ఈ మూడు చిట్కాలతో పీసీఓఎస్‌ను అదుపు చేసుకున్నా!
పీసీఓఎస్/పీసీఓడీ.. పేరేదైనా ఎంతోమంది మహిళల ప్రత్యుత్పత్తి వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందీ సమస్య. పదిలో కనీసం ఒక్కరైనా ఈ సమస్యతో బాధపడుతున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు మహిళల పట్ల ఇదెంత శాపంగా పరిణమిస్తుందో! అయితే ఈ సమస్యతో బాధపడే మహిళలు కూడా తమ అనుభవాలను బయటికి చెప్పడానికి ఇష్టపడరు.. కారణం సమాజం తమనెక్కడ చిన్న చూపు చూస్తుందోనని! కానీ కొంతమంది మాత్రం ధైర్యంగా ముందుకొచ్చి తమ పీసీఓఎస్ స్టోరీని పంచుకుంటూ నలుగురిలో స్ఫూర్తి నింపుతుంటారు. అలాంటి వారిలో సామాన్యులే కాదు.. సెలబ్రిటీలూ ఉన్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ ఫ్యాషనిస్టా సోనమ్ కపూర్ కూడా తాను గత కొన్నేళ్లుగా పీసీఓస్‌తో బాధపడుతున్నట్లు తాజాగా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అంతేకాదు.. ఈ సమస్యను అదుపు చేసుకోవడానికి తాను పాటిస్తోన్న చిట్కాలను సైతం ఓ వీడియో రూపంలో పోస్ట్ చేసి ఇతర మహిళల్లో పీసీఓఎస్‌పై అవగాహన పెంచుతోంది. సంతాన సమస్యలు, అధిక బరువు, అవాంఛిత రోమాలు.. పీసీఓఎస్ మహిళలపై చూపే ప్రతికూల ప్రభావానికి కొన్ని సాక్ష్యాలివి! ఇది ఒక్కసారి మన జీవితంలోకొచ్చిందంటే.. దీన్ని అదుపు చేసుకోవడమే తప్ప.. శాశ్వత పరిష్కారం లేదంటున్నారు వైద్య నిపుణులు. చక్కటి లైఫ్‌స్టైల్, ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా చేసే వ్యాయామం.. వంటివన్నీ పీసీఓఎస్‌ను అదుపు చేసుకునేందుకు మార్గాలు అంటూ సలహా ఇస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ కూడా ఇదే విషయం చెబుతోంది. పీసీఓఎస్ బారిన పడ్డాక తాను ఎదుర్కొన్న సవాళ్లను, దీన్ని అదుపు చేసుకునేందుకు పాటిస్తోన్న చిట్కాలను వివరిస్తూ ఓ వీడియో రూపొందించిందీ భామ. దీన్ని తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ మహిళలందరిలో ఈ సమస్య పట్ల అవగాహన పెంచుతోంది.
Know More