Photos: https://mars.nasa.gov
అంతులేని అంతరిక్షంలో ఎన్నో వింతలు, మరెన్నో అద్భుతాలు! వాటి గురించి తెలుసుకోవాలన్న తపన మనకు తనివి తీరనీయదు. ఆ విశేషాల గురించి అర్థం చేసుకునే క్రమంలో మనల్ని మనమే మరచిపోతాం.. ఇదిగో ఇలాంటి మక్కువే ఆమెను ఏకంగా తన కెరీర్‌నే మార్చుకునేలా చేసింది. ఖగోళంలో ఏముందో తెలుసుకోవాలన్న ఆతృతే ఆమెను గత కొన్నేళ్లుగా నాసాతో కలిసి నడిచేలా చేస్తోంది. ఇక తాజాగా అరుణ గ్రహం (మార్స్/అంగారకుడు)పై పర్సెవరెన్స్ రోవర్ సురక్షితంగా ల్యాండ్ అవడంతో ప్రస్తుతం ఆమె పేరు ప్రపంచమంతా మార్మోగిపోతోంది. ఆమే భారత సంతతికి చెందిన డాక్టర్ స్వాతీ మోహన్. గతేడాది నాసా ప్రయోగించిన మార్స్ రోవర్ మెషీన్ ప్రయోగానికి ఆపరేషన్స్ హెడ్‌గా వ్యవహరిస్తోన్న ఆమె.. తాజాగా ఈ ప్రయోగం విజయవంతం అవడంలో కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో ఈ విక్టరీ గురించి స్వాతి ఏమంటున్నారో తెలుసుకుందాం..
ఇతర గ్రహాలపై జీవుల మనుగడ, అక్కడి వాతావరణం, ఇతర సౌకర్యాలు, సదుపాయాలు.. తదితర అంశాల గురించి తెలుసుకునేందుకు అంతరిక్ష పరిశోధనా సంస్థలు వివిధ ప్రయోగాలు చేయడం మనకు తెలిసిందే! ఈ క్రమంలోనే గతేడాది నాసా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మార్స్ 2020’ స్పేస్ మిషన్ తాజాగా విజయవంతమైంది. ‘పర్సెవరెన్స్’ అనే రోవర్‌ను సురక్షితంగా అరుణ గ్రహంపై ప్రవేశపెట్టడంలో సక్సెసైన ఈ ప్రయోగానికి గైడెన్స్, న్యావిగేషన్ అండ్ కంట్రోల్స్ (జీఎన్&సీ) ఆపరేషన్స్ లీడ్‌గా వ్యవహరిస్తున్నారు డాక్టర్ స్వాతీ మోహన్. 2013లో ఈ ప్రయోగానికి సంబంధించిన పనులు ప్రారంభమైన దగ్గర్నుంచే ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తోన్న ఆమె.. తాజాగా ప్రయోగం విజయవంతమవడంలో కీలక పాత్ర పోషించారు.
పిడియాట్రీషియన్ కావాలనుకొని..!
స్వాతి ఇండియాలోనే పుట్టింది. అయితే తనకి ఏడాది వయసున్నప్పుడే ఆమె తల్లిదండ్రులు అమెరికా వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. నార్తర్న్ వర్జీనియా-వాషింగ్టన్ డీసీ మెట్రో ఏరియాలో పెరిగిన ఆమె.. కార్నెల్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో బీఎస్సీ పూర్తి చేశారు. మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటిక్స్/ఆస్ట్రోనాటిక్స్ విభాగంలో ఎంఎస్, పీహెచ్డీ చదివిన ఆమె.. తొలుత పిడియాట్రీషియన్ (పిల్లల వైద్య నిపుణురాలు) కావాలని కలలు కన్నారు. అయితే అంతరిక్షంలోని అద్భుతాలను తెలుసుకోవాలన్న జిజ్ఞాసే ఆమెను ఇటువైపుగా నడిపించిందని చెబుతున్నారామె.
అది చూశాకే డిసైడయ్యా..!
