టిక్‌టాక్.. ఇచ్చట సినిమా ప్రమోషన్స్ కూడా చేయబడును..!
ప్రస్తుత పరిస్థితుల్లో ఒక సినిమా విజయంలో కథ, దర్శకత్వం, నటీనటులు, సంగీతం.. మొదలైన వాటితో పాటు సినిమా ప్రమోషన్స్ కూడా కీలకపాత్ర పోషిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు..! ప్రచార కార్యక్రమాలు ఎంత బాగా నిర్వహిస్తే.. ఆ సినిమా కలెక్షన్లు అంత బాగుంటాయని సినీ వర్గాల్లో ఓ నమ్మకం ఏర్పడింది. అందుకే తమ సినిమా ప్రచార కార్యక్రమాలను వీలైనంత వినూత్నంగా, ఎక్కువ మంది ప్రేక్షకులను చేరుకునేలా జాగ్రత్తలు తీసుకుంటోంది చిత్ర బృందం. ఇందులో భాగంగా నటీనటులు తమ సినిమా విడుదలకు ముందే పలు ప్రత్యేక ఇంటర్వ్యూలలో పాల్గొనడంతో పాటు తమ సినిమాను ప్రమోట్ చేసేందుకు కొత్త పద్ధతుల కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలో వీళ్లకు సోషల్ మీడియా ఓ సువర్ణాస్త్రంగా ఉపయోగపడుతోంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్.. ఇలా వివిధ వేదికల ద్వారా తమ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడీ జాబితాలోకి టిక్‌టాక్ కూడా చేరడం విశేషం. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు చాలామంది నటీనటులు టిక్‌టాక్ ద్వారా తమ సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారు. వీరిలో కొంతమంది తారలు ఏకంగా టిక్‌టాక్‌లో సొంత ఖాతాలు కూడా తెరవడం కొసమెరుపు.
Know More