ఫిట్నెస్ కోసం ఈత నేర్చుకుంది.. ఇప్పుడు రికార్డు సృష్టించింది!
చురకత్తుల్లా దూసుకొచ్చే అలల్ని వెనక్కి నెడుతూ, ప్రమాదకరమైన జలచరాల బారి నుంచి తప్పించుకుంటూ అంతులేని సముద్రంలో ఈత కొట్టడమంటే అంత ఆషామాషీ విషయం కాదు.. అందుకు ఎంతో తెగువ, పట్టుదల కావాలి. ఆ రెండూ తనలో ఉన్నాయని నిరూపించింది ఆంధ్రప్రదేశ్‌కి చెందిన 47 ఏళ్ల శ్యామల గోలి. అత్యంత ప్రమాదకరమైనదిగా భావించే పాక్ జలసంధిని తాజాగా ఈది సరికొత్త చరిత్రకు తెరలేపిందామె. భారత్-శ్రీలంకల్ని కలిపే ఈ 30 కిలోమీటర్ల నీటి వారధిని కేవలం 13 గంటల్లోనే ఛేదించిందామె. తద్వారా ఈ అరుదైన ఘనత సాధించిన తొలి తెలుగు మహిళగా, ప్రపంచంలోనే రెండో మహిళగా చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. అంతేకాదు.. శ్యామల తన 47 ఏళ్ల వయసులో ఈ సాహసానికి పూనుకోవడం మరో విశేషం! ‘మహిళలు ఏదైనా చేయాలనుకుంటే అది సాధించి చూపించగల సమర్థులు’ అంటోన్న ఈ మహిళా స్విమ్మర్ తన గురించి ఏం చెబుతున్నారో తెలుసుకుందాం రండి..
Know More