తగ్గించుకొని మనం తిరిగి మామూలు స్థితికి రావడానికి కాస్త సమయం పడుతుంది.. అయితే ఈ క్రమంలో మన శరీరంలో వచ్చిన మార్పులను మనం అంగీకరించాలి. మనలోని లోపాలను స్వీకరించి.. మనమేంటో ప్రపంచానికి తెలిసేలా చేయాలి. మిమ్మల్ని మీరు దాచుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. అవన్నీ పక్కన పెట్టి మీరెంత సంతోషంగా ఉన్నారో నిరూపించుకోండి..’ అంటూ పాజిటివిటీని ప్రచారం చేస్తూ అమ్మలందరికీ ప్రేరణగా నిలుస్తోందీ యమ్మీ మమ్మీ.
ఇటు ఇంటి పనిని.. అటు పిల్లల ఆలనా పాలనా చూసుకోవడం, మరోవైపు ఉద్యోగ బాధ్యతలతో క్షణం తీరిక లేకుండా గడిపే నేటి తల్లుల్లో చాలామంది ప్రసవానంతర డిప్రెషన్‌కి లోనవుతున్నారు. ఇలాంటి వారంతా సమీరలా తమను తాము అంగీకరించుకుంటూ, పనుల్ని బ్యాలన్స్ చేసుకుంటూ ముందుకు సాగితే అటు ఆరోగ్యంగా ఉండచ్చు.. ఇటు వారు కోరుకున్నట్లుగా తక్కువ సమయంలోనే తిరిగి పూర్వ స్థితికీ చేరుకోవచ్చు..