ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ...
ఆహారం, ఆరోగ్యం, సంతానం... ఈ మూడు అంశాలపై అలుపెరుగకుండా అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు డాక్టర్ సామవేదం వెంకట కామేశ్వరి. ఇందులో భాగంగానే సంతానలేమికి పోషకాహార లోపం కూడా కారణమని తెలుసుకున్నారు. ముఖ్యంగా గర్భాశయ ఆరోగ్యం గురించి మహిళలకు పదేళ్లుగా అవగాహన కల్పిస్తున్నారామె. మహిళల ఆరోగ్య సూచికగా, మాతృత్వపు ప్రమాణంగా ఉన్న గర్భసంచి విషయంలో జరుగుతున్న అన్యాయం మీద అనేక వేదికలపై గళం ఎత్తి పోరాడుతున్నారు. గర్భసంచి తీసేయడం వల్ల ఎదురయ్యే సమస్యల్ని ప్రతిఒక్కరికీ వివరించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా చెల్మెడ అనే ప్రాంతంలో మహిళలతో కలిసి ఇతర గ్రామాల్లోనూ గర్భాశయ ప్రాముఖ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. తెలంగాణలోని వరంగల్, నల్గొండ జిల్లాల్లో హిస్టరెక్టమీ ఆపరేషన్లు చేసుకునే వారి శాతం దాదాపు 15 వరకు ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు డాక్టర్ వెంకట కామేశ్వరి. ఆమె కృషితో ఆరోగ్యశ్రీలో అనవసరపు ఆపరేషన్లు రద్దు చేశారు. 'గర్భసంచిని కాపాడుకుందాం' అనే పుస్తకాన్ని రాశారు. హిస్టరెక్టమీ ఆపరేషన్లకు వ్యతిరేకంగా పోరాడారు. దీన్నో ఉద్యమంలా చేపట్టారు. దాదాపు తొంభైవేలమంది అమ్మాయిలకు నెలసరి, వ్యక్తిగత ఆరోగ్యం, గర్భాశయం ప్రాధాన్యం... ఇలా ఎన్నో అంశాలపై అవగాహన కల్పించారు. తన చివరి శ్వాస వరకూ మహిళల ఆరోగ్యం కోసం కృషిచేస్తానని చెబుతారామె. ఇక, రకరకాల కారణాలతో నగరానికి వచ్చేవారిలో కొందరికి ఉండేందుకు ఆశ్రయం దొరక్కపోవచ్చు. దాన్ని గుర్తించిన ఆమె.. 'ఓపెన్ హౌస్' పేరుతో ఓ ఆశ్రయాన్ని కల్పించారు. అక్కడ కావాల్సినన్ని రోజులు ఉండొచ్చు.. వంట చేసుకోవచ్చు. తమ సమస్యల్ని కూడా పంచుకోవచ్చు. విద్యార్థులు, ఉద్యోగవేటలో ఉన్నవారు.. ఇలా ఎవరైనా సరే... ఇక్కడకు రావొచ్చని చెబుతారామె.
Know More