వేసవిలో శక్తి ఇట్టే ఆవిరైపోతుంటుంది. నీరసంగా ఉన్నప్పుడు ఒక్క ఖర్జూరాన్ని నోట్లో వేసుకోండి. తక్షణ శక్తి లభిస్తుంది. ఎండాకాలంలో ఎక్కువగా దొరికే ఖర్జూరం పోషకాలకు ఖజానా లాంటిది. తియ్యని రుచిని పంచడంతో పాటు.. రోగనిరోధకశక్తినీ అందిస్తుంది.
ఖర్జూరలో ప్రొటీన్లు, క్యాల్షియం, ఇనుము, పొటాషియం మెండుగా ఉంటాయి. మెగ్నీషియం, కాపర్‌తో పాటు విటమిన్ ఎ, బి1, బి2 కూడా తగినంతగా ఉంటాయి. ఫ్రక్టోజ్, సెల్యులోజ్, పీచు ఎక్కువగా ఉంటాయి. ఒక్క ఖర్జూరంలో 5 గ్రా. కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కొవ్వు ఉండదు. ప్రొటీన్లు తక్కువగా ఉంటాయి. ఇందులోని ఎలక్ట్రోలైట్స్ గుండెకు మేలు చేస్తాయి. ఫాస్ఫరస్ ఎముకలకు మంచిది.
పిల్లలకు.. పెద్దలకు..
* పిల్లలకు ఖర్జూరాలను ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల బాగుంటుంది. తేనెతో కలిపి పిల్లలకు ఇస్తే ఇష్టంగా తింటారు.
* ఇనుము ఎక్కువగా ఉండటం వల్ల నెలసరి సమస్యలను నివారించడంతోపాటు సక్రమంగా వచ్చేలా చేస్తుంది. గర్భిణులు ఖర్జూరాలను తీసుకుంటే వెంటనే ఇనుము పెరుగుతుంది. రక్తహీనత తగ్గుతుంది. గర్భస్థ శిశువుకు మంచిది.
* డైటింగ్ చేసేవాళ్లు మూడు, నాలుగు ఖర్జూరాలు తీసుకోవచ్చు.
* బాలింతలకు పాలతో కలిపి ఇస్తే మంచిది.
* ఖర్జూరాలను మేకపాలతో కలిపి తీసుకుంటే సత్వరశక్తి వస్తుంది. తరచూ జలుబు, దగ్గూ వచ్చేవారికి ఇది ఔషధంగా పనిచేస్తుంది.
* అయిదారు ఖర్జూరాలు, పది కరివేపాకు రెబ్బలు జ్యూస్ తీసుకుని తాగితే అధిక రక్తపోటు తగ్గుతుంది.
* వృద్ధులకు పచ్చి ఖర్జూరం అరగదు. ఐదు నుంచి పది ఖర్జూరాలను నానబెట్టి ఉదయం ఇస్తే మంచిది.
* ఇవి కంటి సమస్యలను నియంత్రించి చూపును మెరుగుపరుస్తాయి.
* వేసవిలో చంటిపిల్లలకు ఖర్జూరాలు ఎంతో మేలు చేస్తాయి. వీటిని నీళ్లలో ఉడికించి, వడకట్టి నీటిని తాగిస్తే దాహం తగ్గుతుంది. నీళ్ల విరేచనాలు ఆగుతాయి.
ఎనర్జీ డ్రింక్..
తక్షణ శక్తి కోసం ఖర్జూరాలతో ఎనర్జీ డ్రింక్ తయారుచేయొచ్చు. పదిహేను ఎండు ఖర్జూరాలను గింజలు తీసి, గ్రైండ్ చేసి పాలు, తేనె కలపాలి. సువాసన కోసం యాలకులు వేసుకుంటే ఎనర్జీ డ్రింక్ సిద్ధమవుతుంది.
సిరప్
ఖర్జూరాలతో ఇంట్లోనే సిరప్ తయారుచేసుకుంటే బ్రెడ్, సలాడ్స్‌లో వేసుకోవచ్చు. పావుకేజీ ఖర్జూరాలను తీసుకుని గింజలు తీసేసి చిన్నచిన్న ముక్కలుగా కోసుకోవాలి. వీటిని వేడినీళ్లలో అరగంటపాటు నానబెట్టాలి. తర్వాత గాజుసీసాలోకి వడకట్టుకుని ఫ్రిజ్‌లో నిల్వచేయాలి. దీంట్లో పంచదార ఉండదు కాబట్టి చిన్నారులకే కాకుండా పెద్దలకూ మంచిదే.
స్మూతీ
పచ్చి ఖర్జూరాలను విత్తనాలు తీసి వేడినీళ్లతో శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి. తర్వాత అరటిపండును బాగా చిదిమి తేనె, దాల్చినచెక్క పొడి, యాలకుల పొడి వేయాలి. రుచి కోసం వెనీలా ఎసెన్స్ కూడా కలపొచ్చు.
* ఖర్జూరాలను మితంగానే తీసుకోవాలి. ఎక్కువగా తింటే అజీర్తి.
* పచ్చి ఖర్జూరాలను తింటే కొందరికి ఎసిడిటీ తలెత్తుతుంది. ఈ సమస్య ఉన్నవాళ్లు ఎండువి తినొచ్చు.
* ఖర్జూరాలు తిన్నవెంటనే అన్నం తినొద్దు.
- డా. పెద్ది రమాదేవి, ఆయుర్వేద నిపుణులు