ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది సాధ్యమైనంత వరకు ఇంటి నుంచే పని చేసేట్టుగా చూసుకుంటున్నారు. మీ భర్తకి, వారి తరపు వాళ్లకు మీరు బయటకు వెళ్లి ఉద్యోగం చేయడం ఇష్టం లేదంటున్నారు. కాబట్టి మీరు కూడా అలాంటి అవకాశాలు ఏవైనా దొరుకుతాయేమో ప్రయత్నించి చూడండి. ఇకపోతే అతను కొద్దికొద్దిగానే వస్తువులు తీసుకొస్తున్నాడని అంటున్నారు. అయితే అది అతని వ్యవహార శైలి కావచ్చు. లేదా అతని సంపాదనకు, అతనున్న పరిస్థితులకు అనువుగా అలా చేస్తుండచ్చు. అలాగని ఎప్పటికీ ఒకేవిధంగా ఉండాలన్న నియమం కూడా ఉండకపోవచ్చు కదా. కాబట్టి, మీవైపు నుంచి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఆలోచించుకోండి. అలాగే మిమ్మల్ని కొద్దిరోజుల పాటు అక్కడ, కొద్ది రోజుల పాటు ఇక్కడ ఉండేట్టుగా ఎందుకు చేస్తున్నాడనేది కూడా ఆలోచించి చూడండి. అతనికి ఇంటి నుంచి పని (వర్క్ ఫ్రం హోమ్) చేసే అవకాశం లేదని చెబుతున్నారు. అలాంటప్పుడు నెలకు పదిహేను రోజుల పాటు ఉద్యోగానికి దూరంగా ఉండడం వల్ల కలిగే సమస్యలేంటో అతను ఆలోచించే ఉండచ్చు కదా.. అయినా సరే అతను అక్కడకు తీసుకెళ్తున్నాడు అంటే అతని ఉద్దేశం ఏంటి? అనేది ఆలోచించి చూడండి.
మీ భర్త విషయంలో సంయమనం పాటిస్తూనే మీ ఉనికిని, వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించండి. దీనికి మీ చదువుని ఉపయోగించుకునే మార్గాలను అన్వేషించండి. మీ భర్త చదువు, మీ చదువుకి అనుసంధానంగా ఏదైనా సొంతంగా చేయచ్చేమో కూడా ఆలోచించి చూడండి. అలాగే మీ పెళ్లై మూడు నెలలే అయింది కాబట్టి మీ వారితో మానసికంగా దృఢమైన అనుబంధం పెంచుకునే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత అతని ఆలోచనలపై ఒక స్పష్టత తెచ్చుకునే ప్రయత్నం చేయండి. మీ మామగారు, బావగార్ల వ్యవహార శైలిని గమనించి మీకు ఏ రకమైన ఆర్థిక స్వావలంబనకు వెసులుబాటు ఉంటుందో ఆలోచించి చూడండి.
ఏది ఏమైనా మొదట స్వయంశక్తితో మీకు అందుబాటులో ఉన్న అవకాశాలను ప్రయత్నించండి. అటు తర్వాత మీ భర్తతో మాట్లాడి చూడండి. ఈ క్రమంలో ఇంకా అసంతృప్తి ఉంటే మీ పుట్టింటి వారితో చెప్పి.. వారు మీ అత్తమామలు, భర్తతోటి చర్చించే అవకాశం ఉంటుందేమో ప్రయత్నించండి. ఈ క్రమంలో- గతంలో మీకు ఎదురైన చేదు అనుభవాలు మీ ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీయకుండా సానుకూల ధోరణితో ప్రయత్నించండి.