Photo: Instagram
గుడికెళ్తే అర్చన చేసే పూజారి పురుషుడే..
పెళ్లిలో వేదమంత్రాల సాక్షిగా దంపతుల్ని కలిపేదీ పురుష పురోహితుడే..
ఆఖరికి పిండం పెట్టాలన్నా పురుష పూజారికే పిలుపు అందుతుంది..
కానీ రాన్రానూ ఈ ట్రెండ్ మారుతోంది. ఆడవాళ్లు కూడా పూజారులుగా, పెళ్లిళ్లు చేసే పురోహితులుగా అవతారమెత్తుతున్నారు. ఇందుకు ఇటీవలే దియా మీర్జా పెళ్లి చేసిన షీలా అత్తా అనే మహిళా పురోహితురాలే ప్రత్యక్ష ఉదాహరణ! ఆడవారు వేదమంత్రాలు పఠించడానికి అనర్హులు అన్న మూసధోరణిని బద్దలుకొడుతూ ఎంతోమంది మహిళలు పురోహితులుగా, ఖాజీలు (ముస్లిం పురోహితులు)గా సరికొత్త అవతారం ఎత్తుతున్నారు. ఇదిలా ఉంటే.. మరోవైపు కొత్త జంటలు కూడా తమ పెళ్లి కోసం మహిళా పురోహితుల్ని ఆహ్వానించడానికే మొగ్గుచూపుతున్నాయట! ఇవన్నీ చూస్తుంటే రాబోయే రోజుల్లో పురుష పురోహితులతో సమానంగా మహిళా పూజారులు కూడా అవకాశాలు సొంతం చేసుకుంటారనడంలో సందేహం లేదు. మరి, ఈ పురుషాధిక్య ప్రపంచాన్ని మార్చిన అలాంటి కొంతమంది మహిళా పురోహితులు/ఖాజీల గురించి ఈ ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా తెలుసుకోవడం సందర్భోచితం.
‘ఆడవారు వేద మంత్రాలు వల్లె వేయకూడదు’ అని కొంతమంది అంటే.. ‘వేదాలకు ఆడ, మగ అన్న తేడా లేదు.. అలాంటప్పుడు మహిళలు పురోహితులుగా ఎందుకు మారకూడదు?’ అని తిరిగి ప్రశ్నిస్తున్నారు కొంతమంది అతివలు. అంతేకాదు.. పురుషులే పురోహితులుగా ఉండాలంటూ ఈ పితృస్వామ్య వ్యవస్థలో వేళ్లూనుకుపోయిన మూసధోరణుల్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఇటీవలే పెళ్లి పీటలెక్కిన బాలీవుడ్ అందాల తార దియా మీర్జా పెళ్లిలో కూడా ఇలాంటి దృశ్యమే తారసపడింది. సందర్భం వచ్చినప్పుడల్లా పితృస్వామ్య వ్యవస్థను తనదైన రీతిలో తిప్పి కొట్టే దియా.. తన పెళ్లి కోసం మహిళా పురోహితురాలిని ఎంచుకొని మరోసారి తాను ఫెమినిస్ట్‌ని అంటూ చెప్పకనే చెప్పిందీ బ్యూటీ. అంతేకాదు.. తన పెళ్లి చేసిన షీలా అత్తా అనే ఆ మహిళా పురోహితురాలికి కృతజ్ఞతలు తెలుపుతూ.. మనందరం కలిస్తేనే జనరేషన్ ఈక్వాలిటీ సాధ్యపడుతుందంటూ చెప్పుకొచ్చిందీ చిన్నది. దియా స్నేహితురాలి ఆంటీ అయిన షీలా ప్రస్తుతం మహిళా పురోహితురాలిగా కొనసాగుతున్నారు. తనే కాదు.. గతంలోనూ పలువురు మహిళా పురోహితులు/ఖాజీలు పెళ్లిలో మంత్రాలు చదువుతూ జంటల్ని ఏకం చేశారు.
వేదాలకు ఆడ, మగ సమానమే!
వేదమంత్రాలు మగవారే పఠించాలని చెబుతుంటారు పెద్దలు. కానీ వేదాలకు ఆడ, మగ అన్న తేడా లేనప్పుడు మహిళలు పురోహితులు కావడంలో తప్పేముంది అంటారు మైసూరుకు చెందిన భ్రమరాంబ మహేశ్వరి. మైసూరుకు చెందిన ఆమె 1995 నుంచి పౌరోహిత్యం చేస్తున్నారు. ‘నేను పౌరోహిత్యం స్వీకరించినప్పట్నుంచి ఇప్పటివరకు సుమారు 2 వేలకు పైగా పెళ్లిళ్లు చేశాను. 1988లో వేదాలు చదవడం మొదలుపెట్టినప్పట్నుంచి ‘నేనెందుకు మహిళా పురోహితురాలిని కాకూడదు?’ అని నాకు నేనే ప్రశ్నించుకునేదాన్ని. వేదాలకు మహిళలు, పురుషులు అన్న భేదం లేదు. అలాంటప్పుడు మనలోనే ఈ తేడాలెందుకు అనిపిస్తుంది. ఈ రోజుల్లో చాలామంది తమ పెళ్లిళ్లు మహిళా పురోహితుల చేతుల మీదుగా జరగాలని కోరుకుంటున్నారు. అది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ మార్పు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా..’ అంటారు భ్రమరాంబ. కేవలం పెళ్లిళ్లే కాదు.. పూజలు, గృహప్రవేశాలు.. ఇలా తన చేతుల మీదుగా జరిగే శుభకార్యాలకు సంబంధించిన విశేషాల్ని, ఫొటోల్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటూ మహిళా పురోహితుల్ని ప్రోత్సహిస్తుంటారామె.
