
సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా.. ఆ పేరును ఏమాత్రం వాడుకోకుండా బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది కపూర్ వారసురాలు సోనమ్ కపూర్. వెండితెరపై అద్భుతమైన అభినయానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఈ ముద్దుగుమ్మను చూసిన ప్రతిసారీ మనందరికీ గుర్తొచ్చేవి రెండే రెండు విషయాలు. ఒకటి తన ఆకట్టుకునే ఫ్యాషన్లు.. రెండోది తన నాజూకైన శరీరాకృతి. మరి, ఇంతటి ఫిట్టెస్ట్ ఫిజిక్‌ని సొంతం చేసుకోవడం అనేది తనకు ఒక్క రాత్రిలో సాధ్యమైన పని కాదని, అందుకు దాదాపు రెండేళ్లు కష్టపడ్డానని అంటోందీ బాలీవుడ్ అందం. చిన్నతనం నుంచీ పెద్ద ఫుడీ అయిన ఈ కపూర్ భామ.. పీసీవోఎస్ వల్లే అధికంగా బరువు పెరిగిపోయిందట. ఇక చదువు పూర్తి చేసుకొని సినిమాల్లోకి రావడానికి తనకు అడ్డుగా నిలిచిన ఈ అధిక బరువును తగ్గించుకునేందుకు కచ్చితమైన ఆహార నియమాలను పాటించడంతో పాటు కఠినమైన వర్కవుట్లు కూడా చేశానని, ప్రయత్నిస్తే ఇది అందరికీ సాధ్యమేనంటోందీ బాలీవుడ్ ఫ్యాషనిస్టా. మరి, సినిమాలకు రాకముందు 86 కిలోల బరువున్న ఈ కపూర్ బ్యూటీ ‘ఫ్యాట్ టు ఫిట్’గా మారే క్రమంలో పాటించిన ఫిట్నెస్, డైట్ సీక్రెట్లేంటో తన మాటల్లోనే వినేద్దాం రండి..

హాయ్ లేడీస్.. ఒక నటిగా కాదు.. మీరంతా ఎంతో ముద్దుగా పిలుచుకునే మీ ఫ్యాషనిస్టాగా, మీ సోనమ్‌గా, మీ బెస్ట్‌ఫ్రెండ్‌గా ఇప్పుడు మీ ముందుకొచ్చా. నా గురించి మీతో బోలెడన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నా. అయితే అన్నింటికంటే ముందుగా మీతో ఒక విషయం చెప్పాలి. అదేంటంటే.. నేను బయటికెళ్లిన ప్రతిసారీ లేదంటే సోషల్ మీడియా చాటింగుల్లో.. నాకు ఎదురయ్యే కామన్ ప్రశ్న ఏంటంటే.. ‘మీ ఫ్యాషన్లు, ఫిజిక్కు మేం వీర ఫ్యాన్స్ అయిపోయాం.. ఆ సీక్రెట్సేంటో మాకూ చెప్పచ్చుగా..!’ అంటూ చాలామంది నన్ను అడుగుతుంటారు. అంతేకాదు.. ‘మా ఫ్యాషన్ సెన్స్, అధిక బరువు గురించి ఎదుటివారి దగ్గర్నుంచి విమర్శలు కూడా ఎదురవుతుంటాయి..’ అంటూ వారి అనుభవాలను కూడా పంచుకుంటారు. అలాంటి వారందరికీ నేను చెప్పదలచుకున్నది ఒక్కటే.. ఫ్యాషన్ అనేది ఏ ఒక్కరికో సొంతమైన విషయం కాదు.. అది ఎవరి అభిరుచిని బట్టి వారు తమకు నచ్చిన ఫ్యాషన్లను ధరించచ్చు. ఈ విషయంలో ఇతరులు చేసే కామెంట్లతో పనిలేదు. ఇక అధిక బరువు విషయమంటారా..? ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు, మహిళలు ఈ సమస్యతో బాధపడుతున్నారు. అందుకు డైట్, ఫిట్‌నెస్‌పై సరైన అవగాహన లేకపోవడం ఒక కారణమైతే.. పలు అనారోగ్యాలు మరో కారణం. ప్రస్తుతం మీరు చూస్తున్న నా ఫిట్టెస్ట్ ఫిజిక్ నాకు రాత్రికి రాత్రే సొంతం కాలేదు. అందుకు ఎన్నో నెలలు శ్రమించా. ఆ కథనే ఇప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నా. నా ‘ఫ్యాట్ టు ఫిట్’ జర్నీ నాలా అధిక బరువుతో బాధపడిన వాళ్లలో స్ఫూర్తి నింపుతుందంటే నాకు అంతకంటే ఇంకేం కావాలి.

