Photo: Twitter
నెలలు నిండుతున్న కొద్దీ అతి సుకుమారంగా తయారవుతుంటారు గర్భిణులు. కడుపులోని బిడ్డకు అసౌకర్యం కలుగుతుందేమోనన్న ఉద్దేశంతో ఎక్కడికీ వెళ్లకుండా ఇంటిపట్టునే ఉండిపోతారు. కఠినమైన పనులకు దూరంగా ఉంటూ కుటుంబ సమక్షంలోనే ఉండి జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటిది ప్రజాసేవే పరమావధిగా భావించే ఓ మహిళ ప్రసవానికి కొన్ని గంటల ముందు వరకు కూడా అధికారిక బాధ్యతలు నిర్వర్తించింది. నిండు గర్భంతో ఉన్నప్పటికీ పొద్దుపోయేదాకా కార్యాలయంలోనే ఉన్న ఆమె... విధులన్నీ ముగించుకున్నాకే ఆస్పత్రికి వెళ్లి పండంటి బిడ్డను ప్రసవించింది.
సాధారణంగా 9 నెలల నిండు గర్భంతో ఉండే మహిళలు అత్యవసరమైతే తప్ప బయట అడుగుపెట్టరు. కానీ పనినే దైవంగా భావించే సౌమ్యా గుర్జర్ గర్భంతో ఉన్న సమయంలోనే జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసింది. మేయర్గా విజయదుందుభి మోగించింది. ఆ తర్వాత నెలలు నిండుతున్నా మేయర్ కార్యాలయానికి వచ్చి విధులు నిర్వర్తిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల ౧౦ వ తేదీ రాత్రి పొద్దుపోయేవరకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోనే ఉండి పని చేసిందామె. ఆ తర్వాత నొప్పులు ప్రారంభం కావడంతో ఆస్పత్రికి వెళ్లిన ఆమె గురువారం ఉదయం 5 గంటలకు పండంటి మగబిడ్డను ప్రసవించింది.
నాకు పనే దైవం!
ఈ క్రమంలో తాను రెండోసారి తల్లయిన శుభవార్తను ట్విట్టర్ వేదికగా అందరితో షేర్ చేసుకుంది సౌమ్య. ‘పనే నాకు దైవం. బుధవారం రాత్రి వరకు మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్లో పాల్గొన్నాను. 12.30 గంటలకు ప్రసవ నొప్పులతో ఆస్పత్రిలో చేరాను. దేవుడి దీవెనలతో గురువారం ఉదయం 5.14 గంటలకు పండంటి బాబును ప్రసవించాను. ప్రస్తుతం మేమిద్దరం క్షేమంగానే ఉన్నాం’ అంటూ రాసుకొచ్చిందీ మహిళా మేయర్.
గర్భంతో పని చేయడం ఒక సవాలే!
రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి పదవిలో ఉన్నప్పుడు ఒక బిడ్డకు జన్మనిచ్చిన మొదటి మహిళా మేయర్గా సౌమ్య గుర్తింపు పొందింది. ఇప్పటికే ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆమె జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు రెండోసారి గర్భం దాల్చింది. గర్భంతోనే ఎన్నికల్లో పోటీ చేసిన ఆమె ఏకంగా జైపూర్ నగర్ నిగమ్ (గ్రేటర్) మేయర్గా ఎన్నికైంది. ఆ తర్వాత కూడా ప్రజాసేవకే ప్రాధాన్యమిస్తూ నిండు గర్భంతోనే అధికారిక బాధ్యతలు నిర్వర్తించింది. ప్రసవ సమయం దగ్గర పడుతున్నా సెలవులు తీసుకోలేదు. ఈ క్రమంలో జనవరి 30న ఆయుష్మాన్ భారత్-మహాత్మా గాంధీ రాజస్థాన్ ఆరోగ్య బీమా పథకం ప్రారంభోత్సవంలో పాల్గొంది. ఆ తర్వాత మేయర్ హోదాలో మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ను కూడా సమర్పించింది. ఇక ఈ నెల 7న రాజస్థాన్లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పర్యటనకు కూడా హాజరైన సౌమ్య ‘గర్భంతో ఉన్నప్పుడు పని చేయడం ఎంతో ఉత్తేజాన్నిస్తోంది. ఒక సవాలుగా కూడా నిలుస్తోంది. కొత్త పనులు ప్రారంభించినప్పుడు ఈ నొప్పులన్నీ మర్చిపోతాను’ అంటూ మహిళల్లో స్ఫూర్తి నింపిందీ సూపర్ మేయర్.
పనే దైవమంటూ సౌమ్య షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచింది. పలువురు ప్రముఖులు, నెటిజన్లు సౌమ్యకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.