కన్యాదానం చేయరు!
పెళ్లిలో వధువు తల్లిదండ్రులు తమ కూతురిని వరుడి చేతిలో పెట్టి కన్యాదానం చేయడం మనకు తెలిసిందే! అయితే ఈ ప్రక్రియ సరికాదని, అలా చేయడానికి ఆడపిల్లలేమైనా వస్తువులా అంటూ ప్రశ్నిస్తారు పశ్చిమ బంగకు చెందిన మహిళా పురోహితురాలు నందినీ భౌమిక్. పశ్చిమ బంగలో తొలి మహిళా పురోహితురాలిగా కీర్తి గడించిన ఆమె.. తాను జరిపించే పెళ్లిళ్లలో అసలు కన్యాదానానికి చోటివ్వరంటే అది అతిశయోక్తి కాదు.
‘నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో మా సంస్కృతం టీచర్ స్ఫూర్తితో పౌరోహిత్యం వైపు అడుగులేశాను. ఇప్పటివరకు నా చేతుల మీదుగా ఎన్నో వివాహాలు జరిగాయి. అయితే పెళ్లిలో కన్యాదానం అనే తంతుకు నేను దూరం. ఎందుకంటే ఆడపిల్లల్ని అలా దానమివ్వడానికి వారేమీ వస్తువులు కాదు కదా.. అందుకే అలా చేయడం నాకు నచ్చదు. కేవలం హిందూ వివాహాలే కాదు.. కులాంతర, మతాంతర వివాహాలు సైతం చేస్తుంటాను. అంతేకాదు.. నేను చేసే వివాహాలు చాలా సింపుల్‌గా ముగించే విధంగా ప్లాన్ చేసుకుంటా..’ అంటూ తన పౌరోహిత్యం గురించి పంచుకుంటారామె. పెళ్లిలో ప్రతి మంత్రాన్నీ వధూవరులతో ఉచ్ఛరింపజేస్తూ, వాటి అర్ధాల్ని వివరిస్తూ వివాహం జరిపించడం ఆమె ప్రత్యేకతగా చెబుతుంటారు ఆమె చేతుల మీదుగా ఒక్కటైన కొన్ని జంటలు.

వారే మొదటి మహిళా ఖాజీలు!
కేవలం హిందూ వివాహాల్లోనే కాదు.. ముస్లిం వివాహాల్లోనూ మహిళలు ఖాజీలు (ముస్లిం పురోహితులు)గా అవతారమెత్తి జంటల పెళ్లిళ్లు జరిపించడం కూడా ఈ రోజుల్లో మనం చూడచ్చు. అయితే ముస్లిం చట్టం ప్రకారం ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్‌కు చెందిన దారుల్ ఖాజా కమిటీ ఇందుకు 2010లోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు.. హేనా జహీర్, మరియా ఫాజల్ అనే ఇద్దరు ముస్లిం మహిళల్ని ఖాజీలుగా నియమించింది కూడా! ఉత్తరప్రదేశ్‌కు చెందిన వీరిద్దరూ ఇలా దేశంలోనే మొదటి మహిళా ఖాజీలుగా ఘనత సాధించారు. వీరిలో హేనా జహీర్ లక్నోలోని ఓ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ ఎన్జీవో నడుపుతున్నారు. కాగా, మరియా ఫాజల్ డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఇలా వీరిద్దరి చేతుల మీదుగా ఎన్నో ముస్లిం జంటలు ఏకమయ్యాయి. ఇలా పెళ్లిళ్లు చేయడమే కాదు.. దంపతుల మధ్య తగాదాలు, మహిళలపై హింస.. వంటి అంశాల పైనా దృష్టి సారిస్తూ వీరిద్దరూ బాధిత మహిళలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.
ఇలా ఇతర రాష్ట్రాల్లోనే కాదు.. మన తెలుగు రాష్ట్రాల్లోనూ కొంతమంది మహిళలు పౌరోహిత్యం స్వీకరించి పెళ్లిళ్లు, పూజలు, ఇతర శుభకార్యాలు నిర్వహిస్తున్నారు. ఇలా పితృస్వామ్య వ్యవస్థకు తమదైన రీతిలో చెక్ పెడుతూ మహిళా సాధికారతకు బాటలు వేస్తున్నారు.