నా అధిక బరువుకు అవే కారణం!
‘సాధారణంగా సెలబ్రిటీ కిడ్స్ అంటే చిన్నతనం నుంచే డైట్, ఫిట్నెస్ విషయాల్లో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు.. ఒకవేళ బొద్దుగా ఉన్నా.. నాజూగ్గా మారడం వారికి అంత పెద్ద కష్టమేమీ కాదు..’ మా గురించి బయట చాలామంది అనుకునే మాటలే ఇవి. కానీ నా విషయంలో మాత్రం ఇవి అస్సలు కరక్ట్ కాదు. ఎందుకంటే చిన్నతనం నుంచే నేనో పెద్ద ఫుడీని. నాకు నచ్చిన పదార్థాలు బాగా లాగించేసేదాన్ని. ఇలా తినడం వల్ల బరువు పెరిగిపోతానేమోనన్న ఆలోచన కూడా నాకు అస్సలు ఉండేది కాదు. దీంతో 12 ఏళ్ల వయసులోనే అధిక బరువు సమస్యను ఎదుర్కొన్నా. ఇక 15 ఏళ్లొచ్చే సరికి మరింత బరువు పెరిగా. దీనికి తోడు నాకున్న మధుమేహం, పీసీవోఎస్ సమస్యలు కూడా నా బరువును మరింతగా పెంచేశాయి. 19 ఏళ్ల వయసులో పై చదువుల కోసం సింగపూర్ వెళ్లా. చదువు బిజీలో పడిపోయి బరువు గురించి పట్టించుకోకపోయే సరికి అంతకంతకూ బరువు పెరుగుతూ 86 కిలోలకు చేరుకున్నా!

అందుకు రెండేళ్లు కష్టపడ్డా!
చదువు పూర్తి చేసుకొని తిరిగొచ్చిన తర్వాత సంజయ్ లీలా భన్సాలీ నాకు ‘సావరియా’ అనే చిత్రంలో తొలి అవకాశం అందించారు. అప్పటికే 86 కిలోల బరువున్న నేను డెబ్యూ కోసం నాజూగ్గా మారాలని నిర్ణయించుకున్నా. సినిమా అవకాశం రాకముందు వరకు అధిక బరువు, ఆరోగ్య సమస్యల గురించి అస్సలు పట్టించుకోని నేను.. ఆపై బరువు తగ్గడంపై పూర్తి దృష్టి పెట్టాను. అయితే అదంత సులభం కాలేదు. బరువు పెరుగుతామన్న ఆలోచన లేకుండా నచ్చిన ఫుడ్‌ని ఎంతగా ఎంజాయ్ చేస్తామో.. అది తగ్గే క్రమంలో అంతకంటే ఎక్కువ కష్టపడాలన్న విషయం నాకు అప్పుడు అర్థమైంది. ఈ క్రమంలో సంజయ్ సర్ నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. అలాగే నా వెయిట్ లాస్ జర్నీలో అమ్మ పాత్ర, ఆమె ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది. చక్కటి ఆహార నియమాలు పాటిస్తూ, వర్కవుట్లు చేస్తూ.. ఇలా రెండేళ్ల పాటు స్ట్రిక్ట్ రొటీన్‌ని ఫాలో అవుతూ 35 కిలోలు తగ్గి 51 కిలోలకు చేరుకున్నా. బరువు తగ్గానని ఆపై నా వర్కవుట్, డైట్‌ని నేను పక్కన పెట్టలేదు. ఇప్పటికీ అవే నియమాలు పాటిస్తూ ఫిట్‌గా ఉంటున్నా.
