ఎండలు మండే ఈ కాలంలో ఎంత నీడపట్టున ఉన్నా... నీరసం, నిస్సత్తువ ఆవరిస్తుంటాయి. శరీరం అసౌకర్యంగా ఉంటుంది. శక్తి కావాలనిపిస్తుంది. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం బార్లీ జావ..
బార్లీ గింజల్లో విటమిన్ బి1 పుష్కలంగా ఉంటుంది. అందుకే బార్లీ నీళ్లు తాగితే నీరసం, అలసట ఉండదు. విటమిన్-బి1, పొటాషియం లోపం వల్ల.. కాళ్లు, ముఖంలో వాపు కనిపిస్తుంది. ఈ సమస్య ఉన్నవాళ్లు తరచూ బార్లీ నీళ్లు తీసుకోవాలి.
ఈ నీళ్లు క్రమం తప్పకుండా తాగితే మూత్రంలో మంట తగ్గుతుంది. బార్లీ గింజలతో గంజి లేదా పొడితో జావ తయారుచేసుకోవచ్చు. బార్లీ జావలో కొద్దిగా మజ్జిగ, నిమ్మరసం కూడా కలిపి తీసుకుంటే రుచితోపాటు పోషకాలూ అందుతాయి.
ఎవరికి మంచిది?
గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు కూడా బార్లీని వాడొచ్చు. హైబీపీ, తలనొప్పి, డయేరియా, మూత్రనాళంలో వాపు, పేగు పూత, అరచేతులు, అరికాళ్ల మంటలు ఉన్నవాళ్లూ తీసుకోవచ్చు. కొన్ని రోజులపాటు క్రమం తప్పకుండా వాడితే ఫలితం ఉంటుంది. కొన్నిరకాల చర్మ రోగాలను కూడా తగ్గిస్తుంది.
బార్లీ మాల్ట్

కావాల్సినవి
బార్లీపొడి- 50 గ్రా., పాలు- అరలీటరు, బాదంపప్పు, కిస్మిస్- రెండు చెంచాలు, యాలకులు- రెండు, పంచదార- రుచికి సరిపడా.
తయారీ
పాలను సన్నని మంట మీద మరిగించి దాంట్లో బార్లీపొడి కలపాలి. అయిదు నిమిషాల తర్వాత పంచదార, బాదంపప్పు, కిస్మిస్, యాలకులు వేసి బాగా కలిపి దించేయాలి.
* ఈ బార్లీ మాల్ట్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. బలహీనంగా ఉండే చిన్నారులు, వృద్ధులకు ఇస్తే మంచిది.
* బార్లీని దోరగా వేయించి జావకాస్తే మంచి రుచి, సువాసన వస్తుంది. కావాలనుకుంటే జావలో కూరగాయముక్కలను కూడా వేసుకోవచ్చు.

- డా. పెద్ది రమాదేవి, ఆయుర్వేద నిపుణులు