మలి వయసులో నాకో తోడు కావాలనుకోవడం తప్పా?!
విడాకులు తీసుకున్నా, వితంతువుగా మిగిలిపోయినా.. మహిళలు రెండో వివాహం చేసుకుంటామంటే మాత్రం ఎందుకో ఈ లోకం ఒప్పుకోదు. ఇక కాస్త లేటు వయసులో రెండో పెళ్లంటే ‘ఈ వయసులో నీకు అవసరమా?’ అన్న సూటిపోటి మాటలు ఎదుర్కోవాల్సిందే! కానీ ఏ వయసులోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎవరికైనా సరే ఓ జీవిత భాగస్వామి తోడు అవసరమని, అందుకే తాను 73 ఏళ్ల వయసులో వరుడి కోసం అన్వేషిస్తున్నానని చెబుతోంది కర్ణాటకకు చెందిన ఓ రిటైర్డ్ టీచర్. ఈ క్రమంలోనే ‘వరుడు కావలెను’ అంటూ తానిచ్చిన ఓ మ్యాట్రిమోనియల్ ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తనది రెండో పెళ్లని ఏమాత్రం రాజీ పడకుండా, పెళ్లి చేసుకోవడానికి వయసుతో సంబంధమే లేదన్న సానుకూల దృక్పథంతో.. తనకు ఎలాంటి లక్షణాలున్న వరుడు కావాలో తన యాడ్లో స్పష్టం చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇలా తన నిర్ణయాన్ని కొందరు విమర్శిస్తున్నా.. చాలామంది మాత్రం తన ధైర్యానికి, సానుకూల దృక్పథానికి సలాం కొడుతున్నారు. ఇలా ఆమె ప్రకటన చూసి.. ‘మీకు తగిన వరుడిని నేనే’ అంటూ ఓ 69 ఏళ్ల వ్యక్తి స్పందించడం ఇక్కడ కొసమెరుపు.
Know More