సాధారణంగా అరవై ఏళ్లు పైబడిన మహిళలకు ఒంట్లో సత్తువ తక్కువగానే ఉంటుంది. బాధ్యతలన్నీ తీరిపోయి ఉంటాయి కాబట్టి ఈ వయసులో విశ్రాంతి తీసుకునేందుకే ఎక్కువ మొగ్గు చూపుతుంటారు. ఇంట్లోని మనవలు, మనవరాళ్లతో కాలక్షేపం చేస్తుంటారు. అయితే ముంబయికి చెందిన రవిబాల శర్మ అనే వృద్ధురాలు మాత్రం 62 ఏళ్ల వయసులోనూ ఎంతో హుషారుగా స్టెప్పులేస్తున్నారు. అద్భుతమైన హావభావాలు పలికిస్తూ సినిమా తారలకు సవాల్ విసురుతున్నారు. ఇంతియాజ్ అలీ, దిల్జిత్ దోసాంజ్ లాంటి సెలబ్రిటీలతో పాటు ప్రముఖ కొరియోగ్రాఫర్లు సైతం ఆమె డ్యాన్స్ ప్రతిభకు ఫిదా అవుతున్నారు.
కుటుంబ బాధ్యతలు మీద పడడంతో!
ఆసక్తి ఉంటే ఏ పని చేయడానికైనా వయసుతో నిమిత్తం లేదని ఇప్పటికే చాలామంది మహిళలు నిరూపించారు. మనిషి జీవితంలో వయసు అనేది కేవలం ఒక నంబరు మాత్రమే నంటూ ఒకప్పుడు కోల్పోయిన అవకాశాలను మళ్లీ అందిపుచ్చుకుంటున్నారు. వయసు, ఎవరేమనుకుంటారోనన్న విషయాలను పక్కన పెట్టి నచ్చిన రంగంలో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఈ క్రమంలో లేటు వయసులోనూ తమ కలలను సాకారం చేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ కోవకే చెందుతారు రవి బాల శర్మ అనే 62 ఏళ్ల వృద్ధురాలు. చిన్ననాటి నుంచే డ్యాన్స్‌ను అమితంగా ప్రేమించిన ఆమె పెళ్లయ్యాక ఇంటి బాధ్యతలు మీద పడడంతో తన అభిరుచిని పూర్తిగా పక్కన పెట్టింది.
తలుపులు వేసుకుని డ్యాన్స్ చేసేదాన్ని!
అయితే దురదృష్టవశాత్తూ భర్త మరణించడంతో పూర్తి డిప్రెషన్లోకి వెళ్లిపోయింది శర్మ. జీవితమంతా ఏదో అంధకారం అలుముకున్నట్లు అనిపించింది. ఈ సమయంలోనే తనెప్పుడో విడిచిపెట్టిన డ్యాన్స్ ఆమెకు ఓ వెలుగురేఖలా కనిపించింది. అందులోనే తన జీవితాన్ని గడపాలనుకుంది. అందుకు కుటుంబ సభ్యులు కూడా పూర్తి సహకారం అందించడంతో తన ప్రతిభకు మరింత పదును పెట్టింది.
‘చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఏ మాత్రం అవకాశం దొరికినా గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని మరీ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేదాన్ని. అయితే అందులో రాణించే అవకాశం మాత్రం లభించలేదు. కళాశాల చదువు పూర్తయిన వెంటనే నాకు పెళ్లైపోయింది. ఆ తర్వాత పిల్లలు, కుటుంబ బాధ్యతలతో డ్యాన్స్‌ను పూర్తిగా పక్కన పెట్టేశాను. ఇలా ఉండగానే నా భర్త మరణించారు. 27 ఏళ్లుగా నాతో కలిసుండి కష్ట సుఖాలు పంచుకున్న ఆయన నన్ను ఒంటరిగా విడిచి వెళ్లిపోవడం తట్టుకోలేకపోయాను. పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిపోయాను.’
ఆయన కల నెరవేర్చడానికే మళ్లీ డ్యాన్స్‌కు దగ్గరయ్యాను!
‘ఈ క్రమంలో నన్ను మళ్లీ మూమూలు మనిషిని చేయడానికి మా కుటుంబ సభ్యులు ఎంతో ప్రయత్నించారు. ఇందులో భాగంగా మళ్లీ డ్యాన్స్ ప్రాక్టీస్ మొదలెట్టమని నన్ను బలవంతం చేశారు. నా భర్త కూడా నన్ను గొప్ప డ్యాన్సర్‌గా చూడాలని కోరుకునేవాడు. ఆయన కల నెరవేర్చడం కోసమే మళ్లీ నేను డ్యాన్స్‌కు దగ్గరయ్యాను. ఈ క్రమంలో నా సోదరి ఓసారి నన్ను డ్యాన్స్ పోటీ ఆడిషన్‌కు తీసుకెళ్లింది. ఆ తర్వాత ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. ఆశ్చర్యకరంగా ఆ వీడియోకు అనూహ్య స్పందన వచ్చింది. వహీదాజీ పాటకు నేను వేసిన డ్యాన్స్ చూసి చాలామంది నెటిజన్లు నన్ను ప్రశంసించారు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా డ్యాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాను’ అంటున్నారీ ఓల్డ్ వుమన్.
ఫాలోవర్ల సంఖ్య పెరిగిపోయింది!
శర్మ గతేడాది జూన్‌లో మొదటిసారిగా తన డ్యాన్స్ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. దీనికి 88 వేలకు పైగానే వ్యూస్ వచ్చాయి. ఆ తర్వాత ఆగస్టులో ఆమె షేర్ చేసిన భాంగ్రా డ్యాన్స్ వీడియోను ఏకంగా 6.16 లక్షల మంది చూడడం విశేషం. ప్రముఖ సింగర్ దిల్జిత్ దోసాంజ్, డైరెక్టర్ ఇంతియాజ్ అలీ, ప్రముఖ కొరియోగ్రాఫర్ టెరన్స్ లూయిస్ లాంటి ప్రముఖులు సైతం శర్మ చేసిన డ్యాన్స్‌లకు ఫిదా అయిపోయారు. తమ సామాజిక మాధ్యమాల ఖాతాల్లోనూ ఆమె డ్యాన్స్ వీడియోలు షేర్ చేస్తూ ప్రశంసల వర్షం కురిపించారు. ఇక నెటిజన్లు అయితే ఆమెను సినీతారలతో పోల్చారు. ఈ నేపథ్యంలో ఆమె ఇన్‌స్టా ఫాలోవర్ల సంఖ్య కూడా భారీగానే పెరిగిపోయింది.
వయసు మీద పడిందని ఎవరూ బాధపడకండి!
ఈ సందర్భంగా తన డ్యాన్స్ వీడియోలకు వస్తున్న స్పందన చూసి తెగ సంబరపడిపోతున్నారు శర్మ. ‘ఈ వయసులో ఇంతటి పేరు, ప్రఖ్యాతులు వస్తాయని నేను కలలో కూడా ఊహించలేదు. నా కలను సాకారం చేస్తూ నన్ను ప్రోత్సహిస్తున్న వారందరికీ ధన్యవాదాలు. వయసు మీద పడిందని ఎవరూ బాధపడకండి. అది కేవలం ఓ నంబర్ మాత్రమే. కలలను సాకారం చేసుకోవడానికి వయసుతో సంబంధం లేదు’ అని అంటున్నారీ సోషల్ మీడియా సెన్సేషన్.