ఆకలి వేసే దాకా ఆగను!

సాధారణంగా టీనేజ్‌లో చాక్లెట్స్, ఐస్‌క్రీమ్స్, ఫ్రైడ్ ఫుడ్, స్వీట్స్.. ఇలాంటి పదార్థాలపై మోజు విపరీతంగా ఉంటుంది. సింగిల్‌గా బయటికి వెళ్లినా, ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లినా, ఇతర వేడుకల్లోనైనా.. ఇలాంటి పదార్థాల్ని తినడానికి ఇష్టపడుతుంటాం. నేనూ అంతే..! అయితే బరువు తగ్గే క్రమంలో ఇలా నాకు నచ్చిన పదార్థాలను పూర్తిగా పక్కన పెట్టాను. సాధారణంగా నన్ను చూసి చాలామంది ‘అసలు ఈమె ఇంత నాజూగ్గా ఉందంటే.. తక్కువగా ఆహారం తీసుకుంటుందేమో..!’ అనుకుంటూ ఉంటారు. కానీ నేను ప్రతి రెండు గంటలకోసారి నట్స్, డ్రైఫ్రూట్స్.. వంటి హెల్దీ ఫుడ్ ఏదో ఒకటి తింటూనే ఉంటాను. ఆకలి వేసే దాకా ఆగాలన్న నియమమేమీ పెట్టుకోను. ఇక రోజంతా నీళ్లు, పండ్ల రసాలు.. వంటి పానీయాలు ఎక్కువగా తాగుతుంటా. అలాగే ఉప్పు, చక్కెరకు సాధ్యమైనంత దూరంగా ఉంటాను. ఇక నా రోజువారీ డైట్ ప్లాన్ విషయానికొస్తే.. నా డెయిలీ డైట్‌ని ఆరు భాగాలుగా విభజించుకున్నా.

* లేవగానే గ్లాసు గోరువెచ్చటి నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకొని తాగడం నాకు అలవాటు.
* బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా ఓట్మీల్, ఏదైనా సీజనల్ ఫ్రూట్ తీసుకుంటా.
* ఇక వర్కవుట్ తర్వాత బ్రౌన్ బ్రెడ్, కోడిగుడ్ల తెల్లసొన / ప్రొటీన్ షేక్, ఏదైనా జ్యూస్.. ఈ రెండిట్లో ఏదో ఒకటి తప్పకుండా తీసుకుంటా.
* మధ్యాహ్న భోజనం సమయంలో రాగిపిండితో చేసిన ఒక రోటీ, పప్పు, సబ్జీ (కూరగాయలన్నీ కలిపి చేసే కర్రీ), సలాడ్, ఒక చికెన్ లేదా చేప ముక్క.. వంటివి తీసుకుంటా.
* ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, చికెన్ కోల్డ్ కట్స్, కోడిగుడ్లలోని తెల్లసొన.. ఇవే నా సాయంత్రం స్నాక్స్.
* ఏదైనా సూప్, సలాడ్, చేప లేదా చికెన్ ముక్కతో నా డిన్నర్ పూర్తి చేస్తా.
