భర్త మనసులో మరొక వ్యక్తి ఉన్నా.. అది సాధ్యం కాకపోవడంతో మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడన్న విషయం మీకు తెలుసు. అతను తన పాత స్నేహితురాలిని మర్చిపోవడం సంగతి అటుంచితే.. తనకు మహిళల పట్ల బలహీనత ఉందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. అమ్మాయిలతో గంటల కొద్దీ మాట్లాడడం, వారిని బయటకు తీసుకెళ్లడం, ఆఫీస్ దగ్గరే ఒంటరిగా రూం తీసుకుని ఉండడం వంటి విషయాలను ప్రస్తావించారు. ఇవన్నీ మీకు అతనిపై నమ్మకం ఉన్నట్లుగా సూచించడం లేదు. ఒకవైపు ఇంటి అవసరాలకు ఎలాంటి లోటూ చేయడం లేదని చెబుతూనే మరోవైపు మిమ్మల్ని వేధిస్తున్నాడని చెబుతున్నారు. అలాగే బాబు ఉన్నాడు కాబట్టి అతని మీద ఆధారపడక తప్పదన్న ఆలోచనతో మీరు ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తోంది.
ఈ క్రమంలో మీకు మీరు స్వయంశక్తిని పెంపొందించుకునే ప్రయత్నం చేయండి. మీ ఉత్తరంలో మీ విద్యార్హతల గురించి ప్రస్తావించలేదు. అయితే ఈ రోజుల్లో ఇంట్లోనే ఉండి విద్యార్హతలను పెంచుకునే అవకాశాలెన్నో ఉన్నాయి. కాబట్టి, ఉద్యోగానికి తగ్గ విద్యార్హతలను పెంచుకునే ప్రయత్నం చేయండి. దీనివల్ల మీ కాళ్ల మీద మీరు నిలబడడమే కాకుండా మీ బాబుని మీరు చూసుకోగలరన్న ధైర్యం కూడా మీకు కలుగుతుంది. ఒక్కసారి ఉద్యోగం/వ్యాపారం అంటూ మొదలుపెట్టిన తర్వాత మీరు ప్రపంచాన్ని చూసే కోణంలో కూడా మార్పు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫలితంగా మీపై మీకు ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా.. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం కూడా వచ్చే అవకాశాలుంటాయి.
ఇక, మీరు చేసే పనుల్లో లోపాలు వెతకడం, మీద నీళ్లు పోయడం వంటి పనుల వల్ల ఇబ్బంది పడుతున్నారని చెబుతున్నారు. అయితే అతని ప్రవర్తన వల్ల మీరు ఎంతగా బాధపడుతున్నారో అతనికి మీరు స్వయంగా ఎప్పుడైనా చెప్పారో లేదో మీరు స్పష్టం చేయలేదు.. ఒకవేళ దాని గురించి అతనితో ఇప్పటివరకు డైరెక్ట్ గా మాట్లాడకపోయుంటే - అతని అనుచిత ప్రవర్తన మీకు ఎంత బాధ కలిగిస్తోందో ఓసారి వివరంగా చెప్పి చూడండి.
అప్పటికీ మార్పు లేకపోతే మీ పరిస్థితుల గురించి పెద్దవాళ్లతో చర్చించడం ద్వారా సమస్యను పరిష్కరించే అవకాశం ఉండచ్చు. ఆ దిశగా కూడా ఓసారి ప్రయత్నించి చూడండి. అదేవిధంగా సాధ్యమైనంత త్వరగా మీ కాళ్ల పైన మీరు నిలబడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు ఏ పరిస్థితి ఎలా వచ్చినా అతని పైన ఆర్ధికంగా ఆధారపడే అవసరం ఉండదు. మీ భవిష్యత్తు గురించి ధైర్యంగా నిర్ణయం తీసుకోగలుగుతారు.