పాలల్లో కాసిని మిరియాలు వేసుకుంటే... జలుబు పరార్! మిరియాల చారు రుచినే కాదు.. రోగనిరోధక శక్తినీ అందిస్తుంది.. సుగంధ ద్రవ్యాల్లో రారాజుగా పిలుచుకునే నల్లమిరియాల ప్రయోజనాలు మరిన్ని..
మిరియాల టీ
కావాల్సినవి: నీళ్లు- రెండు కప్పులు, మిరియాల పొడి- టీస్పూన్, తేనె- టేబుల్ స్పూన్, నిమ్మరసం- టీస్పూన్, సన్నగా తురిమిన అల్లం- టీస్పూన్, పసుపు- కొద్దిగా
తయారీ: గిన్నెలో నీళ్లు పోసి బాగా మరిగించాలి. వీటిలో మిరియాల పొడి, అల్లం తురుము, తేనె, పసుపు, నిమ్మరసం అన్నీ వేసి అయిదు నిమిషాల పాటు మూత పెట్టి అలాగే ఉంచాలి. తర్వాత వడపోసి వేడివేడిగా తాగాలి. ●
* నల్ల మిరియాల్లో పెప్పరైన్, కాప్సేసిన్ అనే రసాయనాలు ఉంటాయి. వీటి వల్లే మిరియాలకు ఘాటైన వాసన ఉంటుంది. ఈ పెప్పరైన్ శ్వాసను నియంత్రించి మెదడు పనితీరుని చురుగ్గా ఉంచుతుంది.
* వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్-ఎ, సి పుష్కలంగా ఉంటాయి. ఇవే మనలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి.
* 15 మిరియపు గింజలు, రెండు లవంగాలు, ఒక వెల్లుల్లి రెబ్బ తీసుకుని వాటిని దంచి వేణ్నీళ్లలో కాచి కొంచెం కొంచెంగా పుచ్చుకుంటే ఆయాసం, గొంతునొప్పి తగ్గుతుంది. కఫ హరంగా ఉంటుంది. ●
* నాలుగు మిరియాలని కచ్చాపచ్చాగా దంచి తేనెతో కలిపి తమలపాకులో పెట్టి పుచ్చుకుంటే జ్వర తీవ్రత తగ్గుతుంది.
* మిరియాలు కాలేయాన్ని శుద్ధిచేసి దాని పనితీరును మెరుగుపరుస్తాయి. ఫ్యాటీలివర్ని అదుపులో ఉంచుతాయి.

ఇన్ఫెక్షన్లపై పోరాటం: మిరియాల్లో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి. దక్షిణాఫ్రికాలో జరిగిన అధ్యయనాల ప్రకారం... మిరియాల్లోని పెప్పరైన్కి రోగాలకు కారణమయ్యే క్రిములను లార్వా దశలోనే అంతమొందించే శక్తి ఉందని తేలింది.
* పేగులను శుభ్రపరిచి జీర్ణసంబంధ సమస్యలను నివారిస్తాయి. పొట్ట, పేగుల్లోని అదనపు గాలిని తొలగిస్తాయి.
* మిరియాలు జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. ఇవి రుచి మొగ్గలను ఉత్తేజితం చేయడం వల్ల జీర్ణప్రక్రియ వేగంగా జరుగుతుంది.
* భోజనంలో పావుచెంచా వాము, రెండుమూడు మిరియాలు, నెయ్యి, ఉప్పుతో కలిపి మొదటిముద్ద తింటే అజీర్ణం తగ్గుతుంది.
* పాలల్లో మిరియాలపొడి, పసుపు, శొంఠి వేసుకుని నిద్రపోయే ముందు ితాగితే ఊపిరితిత్తుల సమస్యలు ఉండవు.
జాగ్రత్తలు: కడుపులో మంట ఉన్నవారు మితంగా తీసుకోవాలి.
- డాక్టర్ పెద్ది రమాదేవి, ఆయుర్వేద నిపుణులు