ఇలా నేను కచ్చితంగా రెండేళ్ల పాటు పాటించిన ఈ డైట్ రొటీన్ నాకు మంచి ఫలితాన్నిచ్చింది. అందుకే నేటికీ దీన్ని కొనసాగిస్తున్నా. అలాగే బయటికి వెళ్లినప్పుడు నా బ్యాగ్‌లో యాపిల్, శాండ్విచ్, హెల్దీ బార్స్.. వీటిలో ఏదో ఒకటి ఉండాల్సిందే. ఇవి నా ఆకలిని అదుపు చేయడంతో పాటు అధిక క్యాలరీలున్న ఆహార పదార్థాలు తినకుండా నన్ను అదుపు చేస్తాయి.
|
రోజూ మూడు గంటలు యోగా చేయాల్సిందే!

నా డైట్ రొటీన్‌తో పాటు నేను చేసే వర్కవుట్లు కూడా నా అధిక బరువును తగ్గించడంలో బాగా సహకరించాయి. ఈ క్రమంలో నా పిలాట్స్ టీచర్ యాస్మిన్ కరాచీవాలా, జనరల్ ఫిట్నెస్ ట్రైనర్ జరైన్ వాట్సన్లతో పాటు నా వెయిట్ ట్రైనర్స్ ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది. అలాగే నా ఫిట్నెస్ ట్రైనింగ్‌లో భాగంగా కథక్ కూడా నేర్చుకున్నా.
* రోజూ అరగంట పాటు కార్డియో వ్యాయామాలు చేస్తాను.
* వారానికి రెండుసార్లు కథక్‌తో పాటు ఇతర డ్యాన్స్ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేస్తాను.
* ఖాళీ సమయాల్లో ఈత కొడతా.
* మీకో విషయం తెలుసా.. నేను స్క్వాష్ ప్లేయర్‌ని కూడా! నా ఫిట్నెస్ సీక్రెట్స్లో అదొక భాగం.
* వీటన్నింటితో పాటు రోజూ మూడు గంటల పాటు యోగా ప్రాక్టీస్ చేస్తా. అదే నన్ను శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంచేందుకు దోహదం చేస్తుంది.
|
సో.. ఇవండీ ‘ఫ్యాట్ టు ఫిట్’గా మారే క్రమంలో నేను పాటించిన డైట్, ఫిట్నెస్ సీక్రెట్స్. ఇలా నేను పాటించిన ఈ స్ట్రిక్ట్ రొటీన్ వల్ల నా అధిక బరువే కాదు.. నా ఆరోగ్య సమస్యల నుంచి కూడా నాకు విముక్తి లభించింది. ఇలా చక్కటి లైఫ్‌స్టైల్ వల్ల ఆరోగ్యం, ఫిట్నెస్ను సొంతం చేసుకోవచ్చని నాకు అర్థమైంది. అధిక బరువు అనేది ఎవరూ కావాలని కోరుకోరు. పలు అనారోగ్యాలు, మనం పాటించే క్రమశిక్షణా రహిత జీవన విధానమే అందుకు కారణం కావచ్చు. కాబట్టి ఇతరులు చేసిన కామెంట్లను పట్టించుకోకుండా మీరు పాటించే డైట్, ఫిట్నెస్.. వంటి విషయాలపై దృష్టి పెట్టండి.. తద్వారా నాజూగ్గా మారడంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా సొంతమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా మీ నిపుణులను సంప్రదించి వారి సలహాలు, సూచనల మేరకు బరువు తగ్గే దిశగా ముందుకు సాగండి.. ఈ విషయంపై మీ చుట్టూ ఉన్న వారిలోనూ స్ఫూర్తి రగిలించండి.. సరేనా.. ఉంటాను మరి.. బై బై..!
గమనిక: ‘తెలుసునా.. తెలుసునా..’ అంటూ ‘సొంతం’ సినిమాతో కుర్రకారు మనసుల్ని గిలిగింతలు పెట్టిన బబ్లీ గర్ల్ నమిత ‘ఫ్యాట్ టు ఫిట్’ స్టోరీ తెలుసుకోవాలంటే ‘అలా బరువు తగ్గా!’ శీర్షికలో డిసెంబర్ 5న ప్రచురితమయ్యే ప్రత్యేక వ్యాసం చదవండి.