మన జీవితంలో ఏదో ఒక సందర్భం మన అంతిమ లక్ష్యంపై ఒక అవగాహనకు వచ్చేలా చేస్తుంది. అలా తాను అంతరిక్ష రంగం వైపు అడుగులు వేసేందుకు ఒక టీవీ సిరీస్ దోహదం చేసిందంటున్నారు స్వాతి. ‘నేను పెద్దయ్యాక పిడియాట్రీషియన్ కావాలనుకున్నా. అయితే 9 ఏళ్ల వయసులో ‘స్టార్ ట్రెక్’ అనే సైన్స్ ఫిక్షన్ టీవీ సిరీస్ చూశా. అందులో వారు చేసే ఖగోళాన్వేషణ, ఈ విశ్వంలో మనకు తెలియని ఎన్నో అద్భుతాలు, కొత్త కొత్త ప్రదేశాలు చూసి ముగ్ధురాలినయ్యా. నేనూ అలాగే చేయాలనుకున్నా. ఈ అంతులేని విశ్వంలో ఉన్న జ్ఞానాన్నంతా పొందాలన్న ఉత్సాహం నాలో కలిగింది. కానీ అదెలాగో, అందుకోసం ఏ సబ్జెక్ట్ ఎంచుకోవాలో.. అన్న విషయాలపై నాకు అసలు ఎలాంటి అవగాహన లేదు. అయితే నా 16 ఏళ్ల వయసులో నేను విన్న ఒక ఫిజిక్స్ క్లాస్ నా కెరీర్ గురించి నాకు పూర్తి అవగాహన వచ్చేలా చేసింది. అందుకు ఆ క్లాస్ చెప్పిన టీచర్‌కి ధన్యవాదాలు చెప్పుకోవాలి. అలా అంతరిక్ష రంగంలో ఇంజినీరింగ్ చేయాలని నిర్ణయించుకొని పూర్తి చేశా..’ అంటూ తన జర్నీ గురించి చెప్పుకొచ్చారామె.
పనిచేస్తూనే ఎంతో నేర్చుకుంటా!
గత కొన్నేళ్లుగా నాసాతో కలిసి పనిచేస్తూ పలు ప్రయోగాల్లో భాగమయ్యారు స్వాతి. ఈ క్రమంలో క్యాసిని (శని గ్రహంపై పరిశోధనకు చేపట్టిన మిషన్), గ్రెయిల్ (చంద్రుడిపై వివిధ పరిశోధనల నిమిత్తం చేపట్టిన మిషన్).. వంటి అంతరిక్ష ప్రయోగాల కోసం పనిచేశారామె. ప్రస్తుతం క్యాలిఫోర్నియా పసడేనాలోని నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీలో ‘మార్స్ 2020’ మిషన్ గైడెన్స్, న్యావిగేషన్, కంట్రోల్స్ (జీఎన్ అండ్ సీ) ఆపరేషన్స్ లీడ్‌గా విధులు నిర్వర్తిస్తున్నారీ లేడీ సైంటిస్ట్. అంతేకాదు.. జీఎన్ అండ్ సీ సబ్ సిస్టమ్స్‌కి , ప్రయోగంలో పాలుపంచుకున్న ఇతర బృందాలకు సంధాన కర్తగా కూడా వ్యవహరిస్తోన్న ఆమె.. మిషన్ కంట్రోల్ స్టాఫ్‌కు విధుల కేటాయింపు, మిషన్ కంట్రోల్ రూమ్‌లో పాటించే విధివిధానాల రూపకల్పన తదితర బాధ్యలను సైతం నిర్వర్తిస్తున్నారు. ఇలా నాసాతో కలిసి పనిచేయడం ఓ అద్భుతమైన అనుభూతి అంటున్నారు స్వాతి.
‘నాసా జేపీఎల్‌లో పనిచేయడం అదో అద్భుతమైన అనుభూతి. ఇక్కడ రోజూ ఎన్నో ఉత్తేజకరమైన విషయాలు చోటుచేసుకుంటాయి. ఎంతో ప్రతిభతో కూడిన బృందంతో కలిసి పనిచేయడం, ఈ క్రమంలో ఎన్నో విషయాలు చూడడం, నేర్చుకోవడం అనుక్షణం ఓ సరికొత్త లోకంలోకి తీసుకెళ్తుంది. ఇలాంటి స్నేహపూర్వక వాతావరణంలో పనిచేయడం నిరంతరం ప్రేరణను అందిస్తుంది. అందరిలో అంతరిక్షం పట్ల అవగాహనను పెంచడానికే మేం నిరంతరం కృషి చేస్తుంటాం..’ అంటూ తన టీమ్ గురించి చెబుతారామె.
ఇక తమ ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో హర్షం వ్యక్తం చేసిన ఆమె.. ‘రోవర్ సురక్షితంగా మార్స్ పైకి దిగిందం’టూ తన సంతోషాన్ని పంచుకున్నారు. అంగారకుడిపై జెజెరో అనే లోతైన బిలం సమీపంలో ల్యాండ్ అయిన ఈ రోవర్.. రెండేళ్ల పాటు అంగారకుడిపై పరిశోధనలు సాగిస్తుంది. అక్కడ జీవం ఉందా అనే అంశాన్ని కనిపెట్టేందుకు అక్కడి రాళ్లు, ఉపరితలాన్ని తొలిచి. మట్టిని సేకరించి దానికి అమర్చిన ట్యూబుల్లో భద్రపరుస్తుంది. ఆ తదుపరి వెళ్లే రోవర్ తీసుకొచ్చే ఈ శాంపిల్స్‌ని భూమి పైనే పరిశీలిస్తారు.